అతిథి ఉన్నా.. ఆదాయం కరువు

20 Jun, 2019 11:35 IST|Sakshi
ఖాళీగా ఉన్న జెడ్పీ అతిథి గృహం

ప్రభుత్వ అతిథి గృహాలను అద్దెకు ఇవ్వని వైనం

ప్రైవేట్‌ లాడ్జీలకు రూ.లక్షల్లో ఆదాయం

గత ప్రభుత్వంలో పాలకులు, అధికారుల నిర్లక్ష్యం

సాక్షి, అచ్యుతాపురం (విశాఖపట్నం): అతిథి గృహాలున్నా ఆదాయం మాత్రం సున్నా. ఎస్‌ఈజెడ్‌ పరిశ్రమలు, కొండకర్ల ఆవ, తంతడి బీచ్‌ పర్యాటక ప్రదేశాలు ఉన్నందున అతిథి గృహాలకు గిరాకీ ఉంది. పరిశ్రమలకు వచ్చే అతిథులు, పర్యాటకం కోసం వచ్చే ఔత్సాహికులు సేదదీరడానికి అతిథి గృహాల అవసరం ఉంది. అతిథుల తాకిడి ఎక్కువకావడంతో ఇక్కడ ఏడు లాడ్జీలు వెలిశాయి. ఒక్కొక్క గదికి రోజువారి అద్దె రూ.15 వందల వరకూ ఉంది. ఇలా ప్రైవేట్‌ లాడ్జీలకు రూ.వేలల్లో ఆదాయం వస్తున్నా స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో రూ.25 లక్షల వ్యయంతో నిర్మించిన జెడ్పీ అతిథి గృహానికి ఒక్క రూపాయి కూడా ఆదాయం రావడం లేదు.

అద్దెకు ఇస్తారన్న సమాచారం ఎవరికీ తెలియదు. ఇన్నాళ్ల నుంచి ప్రజాప్రతినిధులు అతిథి గృహాన్ని వాడుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు సొంత జాగీరుగా అతిథి గృహాన్ని వాడుకున్నారు. ఈ అతిథి గృహంలో అన్ని వసతులు ఉన్నందున రోజుకు రూ.ఐదు వేలకు మంచి ఆదాయం సమకూరే అవకాశం ఉంది. కొండకర్లలో అతిథి గృహ భవనం శిథిలమైంది. గతంలో ఇక్కడి గదులు అద్దెకు ఇచ్చేవారు. అద్దెను అక్కడి వాచ్‌మెన్‌ తీసుకొనేవాడు. ఇప్పుడు భవనం శిథిలమవడంతో  ఆదాయం రాలేదు.

ఉండేందుకు సౌకర్యాల్లేక..
కొండకర్ల, తంతడి బీచ్, అచ్యుతాపురం,చోడపల్లి పరిధిలో గెస్ట్‌హౌస్‌ల నిర్మాణం అవసరం ఉంది. పర్యాటక ప్రదేశాలకు కుటుంబ సమేతంగా పర్యాటకులు వస్తున్నారు. వారు సేదదీరడానికి అతిథిగృహాల అవసరం ఉంది. తీరప్రాంతంలో విరివిగా సినిమా షూటింగ్‌లు జరుగుతున్నాయి. వారికి అతిథిగృహాలు అందుబాటులో లేకపోవడంతో విశాఖకు తరలివెళ్లిపోతున్నారు.

పంచాయతీలకు ఆదాయం కరువు
మండల పరిషత్‌ కార్యాలయం వద్ద అతిథిగృహం ఉంది. తంతడిలో రెండు తుపాను షెల్టర్లు ఉన్నాయి. ఎస్‌ఈజెడ్‌కు సమీపంలో పూడిమడకలో మూడు తుపాను షెల్టర్లు ఉన్నాయి. తుపాను సమయంలో వీటి అవసరం ఉంటుం ది. అంతవరకూ ఖాళీగా ఉంటున్నాయి. ఒక్కక్క భవనానికి ప్రభుత్వం రూ.కోటికి మించి వెచ్చించింది. భవనం బాగోగులు చూడకపోతే పాడైపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం భవనం వాచ్‌మెన్‌లు అనధికారికంగా భవనాన్ని అద్దెకు ఇచ్చి తృణమోపణమో తీసుకుంటున్నారు.  తంతడిలో తుపాను షెల్టర్‌ని నెలరోజులు సీరియల్‌ షూటింగ్‌కి అనధికారికంగా అద్దెకు ఇచ్చారు. గ్రామంలో కొందరు టీడీపీ కార్యకర్తలు ఈ సొమ్ము స్వాహా చేశారన్న విమర్శలున్నాయి. పంచాయతీకి ఏమాత్రం ఆదాయం రాలేదు.

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా..
రూ.కోట్ల వ్యయంతో నిర్మించిన తుఫాను షెల్టర్లు గ్రామనాయకుల విలసాలకు అడ్డాగా మారింది. ఆధునిక వసతులతో నిర్మించిన భవనాలలో పేకటరాయుళ్లు దర్జాగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. గ్రామనాయకుల ఇళ్లలో వేడుకలు జరిగినప్పుడు తుపానుòషెల్టర్లను విడిదిగా వినియోగిస్తున్నారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు మండలానికి వచ్చినప్పుడు సేదదీరడానికి మాత్రమే గెస్ట్‌హౌస్‌లు ఉపయోగపడుతున్నాయి. ఎలాంటి ఆదాయం సమకూరలేదు.

ఆదాయం పోతోంది
అచ్యుతాపురం పరిసరాలలో చిన్న గదికి రూ.3 వేల అద్దె వస్తుంది. పరిశ్రమలకు వచ్చేవారు. పర్యాటకులకు రోజువారీగా అద్దెకు గెస్ట్‌ హౌస్‌లు కావాలి. రూ.లక్షల ఖర్చుతో నిర్మించిన గెస్ట్‌హౌస్‌లు ఇంతవరకూ అద్దెకు ఇచ్చిన దాఖలాలు లేవు. రూపాయి ఆదాయం రాలేదు. గెస్ట్‌హౌస్‌లు, ప్రైవేటు భవనాలను పంచాయతీకి అప్పగించి అద్దెకి ఇస్తే సమృద్ధిగా ఆదాయం వస్తుంది.
– సూరాడ ధనరాజు, పూడిమడక

అద్దెకు ఇస్తే రూ.వేలల్లో ఆదాయం
తంతడిలో పర్యాటకులు సంఖ్య పెరిగింది. షూటింగ్‌లు జరుగుతున్నాయి. ప్రస్తుతం కోట్ల రూపాయలతో నిర్మించిన తుఫాను షెల్టర్లు ఖాళీగా ఉన్నాయి. వాటిని అద్దెకి ఇచ్చి పంచాయతీకి ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. పంచాయతీ సిబ్బందిలో ఒకరు భవనాలను అద్దెకు ఇచ్చే ప్రక్రియపై దృష్టిసారించడంతో నెలకు రూ.20వేల ఆదాయం వస్తుంది. ఇకనైనా అధికారులు దృష్టిపెట్టి ప్రస్తుతం ఉన్న ఖాళీభవనాలను అద్దెకు ఇవ్వడంతో ఆదాయం వస్తుంది. పారిశుధ్యం, తాగునీటి సమస్యను పరిష్కరించుకోవడానికి వీలవుతుంది.
– చోడిపల్లి దేముడు, తంతడి

మరిన్ని వార్తలు