రాశి ఫలాలు (సౌరమానం) (03-08-2019)

3 Aug, 2019 09:13 IST|Sakshi

జన్మనక్షత్రం తెలియదా? నో ప్రాబ్లమ్‌! మీ పుట్టినరోజు తెలుసా? మీ పుట్టిన తేదీని బట్టి ఈవారం (ఆగస్ట్‌ 3 నుండి 9 వరకు) మీ రాశి ఫలితాలు- డా‘‘ మైలవరపు శ్రీనివాసరావు జ్యోతిష్య పండితులు

మేషం(మార్చి 21 –ఏప్రిల్‌ 19)
ప్రభుత్వంతో ముడిపడిన ఏ సమస్యలైనా సరే అధికారుల సుముఖత కారణంగా తప్పక పరిష్కారమవుతాయి. అయితే కొద్దికాలం పట్టవచ్చు.
కాలం పట్టినా మీరనుకున్నది అనుకున్నట్టుగానే ఫలితం ఉండబోతోంది కాబట్టి మానసిక తర్జన భర్జనలూ ఆందోళనా అవసరం ఉండదు– లేదు కూడా.
కాంట్రాక్టర్లకి ధనలాభం ఉంటుంది. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. కొద్దికాలం మాత్రం ఎదురు చూడాల్సి ఉంటుంది. అయితే ఫలితం పూర్తి సానుకూలంగా ఉంటుంది. మీకున్న ఆవేశాన్నీ సాహసాన్నీ నియంత్రించుకుని ఉండాల్సిందే.
రెచ్చగొట్టి మిమ్మల్ని అధికారుల మీదికో ప్రభుత్వం మీదికో లేక ఇరుగుపొరుగుల వారి మీదికో దూకేలా చేసే వ్యక్తులకి ఎంత దూరంగా మీరుండగలిగితే అంత ఆనందంగానూ ఈ వారం గడుస్తుంది. శ్రద్ధ పెట్టండి.
ఆరోగ్యం అనుకూలిస్తుంది. శస్త్ర చికిత్స తప్పదని భయపెట్టిన వైద్యుడు కాస్తా ఔషధాలతోనే వ్యాధి అదుపులోకొస్తుంది.
తగిన సమయంలో సరైన ఔషధాన్ని సక్రమంగా ఉపయోగించండి. ఆరోగ్యం మీకు కరతలామలకం.
ఆదాయం కంటె వ్యయం ఎక్కువ ఉండవచ్చు. ఇరుగు పొరుగుల వారితో చిన్న విరోధం వచ్చే అవకాశం ఉంది కాబట్టి మితభాషణం మంచిది– ముఖ్యంగా స్త్రీలకి.

లౌకిక పరిహారం: ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టి సకాలంలో ఔషధ సేవ చేయండి.
అలౌకిక పరిహారం: లక్ష్మీదేవిని తెల్లని వస్త్రాలు కట్టుకుని తెల్లని పూలతో పూజించండి.

వృషభం  (ఏప్రిల్‌ 20 –మే 20)
సోదరుల మధ్యలో ఇరుగు పొరుగుల మధ్యనో చిన్నగా వాగ్వివాదం పెద్దదై రెండిళ్ల మధ్యా గోడని కట్టుకోవలసిన పరిస్థితిని తెచ్చేయవచ్చు. ఒకసారంటూ ఓ నిర్ణయానికొచ్చాక ఇక వాయిదా వేయకండి. కానిచ్చెయ్యండి. అయితే దీనిద్వారా తొందరపాటు మాట ద్వారా రాబోయే ఫలితం ఏమిటో, వ్యయం ఎంతో, ఒక ఆత్మీయునితో స్నేహాన్ని చెడగొట్టుకునేందువల్ల వచ్చే లాభమెంతో గమనించుకోండి. అయిపోయిందేదో అయిపోయింది కాబట్టి ఇంకా వాళ్లమీద కోప– ద్వేషాలని కలిగి ఉండకండి. వాళ్లు అలా మీమీద చాడీలనీ నిందలనీ... ప్రచారం చేస్తూంటే మౌనంగా ఉండండి. వాళ్ల మాటల్ని విన్నవాళ్లు మళ్లీ మీతో ఆ మాటల్ని చెప్పబోతే వారించండి– విననే వినననీ, చెప్పనే చెప్పవద్దనీనూ. పేడతట్ట మీది మూతను ఓసారి తెరిచి చూసుకుంటే ఎలా ఉంటుందో జరిగిపోయిన వ్యవహారాన్ని గురించి చర్చించు కుంటూంటేనూ అలానే ఉంటుంది.
కుటుంబంలో ఆస్తి పంపకాల గురించిన సూచనలు రావచ్చు. ముసుగులో వ్యవహారం కాకుండా– సోదరులందర్నీ పిలిచి ఆస్తి పరిష్కారానికి ధర్మబద్ధ పరిష్కారాన్ని ప్రకటించండి. అంగీకరించని పక్షంలో పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించేసుకోండి తప్ప విషయాన్ని నాన్చకండి. రెండు మూడు రోజులంటూ సమయాన్ని మీకుగా మీరు ప్రార్థించకండి. ఇప్పుడే ఓ అవగాహనకి వచ్చేసి ఉండండి.
కవులూ పండితులూ కళాకారులూ సంగీత విద్వాంసులూ... ఇలా ఎందరో ప్రతిభావంతులకి జరిగే సన్మాన కార్యక్రమానికి మీరు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఆనందించండి.

లౌకిక పరిహారం: సంతోషంతో ఉండాలని భావించుకోండి.
అలౌకిక పరిహారం: లక్ష్మీదేవిని పసుపు జలంతో శ్రీ సూక్తంతో అభిషేకించండి.

మిథునం (మే 21 – జూన్‌ 20)
పాము తిరుగుతున్న ఇంట్లో ఓ రాత్రి నిద్ర చేయవలసి వచ్చినట్లుగా అన్ని సౌకర్యాలూ ఆనందాలూ ఉన్నప్పటికీ ఎందుకో తెలియని ఓ కొరతతో మానసికంగా చిన్న వ్యధతో ఉంటారు. దీనివల్ల కలిగే నష్టం దుఃఖం అంటూ ఏమీ ఉండదు కానీ పూర్తి సంతోషంతో ఉండలేకపోవచ్చు. కుజ బుధ రాహు కేతువులు నలుగురూ అననుకూలురుగా ఉండడం దీనిక్కారణం.
ఆర్థికంగా కలుసుబాటుతనం ఉంటుంది. రావలసిన బకాయిలు క్రమ క్రమంగా వస్తూ ఉంటాయి. ఎవరైనా వచ్చి రుణం కావాలంటే– ఇయ్యలేనని చెప్పగల దృఢత్వం మీకు వచ్చేసింది కాబట్టి ఆ భయమూ లేదు. తక్కువగా మాట్లాడే స్వభావం క్రమ క్రమంగా మీలో వస్తున్నందువల్లా మీ పనిమీదే ధ్యాస మొత్తం కేంద్రీకరింపబడి ఉంటూండడం వల్లా అలా వినోద విహార స్థలాలకి వెళ్లలేకపోతూండవచ్చు. అయితే మీ దంపతులు ఒకేచోట ఉన్నా భిన్నభిన్నమైన ఆసక్తి కలిగిన వారిగా మారి ఇద్దరూ కలిసి ఒక ప్రదేశానికంటూ వెళ్ల(లే)కపోవచ్చు. అది కొద్ది మనస్తాపం అనిపించవచ్చు.
స్నేహితుల్లో మంచి ఆప్తుడైన వానితో మళ్లీ సాన్నిహిత్యం ఏర్పడుతూ ఉండచ్చు. అది మీకు మంచిదే. సుఖాన్నీ దుఃఖాన్నీ నిలవ చేసుకునే స్థలం ఆప్తుని మనసు– అంటుంది జ్యోతిషం. ఆనందాన్ని పంచుకోండి. దుఃఖాన్ని చెరిసగం చేసుకుంటూ ఉండండి. ఇది మీకు నిజానికి మంచి కాలమే. కాబట్టీ– మీదే అనవసర మనస్తాప ఆలోచనతో ఉంటున్నారు కాబట్టీ ఆధ్యాత్మిక ప్రసంగాలనీ గ్రంథాలనీ చదువుతూ ఉండండి. మనోధైర్య స్థాయి పెరుగుతూ ఉంటుంది. భౌతిక చికిత్స వద్దు.

లౌకిక పరిహారం: మెరుపుతీగతో పాటు నల్లని మబ్బుని కూడా చూచి ఆనందించండి.
అలౌకిక పరిహారం: పసుపు వస్త్రాలని ధరించి పసుపు జలంతో లక్ష్మీదేవిని అభిషేకించండి.

కర్కాటకం (జూన్‌ 21 –జూలై 22)
చేయాల్సిన పనిని గూర్చి ఎలా చెయ్యాలి? ఎప్పుడు చెయ్యాలి? ... అని ఈ తీరుగా ఆలోచించుకుంటూండడం, అది ఎలా కావడానికి వీలు లేదో దాన్ని గురించి అంతర్మథనానికి గురి అవుతూ ఉండడంతో ఈ వారం మొత్తం గడవచ్చు. లోపల సంశయాస్పద భావన ఉన్నంత కాలం ఏదీ జరగడం లేదనే నిరాశాధోరణి ఉన్నంత కాలం ఏ పనినీ చేయలేరు. పనిలోకి దూకడం సరైన కర్తవ్యం. ముందు ఓ వ్యవహారం విషయంలో పట్టుదలకి పోయి ధనం, కాలం, ఆరోగ్యం... నష్టపోయి అనుభవం మీద– పట్టుదల అనేది నష్టానికే తోవ తీస్తుందనే విషయాన్ని గ్రహించుకుని పట్టుదలని మాని అనుకూల ఆలోచనల వైపుకి వస్తారు. ఇది నిజంగా ఆహ్వానించదగిన పరిణామం. సమయానికి తగినట్టుగా వ్యవహరించాలనే దృక్పథాన్ని అలవరచుకుంటారు. చేయదగిన పని ఇదే కూడా. సొంత వృత్తిని చేసుకుంటూ జీవించే వాళ్లకి పాతతరం మారిపోతూ కొత్తతరం వస్తున్న కారణంగా పాత వృత్తి పట్ల నిరాదరణ ఏర్పడవచ్చు. దానిమీద తగినంత ఆదాయం కూడా ఉండని కారణంగా ఇంట్లోనూ బంధుమిత్రులతోనూ కూడా అంత గౌరవం లభించకపోవచ్చు. ఇదో సంధికాలం. కాబట్టి నలుగురితో నారాయణ అన్నట్టుగా కొత్త వృత్తులకి మారడమే మంచిది మనశ్శాంతి కోసం. అనారోగ్యం లేకుండా లేదు గాని అది నిత్య జీవితగమనానికి అడ్డొచ్చేంతది కాదు. పైగా సహజ మానసిక భయం ఉన్న కారణంగా తగు జాగ్రత్తలతోనే ఉంటారు కూడా. వివాహాది ప్రయత్నాలు– న్యాయస్థాన సమస్యలూ వంటివి మధ్య మధ్యలో అడ్డంకులకి గురౌతూ ఉంటాయి తప్ప– పరిష్కారమనేది కుదిరిపోయి– ఈ సమస్య ముగిసిందనే ఆనందాన్ని కలిగించకపోవచ్చు ఈ వారంలో.

లౌకిక పరిహారం: ఆలోచన మాత్రమే కాకుండా అమలు కోసం ప్రయత్నించండి.
అలౌకిక పరిహారం: లక్ష్మీదేవిని బంగారం ముంచిన స్వర్ణజలంతో అభిషేకించండి.

సింహం (జూలై 23 –ఆగస్ట్‌ 22)
మీరే మీరుగా తెచ్చుకున్న పనుల కారణంగా తీవ్రమైన ఒత్తిడులకి గురి అవుతారు. మోయగలిగినంత బరువునే ఎత్తుకోవడానికి సిద్ధం కండి. అదే తీరుగా అత్యాశకి వెళ్లకండి. లోగడ కలిగిన అనారోగ్యం మళ్లీ పడగని ఎత్తి కాటు వేసే ప్రమాదముంది.
మీరు ఒక పెద్దదైన వ్యాపారానికి ఆలోచనని బలంగా చేస్తూండవచ్చు. మంచిదే. అయితే ఆ పనిని నలుగురితో పంచుకుని చేసుకోవడానికి మానసికంగా మీరు సిద్ధపడితే అది సకాలంలో కార్యరూపానికి రాగలుగుతుంది. ప్రస్తుతం ఉన్న స్తబ్దత దానితో పాటు జరగడం లేదనే మానసిక నిరాశభయాలు తొలిగిపోతాయి కూడ.
మీ దగ్గర ఉన్న మొత్తాన్ని మీ సంతానపు చదువుల కోసమే వినియోగించుకోవాలనే దృఢ నిర్ణయం మీద ఉండండి తప్ప, మూడు నెలల్లో కోటీశ్వరుడైపోయే పథకాలకి ఆకర్షింపబడి ఎక్కడా పెట్టబడిని పెట్టకండి. కనీసం మీరు ప్రారంభిద్దామనుకున్న వ్యాపారంలో కూడా నిర్వహణ చేసే బాధ్యతని తీసుకుని భాగస్వామిగా ఉండండి తప్ప పెట్టుబడిని పెట్టి ఇరుక్కుపోవద్దు.
రవిబుధులు అనుకూలురుగా లేని కారణంగా శారీరక శ్రమ తప్పదు. ప్రయత్నాల కోసం ధనవ్యయం కావచ్చు. ఇవ్వవలసిన వారి నుండి కష్టసమయంలో ధనం రాకపోవచ్చు. కేవలం సమయ నష్టమే జరుగుతూ ఉండిపోవచ్చు.
సంఘంలో గౌరవం ఉంటుంది. ధనాదాయమూ బాగుంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యమూ చక్కగా ఉంటుంది.

లౌకిక పరిహారం: పెట్టుబడికి దూరంగా ఉండండి
అలౌకిక పరిహారం: వెండి ముంచిన (రౌప్య జలం) నీటితో లక్ష్మీదేవిని అభిషేకించండి.

కన్య (ఆగస్ట్‌ 23 –సెప్టెంబర్‌ 22)
విత్తనాలని చల్లి పంట కోసం ఎదురు చూస్తున్న తీరుగా ప్రభుత్వంలో ఉద్యోగం కోసం ప్రయత్నం గట్టిగా చేసి, ఎప్పుడు ఉద్యోగం లభిస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటారు. ఫలితం సానుకూలంగానే ఉండొచ్చు. నిరాశ పడకండి. కొద్దిగా గుంభనని పాటించండి తప్ప ప్రయత్నాలూ వాటి వివరాలూ అనే వాటిని బహిరంగపరచకండి.
ఏదో పుణ్యక్షేత్రానికో వినోద విహార యాత్రకో సకుటుంబంగా వెళ్లొచ్చే అవకాశముంది. అక్కడికెళ్లి వచ్చాక ఏదో ఓ సంస్థని ప్రారంభించాలనే బలమైన ఆలోచనకి రావచ్చు. సాహసోపేతమైన నిర్ణయం అది. బాగా అనుభవం ఉన్నవారితో ముఖ్యంగా ఆ సంస్థ కార్యకలాపాలతో సంబంధం ఉన్నవారితో మాత్రమే సంప్రదింపులు చేసి, ఓ ప్రాథమిక నిర్ణయానికి రండి తప్ప దూకుడుతనంతో వెళ్లొద్దు. శుక్రుడు అనుకూలంగా లేని కారణంగా కుటుంబంలో ఈ విషయం పట్ల వ్యతిరేకత ఉండొచ్చు. గమనించుకోండి. మీకున్న సహజమైన మంచితనం సంఘంలో గౌరవం కారణంగా మీ సలహా సంప్రదింపుల కోసం ఎవరైనా వస్తే ఒడ్డున ఉండి మాత్రమే ధర్మబద్ధమైన సూచనలివ్వండి తప్ప దానిలో దిగిపోకండి. మీరు ఎన్నుకున్న మీ సొంతపనులు చెడిపోవడంతోబాటు ఏదైనా దురదృష్టవశాత్తు పనిలో వ్యతిరేకత కలిగితే నిందపడే అవకాశముంది కూడా.
న్యాయస్థానాల్లో వెంటనే తీర్పు లభించకపోవచ్చు కాబట్టి ఆ తీర్పు వచ్చిన మీదట చేద్దామనే ఆలోచనలో ఉండకండి. ఎప్పటి ఆలోచనని అప్పుడే చేసుకోవలసిన పరిస్థితి మీది. రాజకీయంగా ప్రయత్నాలని  చేయడం మీకు మంచిది కాకపోవచ్చు. ఉద్యోగ, వాణిజ్య పరంగానే పైకి రాగలుగుతారు.

లౌకిక పరిహారం: తొందరపాటుతనంతో వ్యవహరించకండి.
అలౌకిక పరిహారం: లక్ష్మీదేవిని బెల్లపు నీటితో అభిషేకించండి.

తుల (సెప్టెంబర్‌ 23 –అక్టోబర్‌ 22)
ఉపాధి మార్గం ఉంటే ఉద్యోగం వృత్తీ దొరికిన కారణంగా ఆర్థికంగా ఎదుగుతారు. చేసిన రుణభారాన్ని తగ్గించుకోవడాన్ని అమలు చేస్తారు. ఇంట్లో వివాహం కానివాళ్లకి వివాహ ప్రయత్నాలని ప్రారంభిస్తారు కానీ అది వెంటనే అనుకూలించకపోవచ్చు. నిరాశపడకండి. మీకు మానసికంగా కష్టాన్ని కలిగించిన వారిమీద మీరు న్యాయస్థానానికి వెళ్లి ఉండొచ్చు. మరింత అనుకూలమైన తీర్పు మీకు లభించి ఉండచ్చు.
కుటుంబంలో ఏ విధమైన పొరపచ్చాలూ లేని కారణంగా బంధు ఆప్త గుణంతో ఆనందంగా గడుపుతూ మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా ఏవైనా అనారోగ్యాలున్నా అవన్నీ తాత్కాలిక ఔషధ సేవతో తీరిపోయేవే తప్ప లెక్కించుకోదగినవిగా ఉండవు. దూర భార ప్రయాణాలు తప్పవు. ఉన్న ఊరికి దగ్గరగా బదిలీల వంటివి ఇప్పట్లో సాధ్యపడే అవకాశం ఉండకపోవచ్చు. విత్తనాన్ని నాటిన మరునాడే ఫలాలని ఆశించడం ఎంత వెర్రితనమో అలాగే మీరు చేస్తున్న కృషికి తగిన ఫలితాలు వెంటనే రావడం లేదని భావించడం కూడా అంత అమాయకత్వమూ కావచ్చు కాబట్టి ఓ వ్యవహారంలో మీరు చేస్తున్న కృషిని చేసుకుంటూనే వెళ్లండి తప్ప, వెంటనే ఫలితం గురించి ఆశించకండి– ఎదురు చూడకండి కూడా. వ్యవసాయదారులే గనక మీరయ్యుండి ఉంటే మంచి సహకారం లభించే అవకాశం ఉంది కాబట్టి చక్కటి దిగుబడి వచ్చే తీరుగా సేద్యం చేసుకోగలుగుతారు. అధిక మూల్యం లభిస్తోంది కదా! అనే ఎవరి సూచన మీదనో లేదా మీ సొంత ఆలోచనతోనే అమ్మజూపడం ఏమాత్రమూ సరికాదు. వీలైతే రుణాన్ని తీసుకుని మరో కొంత పొలాన్ని కొనే ప్రయత్నం మంచిది కూడా.

లౌకిక పరిహారం: ఫలితాలకి వెంటనే ఎదురు చూడకండి.
అలౌకిక పరిహారం: నవధాన్య జలాలతో లక్ష్మీదేవిని అభిషేకించండి.

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
ప్రతిపనీ ముఖ్యాతిముఖ్యంగా అనిపిస్తూ ఉంటుంది. వాటిని పూర్తి చేయగల తీరుబడి ఉండడం అనేది ప్రశ్నార్థకంగా అవుతుంది. ఎంత తప్పించుకుందామ నుకున్నా కొన్ని కొన్ని పనులు కుత్తుకమీదికొచ్చి మిగిలిన చేస్తున్న పనులని మానేసి, వాటిని పూర్తి చేసి తీరాల్సిన పరిస్థితికి తెస్తాయి. ఏమైనా ఈ వారం ఒత్తిడి మాత్రం గట్టిగానే ఉంటుంది. తప్పదంతే.
మీ శత్రుపక్షం వారికి ఇంకొక పని లేక మిమ్మల్ని సాధించడం మీకు ఉపకారాన్ని కల్గించడం– అపకీర్తిని మూటగట్టి వీలయినంత చెడుగా మీ గురించి ప్రచారాన్ని చేయడమనే పనిలోనే కంకణం కట్టుకుని ఉండడం కనిపిస్తోంది. ధర్మబద్ధంగానే సాగిపొండి. ఏమీ వ్యతిరేకత మీకు కలగనే కలగదు. ఏదో జరగబోతోందనే భయంతో మిమ్మల్ని వణికింపజేసి మిమ్మల్ని లోబరుచుకోవాలనేదే వాళ్ల ప్రణాళిక. మీ అదృష్టమేమిటంటే– ఏ సమస్యైనా ఉపద్రవరూపంలో అలా మీ నెత్తిమీది దాకా వచ్చి– ఆ క్షణంలోనే గాలికి మేఘంలా అలా కదిలి వెళ్లిపోవడం అదనేదే. దిగులూ భయం నిరాశా ఉన్నా ధైర్యంగా ఉండండి. వ్యతిరేకత జరగదు మీకు.
మాటల్లోనూ రాతల్లోనూ దొరికిపోయే అవకాశముంది కాబట్టి ఆచితూచి మాట్లాడడం– ఆ మాట్లాడిన కొంత కూడా ఎవరి ద్వారానో ఎక్కడో నమోదై వెళ్లబోతోందన్న భయాన్ని లోపల ఉంచుకుని మాత్రమే చెయ్యండి. న్యాయస్థానంలో ఏమాత్రపు అనుకూలతా భార్యాపుత్రుల విషయంలో ఉండనే ఉండదని నిశ్చయం కండి! మంచి మాటలని వింటూ సమయాన్ని గడపడం కూడా సరికాదు ప్రస్తుతానికి.

లౌకిక పరిహారం: మాటల్లో రాతల్లో పూర్తి జాగ్రత్తలని పాటించాలి.
అలౌకిక పరిహారం: ఆవు పాలతో లక్ష్మీదేవికి అభిషేకాన్ని చేసుకోండి.

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
మీపై అధికారులు అనుక్షణం మిమ్మల్ని కనిపెట్టి ఉంటారనీ – ఒత్తిడిని కలిగిస్తుంటారనీ – అవసరమైనా అనవసరమైనా అస్తమానం మీరు చేస్తున్న పనుల్లో జోక్యం చేసుకుంటూ మీకు సమయనష్టాన్ని చేస్తూ మీరు చేసిన పనినే మళ్లీ చేయంచవచ్చుననీ.. మానసికంగా సిద్ధపడి ఉండండి. ఇదంతా ఆ శని ఒకటవ యింట ఉండి చేయిస్తున్న పనిగా భావించి శనికి ధ్యానాన్ని చేసుకుంటూ ఆయన అనుగ్రహం కోసం ప్రార్థిస్తూ ఉండండి. మీకు సహజమైన ఉన్నది ఉన్నట్టుగా వ్యక్తి ముఖం మీద మాట్లాడే ధోరణిని పూర్తిగా మార్చుకోండి. తాను కూచున్న కొమ్మని తానే నరుక్కున్న చందంగా లేకుండా చేసుకోవాలంటే ఇది తప్పనిసరి. ఓ సందర్భంలో బహిరంగంగా మీరు దుర్విమర్శ చేసే అవకాశముంది. కాలం సరిలేని సందర్భంలో కడుపులో దాచుకోవడం అవసరమని శాస్త్రం చెప్పేమాట. పాటించి సంతోషాన్ని పొందుతూ మనో దుఃఖాన్ని తొలగించుకోండి. సంతానంతో చిన్న చిన్న అభిప్రాయభేదాలు వచ్చే అవకాశం ఉంది. వీటి విషయంలో స్పష్టతని పాటిస్తూ – ఇలా చేస్తే ఎందుకు మంచిదో, అలా చేస్తే ఎందుకు కాదో– ఆ విషయాన్ని సూటిగానూ నిదానమైన కంఠస్వంతోనూ చెప్పి చూడండి. వినని పక్షంలో ‘ముందే చెప్పి ఉండచ్చుగా!’ అనే నింద మీకు రాదు. మీ క్షేమానికి అది అవసరం. భార్యాపుత్రులూ లేదా తల్లిదండ్రులూ మీ మాటకంటె బయటివాళ్ల మాటలకి ఎక్కువ విలువనిస్తూ ఉన్నా కూడ మౌనంగానే ఉండండి తప్ప, వాళ్లని సరిదిద్దే ప్రయత్నాన్ని చేయకండి. తలకి తగిలినప్పుడే – ద్వారబంధం వద్ద తలని దించుకుని వెళ్లాలి కొన్ని చోట్ల– అనే నీతి అర్ధమౌతుంది.

లౌకిక పరిహారం: ధననష్టం, సమయనష్టం, పరువునష్టం.. అన్నిటికీ సిద్ధపడి ఉండండి.
అలౌకిక పరిహారం: లక్ష్మీదేవిని మారేడు పత్రాలతో అర్చించండి.

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
కొత్తగా చేరిన ఉద్యోగం కంటే ఇంతకు ముందు చేరిన ఉద్యోగమే గొప్పది అనే భావన కలగవచ్చు. కుటుంబంలో ఆనందం గనుక ఉంటే బయటి ఉద్యోగంలో చిన్న ఇబ్బందులున్నా పట్టించుకోం.
అదే ఉద్యోగం చాలా చక్కగా ఉన్నా ఇంటి పరిస్థితి బాగుండకపోయినా ఏమీ అనుకోం గాని, మద్దెలలాగా రెండువైపులా దెబ్బలుంటే మానసిక క్షోభకి గురికాక తప్పదు. జరిగే నష్టం ఉండదుగాని మనోవ్యధ ఉంటుంది.
మీరే ఓ చింతలో ప్రయాణిస్తూ ఉంటే ప్రస్తుత దశలో మరొకరి విషయం మధ్యవర్తిగా వ్యవహరిస్తూ న్యాయపరిష్కారాన్ని చేయడమనేది సరికాదు. దానివల్ల కొత్త చిక్కు కూడ వచ్చిపడే అవకాశముండచ్చు. నిర్భయంగా చెప్పెయ్యండి. మానసిక శాంతితో లేను కాబట్టి ఈ విషయంలో తలదూర్చలేన’ని. ఏదో అబద్ధం చెప్పద్దు. వాళ్లకింకా మీ మీద ఆశ ఉండేలా లౌక్యసమాధానాన్ని చెప్పి తప్పించుకోవద్దు. పిల్లల్ని పట్టించుకోండి.
వెండి, బంగారాలూ, వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారపత్రాలూ.. వంటి వాటిని వీలయినంతవరకూ తీసుకెళ్లకండి. ఒకవేళ తప్పనిసరి అయితే ఆ సంచి బాధ్యతని మీరు మాత్రమే వహిస్తూ మరోధ్యాసలో ఉండకండి. శని 12వ ఇంటి ఉండి పొంచి చూస్తుంటాడు. శాశ్వత కష్టాన్ని ఎలా కల్గిద్దామా? అని. శుభకార్యం అనుకున్నది అనుకున్నట్లుగా పూర్తవుతుంది. ఇంతకుముందు సంపాదించిన ధనంతోనే సరిపడే స్థాయిలోనే ఆ శుభకార్యం ముగుస్తుంది. రుణం చేయనక్కరలేదు.

లౌకిక పరిహారం: ముఖ్యపత్రాలూ సంతానపు చదువూ పట్ల జాగ్రత అత్యంత అవసరం.
అలౌకిక పరిహారం: లక్ష్మీదేవికి ఏవైనా సరే ఐదుపండ్ల రసాలతో అభిషేకాన్ని చేయండి.

కుంభం  (జనవరి 20 – ఫిబ్రవరి 18)
ఆదాయమార్గాల్లో అనుకూలత పెరిగే కారణంగా ఇంతకుముందు కాలంలో చేరిన కొన్ని బకాయిలని పూర్తి చేసుకోగలుగుతారు. బంధుమిత్రులతో ఉన్న ఆర్థికమైన లావాదేవీలని పరిష్కరించుకోగలుగుతారు. సంతానం విద్యాబుద్ధులకీ విదేశాల్లో చేర్చించేందుకూ కావలసిన ధనాన్ని మీరు సమకూర్చుకుని ఉన్నా – అదృష్టవశాత్తూ వాళ్లకి ఉపకారవేతనం లభించే సందర్భంగా ఖర్చు చేయాల్సిన సొమ్ము మీకు మిగిలిపోతుంది. ఆశ – అత్యాశ – దురాశ అని మూడు తీరులు. సంపాదించుకున్న ధనాన్ని మరింత పెంచుకోవాలనే తపన మరింతంగా అవుతూ కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉండే స్థితి రావచ్చు. కొద్దికాలం పాటు అలా సంపాదించుకున్నాక కుటుంబంతో సన్నిహితంగా ఉండడం మంచిది. దానివల్ల కుటుంబంతో శత్రుత్వం కలగదు. మీరు అత్యాశకి పోయే అవకాశమున్న కారణంగా ఓ కొన్ని సంవత్సరాల పాటు విదేశాలకి వెళ్లే ఆలోచన రావచ్చు. అది తప్పక మీ కుటుంబాన్ని మీకు దూరం కల్గించే పరిస్థితిని కల్గించవచ్చు. సంపాదన తగ్గినా ఇంటిని పట్టించుకుంటూ ఉండడం మంచిది. శారీరకమైన ఇబ్బందులు పొడచూపే అవకాశం కారణంగా విదేశీ ప్రయాణం ఆగిపోయినా, కుటుంబం అందరి మాటనీ నిరాదరిస్తూ విదేశయానానికే ప్రాముఖ్యాన్నిచ్చాననే నింద రావచ్చు. సంపాదన ఈ కుటుంబానికే కదా! వాళ్లే విదేశీయాన వ్యతిరేకతని తెలియజేస్తూంటే ఇంక ఎవరికోసం సంపాదనకి ఎగబడాలి? గమనించుకోండి. వ్యాపారస్థులకి అకస్మాత్తుగా మారిన నియమ నిబంధనల దృష్ట్యా లాభం లేకపోవడం లేదా వచ్చిన లాభం నిర్వహణ వ్యయానికి సరిపోయే కారణంగా మనఃక్షోభ కలగడం ఉండచ్చు.

