'అన్యమతమంటూ దుష్ప్రచారం చేస్తున్నారు'

25 Dec, 2019 16:29 IST|Sakshi

సాక్షి, విజయవాడ : సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాల వికాస కేంద్రం పాఠశాలల ద్వారా బాల, బాలికలకు సంప్రదాయాలు అలవర్చుకునేలా విద్యాబుద్ధులు నేర్పడం శుభపరిణామమని టీటీడీ చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం విజయవాడలో సమరసత సేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన బాల వికాస కేంద్రం పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమానికి వైవి సుబ్బారెడ్డి హాజరయ్యారు.

ఆయన మాట్లాడుతూ.. బాలవికాస కేంద్రాలు హిందూ ధర్మరక్షణకు దోహదపడుతున్నాయని, దళితులకు సైతం వేద, మంత్ర పఠనం నేర్పిస్తున్నట్లు వెల్లడించారు. అన్యమత ప్రచారం చేస్తున్నామంటూ మాపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేవాలయాల నిర్మాణాలకు ఇప్పటివరకు రూ. 5 లక్షలు ప్రభుత్వం వెచ్చిస్తుండగా, ఇప్పుడు దానిని రూ 7 లక్షల నుంచి రూ 10లక్షల వరకు పెంచనున్నట్లు వివరించారు. దళితవాడల్లో, గిరిజన ప్రాంతాల్లో దేవాలయాలను ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటివరకు 500 దేవాలయాలను నిర్మించామని ఆయన తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా 115 బాల వికాస కేంద్రాలు ఉన్నాయని, వీటి సంఖ్య మరింత పెంచనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. చదువు రాని పెద్దలకు విద్య నేర్పాలా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. సంప్రదాయ విలువలు పెంపొందించేలా దార్మిక సదస్సులను ప్రతి నెలా ఒకటి చొప్పున నిర్వహిస్తామని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లాలోని 8 మండలాలకు చెందిన బాల వికాస కేంద్రం పాఠశాల విద్యార్థులు, ఫౌండేషన్‌ సభ్యులు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా