పనిస్థలాల్లో సెల్‌ఫోన్ల నిషేధం

30 Dec, 2017 13:21 IST|Sakshi

భారీ యంత్రాల ప్రమాదాలు పెరగడంతో ఆదేశాలు జారీ

ఈ నెల 21న ఉత్తర్వులు జారీ చేసిన సింగరేణి యాజమాన్యం

భద్రాద్రి కొత్తగూడెం : పని ప్రదేశాల్లో సెల్‌ఫోన్‌ వినియోగాన్ని నిషేధిస్తూ సింగరేణి యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. కార్మికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా భూగర్భగనులు, ఓసీపీల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ ఆదేశాలు కచ్చితంగా పాటించాలని సూచించింది. సెల్‌ఫోన్‌ వినియోగాన్ని నిలిపివేస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఈ నెల 21న సీఆర్‌పీ/ఐఎస్‌ఓ/2017/642 పేరున సర్క్యూలర్‌ విడుదల చేశారు. పనిస్థలాల్లోకి సెల్‌ఫోన్‌లు వాడటం మూలంగా ఏకాగ్రత తగ్గిపోయి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తు తం సెల్‌ఫోన్‌ వాడకం జీవితంలో నిత్యకృత్యం గా మారిందని, అదే సెల్‌ఫోన్‌ వల్ల ఓసీపీల్లోని భారీయంత్రాలు నడిపే ఈపీ ఆపరేటర్లు డంపర్ల వాడకం మూలంగా ప్రమాదాలు పెరిగిపోయినట్లు యాజమాన్యం గుర్తించింది. దీంతో సంస్థ వ్యాప్తంగా ప్రమాదాల సంఖ్య పెరిగిందని గుర్తించినట్లు పేర్కొంటున్నారు. 

డంపర్లలో సెల్‌ జామర్లు..
గతంలో డంపర్లలో సెల్‌ఫోన్లు పనిచేయకుండా సెల్‌జామర్లు అమర్చారు. జామర్లు ఏర్పాటు చేయడం వల్ల తమకు రేడియషన్‌ సమస్య ఏర్పడి ఇబ్బంది అవుతోందని కొన్ని ప్రాంతాల్లో ఈపీ ఆపరేటర్లు గొడవ చేయడంతో వాటిని తొలగించారు. ఇటీవల కాలంలో ఓసీపీ–1 లో రెండు డంపర్లు ఢీకొనడం, ఆరునెలల క్రితం ఓసీపీ–3లో డంపర్‌ ఢీకొని ఓవర్‌మెన్‌ మృతి చెందిన సంఘటలన్నీ కేవలం సెల్‌ఫోన్‌లు వాడటం వల్లే జరిగినట్లుగా ప్రాధమికంగా అధికారులు నిర్థారించారు. 

గనులపై అవగాహన సదస్సుల ఏర్పాటు  
గనులు, ఓసీపీల్లో సెల్‌ఫోన్‌ వాడకాన్ని నిషేధించిన నేపధ్యంలో గనులపై ఆయా గనుల మేనేజర్లు, ప్రాజెక్టు అధికారులు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. సెల్‌ఫోన్‌ వాడకం వల్లే కలిగే అనర్థాలను వివరిస్తున్నారు. ఆయా ప్రాంతాల బాధ్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈమేరకు గనులపై బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. భారీ యం త్రాలు నడుపుతూ సెల్‌ఫోన్‌ వాడే ఉద్యోగులను గుర్తించి వార్నింగ్‌ లెటర్లు కూడా ఇస్తున్నారు. అన్ని గనులు, ఓసీపీల్లో కార్మికులు తమ వస్తువులు దాచుకునేందుకు సెల్ఫ్‌ లాకర్లు ఏర్పాటు కోరుతూ ఆయా గనుల నుంచి యాజమాన్యానికి సిఫారసు లేఖలు పంపారు.

మరిన్ని వార్తలు