లౌకిక పరిహారం: ఇంటిని పట్టించుకోవడం ఉత్తమం.
అలౌకిక పరిహారం: లక్ష్మీదేవికి తెల్లని వస్త్రాల సమర్పణ మంచిది.

మీనం(ఫిబ్రవరి 19 – మార్చి 20)
సంతానంలో ఒకరికి విద్యలో ఏకాగ్రత ఉండకపోవచ్చు. అది తల్లిదండ్రులకి బాధాకరం కావచ్చు. రవి కుజ బుధ శుక్రులు అననుకూలత కారణంగా అంతా మంచికే జరుగుతూన్నట్లు పైకి అన్పించినా అదంతా నిజం కాకపోవచ్చు. కాబట్టి పదిమందిని విచారించి మాత్రమే ఏ పనినైనా చేపట్టడం ఉత్తమం. బంధుమిత్రుల రాకపోకలు బాగా ఉండే కారణంగా చదువులో కొద్దిగా ఏకాగ్రతకి అభ్యంతరాలు ఏర్పడచ్చు. సంతానం కోసం వైజ్ఞానిక వైద్య ప్రయత్నాలు చేసినా లేక సహజంగానైనా సరే ఆధ్యాత్మిక ధోరణితో ప్రయత్నిస్తే తప్పక ఫలితం అనుకూలంగా ఉంటుంది. పలుకుబడిని ఉపయోగిస్తూ ఆర్థికలాభం కోసమని కొన్ని కాంట్రాక్టుల కోసం ప్రయత్నిస్తే ఫలితం మాధ్యమంగా ఉండచ్చు. వివాహాది ప్రయత్నాలు కలిసొచ్చే అవకాశముంది కాబట్టి ప్రయత్నలోపం లేకుండా ఆ దిశగా సాగండి. సంతానంలో ఒకరికి విద్యాపరంగా ప్రతిభ కన్పిస్తూన్నప్పటికీ, ప్రవర్తన పరంగా అంత అనుకూలత గోచరించకపోవచ్చు. రావలసిన బకాయిల కోసం కొద్దిగా ప్రయత్నాన్ని – మెత్తని ధోరణిలో మాట్లాడుతూ మాత్రమే – చేసిన పక్షంలో కొంత ప్రయోజనం లభించవచ్చు. అకస్మాత్తుగా ఆధ్యాత్మిక ధోరణి మీలో ప్రవేశించవచ్చు. అది మంచిదే అవుతుంది. మంచికే అవుతుంది కూడ. లాభసాటి పరిచయాలు ఏర్పడే అవకాశముంది. ఏమైనప్పటికీ వ్యాపారం వృత్తీ – మరో తీరు ఆదాయమార్గం... అనుకుంటూ ఇలాటి ధోరణితోనే సాగిపోతూంటే కుటుంబంతో ఉండే సంబంధ బాంధవ్యాలూ – వీటితోపాటు బంధువులతో ఉండే దగ్గరితనాలూ పూర్తిగా అడుగంటిపోయే ప్రమాదముందేమో గమనించుకోవడం మరింత అవసరం.

లౌకిక పరిహారం: కేవలం ఆదాయమార్గమే జీవితధ్యేయమనే భావన సరికాదు.
అలౌకిక పరిహారం: యధాశక్తిగా అన్నప్రసాద వితరణని – లక్ష్మీపూజ చేసి చేయండి.

మరిన్ని వార్తలు