నాటకాలు కట్టి పెట్టండి

4 Feb, 2018 11:19 IST|Sakshi

ఒంగోలు టౌన్‌: రాష్ట్ర ప్రయోజనాల పేరుతో ముఖ్యంత్రి చంద్రబాబు పెద్ద డ్రామాలాడుతున్నారని  ఒంగోలు పార్లమెంటు సభ్యుడు వైవీ సుబ్బారెడ్డిధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపర్చిన రామాయపట్నం పోర్టు గురించి కేంద్రాన్ని అడిగే దమ్ము, ధైర్యం సీఎంకు లేదన్నారు. దుగరాజపట్నంలో పోర్టు నిర్మాణానికి అనువుగా లేదని నీతి అయోగ్‌ తేల్చితే ఆ సమయంలో రామాయపట్నం పోర్టు ముఖ్యమంత్రికి గుర్తుకు రాలేదా..? అని ప్రశ్నించారు.

రామాయపట్నంలో పోర్టు నిర్మించాలని కోరుతూ ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్‌ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన ముఖ్యవక్తగా పాల్గొని ప్రసంగించారు. రామాయపట్నం కోసం రోడ్డెక్కడం కొత్తకాదని, నాలుగేళ్ల నుంచి పోరాడుతూనే ఉన్నామన్నారు. రామాయపట్నం పోర్టుకు అన్ని విధాలా అనుకూలమని తేలినప్పటికీ దాని కోసం కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదని ప్రశ్నించారు.  దుగరాజపట్నంలో పోర్టు నిర్మించకపోతే రామాయపట్నంలో నిర్మించమని అడగాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా? అని నిలదీశారు.

నాలుగేళ్లుగా చోద్యం చూస్తున్నారు..
కడపలో స్టీల్‌ ప్లాంట్‌ ఇస్తామన్నారు అదీ లేదు, విశాఖలో రైల్వే జోన్‌ నిర్మిస్తామన్నారు అదీ లేదు. నాలుగేళ్లు కేంద్రంలో భాగస్వామ్యంగా ఉంటూ చోద్యం చూస్తున్నారని ఎంపీ వైవీ విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు పోరాటాలు చేస్తూ ప్రజాస్వామ్య పద్దతిలో బంద్‌చేస్తే కేసులుపెట్టి జైళ్లలో పెట్టారన్నారు. ప్రకాశం జిల్లా ఆవిర్భవించి అర్ధ శతాబ్దమైనా ప్రజలకు కనీసం తాగునీటిని కూడా అందించలేదన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే వెలుగొండ ప్రాజెక్టు నిర్మిస్తామంటూ ఓట్లు వేయించుకొని జిల్లా ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారన్నారు.

జిల్లాపై సీఎంకు శతృత్వ భావం: మాజీ మంత్రి వడ్డే
ప్రకాశం జిల్లాపై ముఖ్యమంత్రి శతృత్వ భావంతో ఉన్నారని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శించారు. రూ.24 వేల కోట్లతో రామాయపట్నంలో పోర్టు ఏర్పాటుకు అప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ప్రతిపాదిస్తే అప్పటి ఎంపీ చింతా మోహన్‌ దానిని దుగరాజపట్నానికి హైజాక్‌ చేశారన్నారు. దుగరాజపట్నం పోర్టుకు అనువైందికాదని రెండు నిపుణుల కమిటీలు స్పష్టం చేసినప్పటికీ ముఖ్యమంత్రి మాత్రం దానివైపే మొగ్గు చూపుతున్నారన్నారు. చంద్రబాబు చిన్నవాడా, తెలియనివాడా, తొమ్మిదేళ్లు సీఎంగా చేసిన వ్యక్తి, పదేళ్లు ప్రతిపక్షనేతగా ఉన్న వ్యక్తి కృష్ణపట్నం పోర్టు ప్రయోజనాల కోసం రామాయపట్నానికి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. జిల్లా సర్వతాభివృద్ధికి రామాయపట్నం పోర్టు అవసరం ఉన్నా, దానికి అనుకూలంగా వ్యవహరించడంలేదన్నారు. రామాయపట్నం పోర్టుపై రెండు మూడు నెలల్లో ప్రకటన చేయకుంటే జిల్లాలో తిరిగే నైతిక హక్కును ముఖ్యమంత్రి కోల్పోతారన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా