ముక్కిపోయి మూడేళ్లు!

6 Feb, 2018 19:09 IST|Sakshi

పట్టుకున్న బియ్యాన్ని పట్టించుకోని అధికారులు

నేలకొండపల్లి : అక్రమార్కులు తరలిస్తున్న బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు.. సివిల్‌ సప్లై గోడౌన్‌లో నిల్వ చేశారు.. ఆ తర్వాత కన్నెత్తి చూడలేదు.. మూడేళ్లు గడిచింది.. బియ్యం ముక్కిపోయి.. తుట్టెలుపట్టి ఎందుకూ పనికిరాకుండా పోయాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నేలకొండపల్లి ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ పరిధిలో అక్రమార్కులు రేషన్‌ బియ్యాన్ని తరలిస్తుండగా.. అధికారులు మూడేళ్ల క్రితం పట్టుకున్నారు. 23 టన్నుల(232 క్వింటాళ్లు) బియ్యాన్ని స్థానిక గోడౌన్‌లో నిల్వ చేశారు. ఆ తర్వాత అధికారులు అటువైపు వెళ్లలేదు. బియ్యానికి పురుగులు పట్టి ముక్కిపోయాయి. ఆ పురుగులన్నీ గోడౌన్‌ పక్కనే ఉన్న బాలికల వసతి గృహంలోకి ప్రవేశించి విద్యార్థినులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గోడౌన్‌లలో పనిచేసే హమాలీలు కూడా పురుగుల వాసనతో అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ విషయాన్ని హమాలీలు పలుమార్లు సివిల్‌ సప్లై అధికారులకు తెలియజేసినా.. పట్టించుకునేవారు కరువయ్యారు. దాదాపు 232 క్వింటాళ్ల బియ్యం మట్టిపాలు కావడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల దృష్టికి తీసుకెళ్లా..
పట్టుకున్న బియ్యాన్ని ఇక్కడి నుంచి తరలించాలని గతంలోనే జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. బియ్యం పురుగుపట్టి.. దుర్వాసన వస్తుందని చెప్పాను. అధికారుల ఆదేశాల మేరకు నడుచుకుంటాం.  
– రామచందర్‌రావు, సివిల్‌ సప్లై గోడౌన్‌ ఇన్‌చార్జ్, నేలకొండపల్లి

చర్య తీసుకోవాలి..
పేదల బియ్యం అంటే అంత నిర్లక్ష్యమా. లక్షలాది రూపాయలు విలువ చేసే బియ్యం పనికిరాకుండా చేసిన అధికారులపై చర్య తీసుకోవాలి. వారి జీతాల నుంచి రికవరీ చేయాలి. పేదల సొమ్మంటే లెక్కలేదు.  
– కాశిబోయిన అయోధ్య, వ్యవసాయ కార్మికుడు 

మరిన్ని వార్తలు