సం‘గ్రామ’ విజేత వైఎస్సార్ సీపీ

1 Aug, 2013 05:49 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ప్రతిష్టాత్మకమైన పంచాయతీ పోరులో వైఎస్సార్ కాంగ్రెస్ విజయదుందుభి మోగించింది. పల్లె ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్‌కు విజయహారతులు పట్టారు. టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలను తిప్పికొట్టారు. జిల్లాలో మూడు విడతల్లో కలిపి అత్యధిక పంచాయతీల్లో వైఎస్సార్ సీపీ విజయం సాధించి అగ్రస్థానంలో నిలిచింది. టీడీపీ ద్వితీయ, కాంగ్రెస్ తృతీయస్థానాల్లో ఉన్నాయి.
 
 బుధవారం జరిగిన మూడో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ వైఎస్సార్ సీపీ ప్రభంజనం కొనసాగింది. మూడో విడత 169 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికలు జరిగిన మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం నియోజకవర్గాలు మూడింటిలోనూ వైఎస్సార్ సీపీ బలపరిచిన అభ్యర్థులు ముందంజలో నిలిచారు. వైఎస్సార్ సీపీ బలపరిచిన అభ్యర్థులు 85 పంచాయతీలను కైవసం చేసుకుని ప్రథమస్థానంలో, టీడీపీ బలపరిచిన అభ్యర్థులు 25 పంచాయతీలలో గెలిచి రెండోస్థానంలో, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 25 పంచాయతీలు చేజిక్కించుకుని మూడో స్థానంలో నిలిచారు. స్వతంత్రులకు 34 పంచాయతీలు దక్కాయి. కాగా ఏకగ్రీవాలు, మొదటి, రెండు, మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలను కలిపితే వైఎస్సార్ సీపీ బలపరిచిన అభ్యర్థులే అత్యధిక పంచాయతీల్లో విజయ కేతనం ఎగురవేశారు.  
 
 జిల్లాలో అగ్రపీఠం వైఎస్సార్ సీపీదే
 ఏకగ్రీవాలు, మొదటి, రెండు, మూడో విడతల్లో కలిపి జిల్లాలో వైఎస్సార్ సీపీ అత్యధిక పంచాయతీల్లో విజయదుందుభి మోగించింది. ఆ పార్టీ మొత్తం మీద 397 పంచాయతీల్లో విజయం సాధించింది. టీడీపీ 319 పంచాయతీల్లో గెలిచి రెండోస్థానంలో నిలిచింది. కాంగ్రెస్ కేవలం 196 పంచాయతీలే దక్కించుకుని మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇతరులకు 81 పంచాయతీలు దక్కాయి.
 

మరిన్ని వార్తలు