అచ్చంగా అమ్మ ఒడి

18 Mar, 2019 09:31 IST|Sakshi

అమ్మ ఒడి.. పేరు ఎంత అందమైనదో పథకమూ అంత అపురూపమైనది. ఆర్థిక స్థోమత కారణంగా చదువులకు దూరమైపోతున్న మధ్య, పేద వర్గాల వారిని ఆదుకునేందుకు వైఎస్‌ జగన్‌ ఊపిరిపోసిన పథకమిది. చిన్నారిని బడికి పంపితే ఏటా రూ.15వేలు ఇస్తానన్న జగన్‌ ప్రకటనతో ఎంతో మంది తల్లుల ఆశలకు ప్రాణమొచ్చింది. కూలీనాలీ చేసుకుని బిడ్డల చదువుల గురించి బాధపడే మాతృమూర్తులకు ఈ ప్రకటన వరంలా మారింది. ‘ఎంతైనా చదివించండి.. నేను చూసుకుంటాను’ అని జగన్‌ ఇచ్చిన ధైర్యం వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ పథకం అమలైతే జిల్లాలో ఆరు లక్షల మంది లబ్ధిపొందుతారు. చదువుకు దూరమవుతున్నాననే బాధ ఇక ఏ చిన్నారి ముఖంలోనూ కనిపించదు. 
 

జగన్‌ మాటల్లో..  
‘చదువు ఉంటే సమస్తం మన దగ్గరికే వస్తాయి. అక్కా చెల్లెళ్లకు ఒక విషయం చెబుతున్నా.. ఒక ఇంట్లో ఇంజినీరు, మరో ఇంట్లో డాక్టరు, ఇంకొక ఇంట్లో ఉన్నత ఉద్యోగం ఉంటే.. ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటపడతాయని నాన్నగారు,. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఎప్పుడూ అంటుండేవారు. దేశంలో ఎక్కడాలేని ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని తీసుకొచ్చారు. పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. నాన్ననే స్ఫూర్తిగా తీసుకుని చెబుతున్నా. పేదల కోసం ఆయన ఒకడుగు ముందుకేస్తే... జగన్‌ రెండు అడుగులు ముందుకు వేస్తాడని హామీ ఇస్తున్నా. మీ పిల్లలను ఏ చదువులు చదివిస్తారో మీ ఇష్టం. ఎన్ని లక్షల ఖర్చు అయినా వారిని నేను చదివిస్తానని మాట ఇస్తున్నాను. మీ పిల్లలకు ఉచితంగా చదివిస్తాను. అంతేకాదు.. ఆ పిల్లల హాస్టల్లో ఉండి చదవాలన్నా చదువుకోవచ్చు. హాస్టల్స్‌లో ఉన్న పిల్లలకు వసతి, భోజన ఖర్చుల కింద ఏడాదికి రూ.20వేలు ఇందిస్తాం. ప్రతి తల్లికి చెబుతున్నా.. మీరు చేయాల్సిందంతా మీ పిల్లలను బడికి పంపడమే. బడికి పంపిన ప్రతి తల్లికి ఏడాదికి రూ.15వేలు చొప్పున ఇస్తానని హామీ ఇస్తున్నా’ అంటూ మధ్య, దిగువ తరగతి తల్లులకు మాటిచ్చారు. ఈ పథకానికే ‘అమ్మ ఒడి’ అని అందమైన పేరు పెట్టారు.  

వైఎస్‌ఆర్‌తో చదువుల విప్లవం
ఒకప్పుడు ఇంజినీరింగ్, మెడిసిన్‌ విద్యలు చాలా మందికి కలగానే ఉండేవి. కానీ వైఎస్సార్‌ ముఖ్యమంత్రి అయ్యాక ఆ కలలు నెరవేరాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ద్వారా వేలాది మంది పట్టభద్రులయ్యారు. కానీ ఆయన మరణం అనంతరం ఏర్పడిన ప్రభుత్వాలు ఈ పథకాన్ని నిర్లక్ష్యం చేశాయి. బాబు పాలనలోనైతే ఈ పథకం పూర్తిగా నిర్వీర్యమైపోయింది.  


జిల్లాలో ఇదీ పరిస్థితి
జిల్లాలో ఒకటి నుంచి 10వ తరగతి వరకు అన్ని యాజమాన్యాల పరిధిలో దాదాపు 3940 వరకు పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో సుమారు 3.82లక్షల ముంది విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో చదువులు సాగిస్తున్నారు. ఆర్థిక పరిస్థితులు, అవగాహన లోపం, సక్రమంగా నడవని ప్రభుత్వ పాఠశలలు, ప్రభుత్వం నిర్లక్ష్యం ఇతరత్ర కారణాల వల్ల జిల్లాలో సుమారు 4255 మంది వరకు చిన్నారులు ప్రస్తుతం బడికి దూరంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మొత్తమ్మీద జిల్లాల్లో అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ద్వారా పాఠశాల విద్యతోపాటు ఇంటర్మీడియెట్, పాలిటెక్నికల్, ఇంజినీరింగ్, ఐటీఐ. ఒకేషనల్‌ కోర్సులు, ఇతరత్ర విద్యా రంగంతో ముడిపడి ఉన్న సుమారు 6లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.   

ఆర్థిక భరోసా
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన అమ్మ ఒడి పథకం చాలా బాగుంది. పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికి ఏడాదికి రూ.15వేలు చెల్లించడం గొ ప్ప సాహసోపేత నిర్ణయం. తద్వారా తల్లులకు ఆర్థిక భరోసాను కూడా ఇచ్చినట్టవుతుంది. పథకాన్ని అన్ని వర్గాల విద్యార్థులకు అందే విధంగా చూడాలి. 
– బమ్మిడి పోలీసు,  విశ్రాంత డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌


బడికి చేరువ చేయవచ్చు..
ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన బడి ఈడు పిల్లలను పూర్తిగా చదువుల బాట పట్టే విధంగా బృహత్తరమైన ఆలోచనలు చేయాలి. ఇప్పటికీ చాలామంది పిల్లలు బాల కార్మికులుగానే మిగిలిపోతున్నారు. చాలా బాధాకరం. డ్రాపౌట్స్‌ను పూర్తిగా నిర్మూలించాలి. అయితే అమ్మ ఒడి పథకంతో పేదలకు విద్యను చేరువ చేయవచ్చు.
– పైడి సునీత, శ్రీకాకుళం


పేదల జీవితాల్లో వెలుగు..    
తండ్రి రాజశేఖరరెడ్డి ఫీజు రీయిం బర్స్‌మెంట్‌ను ప్రవేశపెట్టి ఉన్నత చదువులు ఉచితంగా తడివించారు. ఇప్పుడు ఆయన కొడుకు జగన్‌మోహన్‌రెడ్డి కూడా తండ్రి మాదిరిగానే పేదల జీవితాల్లో వెలుగులు నింపాలని చూస్తున్నాడు. అమ్మ ఒడి పథకం ద్వారా ప్రతి తల్లి కళ్లలో ఆనందాన్ని చూడవచ్చు. 
–ఎల్‌.లక్ష్మీనరసింహ దేవి, వమ్మరవల్లి గ్రామం   

మరిన్ని వార్తలు