మేం అలగలేదు.. | Sakshi
Sakshi News home page

మేం అలగలేదు..

Published Wed, Nov 22 2023 12:26 AM

- - Sakshi

గెలిపించకున్నా

మధిర, వైరా సభ హైలెట్స్‌

● మధిర సభకు హాజరైన సీఎం కేసీఆర్‌ హెలీకార్టర్‌ మధ్యాహ్నం 1–24 గం.కు ఆగింది. ఆ సమయంలో నిమిషం పాటు చిరుజల్లులు కురిసినా వెంటనే ఆగిపోయాయి.

● 1–27 గంటలకు హెలిప్యాడ్‌ వద్ద ప్రత్యేక బస్సు ఎక్కిన సీఎం, 1–31 గంటలకు వేదికపైకి చేరుకున్నారు.

● 1–32 గంటల నుంచి ఆరు నిమిషాల పాటు బీఆర్‌ఎస్‌ ఎమ్మేల్యే అభ్యర్ది లింగాల కమల్‌రాజ్‌ మాట్లాడారు.

● 1–38 గంటలకు సీఎం కేసీఆర్‌ ప్రసంగం ప్రారంభించి 36 ని.ల పాటు మాట్లాడారు.

● 2–12 గంటలకు బస్సు ఎక్కి హెలీప్యాడ్‌ కు చేరుకోగా 2–19 గంటలకు హెలీకాప్టర్‌ వైరాకు బయలుదేరింది.

● వైరాలో సీఎం కేసీఆర్‌ హెలీకాప్టర్‌ 2–31 దిగింది.

● 2–33 గంటలకు కారులో బయలుదేరిన ఆయన ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారధి, మాజీ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారితో కలిసి సభావేదికపైకి వచ్చారు.

● సభ ప్రారంభానికి ముందు కార్యకర్తలు పలచగా కనిపించినా సభ ప్రారంభమయ్యాక భారీగా చేరుకున్నారు.

● సభకు వచ్చేవారి వాహనాలను పల్లిపాడు సెంటర్‌లోనే పోలీసులు నిలిపేయడంతో 2కి.మీ. మేర కాలినడకన వచ్చారు.

● సీఎం కేసీఆర్‌ వేదికపైకి రావడానికి ముందు ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బానోత్‌ మదన్‌లాల్‌, నాయకుడు మానవతారాయ్‌ మాట్లాడారు.

● సభాస్థలి పక్కన వేదికపై కళాకారులు ఆడిపాడుతుండగా, ప్రజలు కూడా నృత్యం చేశారు. వేదికపై బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మదన్‌లాల్‌ కూడా నృత్యం చేశారు.

● 3–10 గంటలకు సభా ప్రాంగణం నుంచి బయలుదేరిన సీఎం కేసీఆర్‌ హెలీప్యాడ్‌కు చేరుకోగా, 3–16 గంటలకు హెలీకాప్టర్‌ డోర్నకల్‌ బయలుదేరింది.

● సభా ప్రాంగణంలో ఎవరైనా అస్వస్థతకు గురైతే చికిత్స చేసేందుకు మెడికల్‌ క్యాంపు ఏర్పాటు చేశారు.

– మధిర/ఎర్రుపాలెం/వైరా

సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘రెండుసార్లు మధిరలో మమ్మల్ని గెలిపించలేదు. అయినా మీ మీద అలగలేదు. మధిర నాది.. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఇంచు అయినా నాదే. ప్రతీ ఇంచు బాగుపడాల్సిందే. ఎక్క డ ధాన్యం పంట పెరిగినా.. పది మంది ముఖాలు కళకళలాడినా నాకు గర్వమే కదా! రాష్ట్ర నాయకత్వానికి ఉండాల్సిన సోయి కదా అది. ఇక్కడ భట్టి విక్రమార్క ఉన్నడని పక్షపాతం పట్టలేదు. చింతకాని మండలం నుంచి నాకు ఎవరూ దరఖాస్తు పెట్టలే, ధర్నాలు చేయలే. అయినా చింతకాని మండలంలో 3,400 కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున దళితబంధు ఇచ్చాం. అలాంటప్పుడు దళితబిడ్డలు మళ్లీ ఎందుకు కాంగ్రెస్‌కు ఓట్లు గుద్దాలి. భట్టి విక్రమార్కకు ఓటేస్తే వచ్చేది ఏముంది? నియోజకవర్గానికి ఆరునెలలకోసారి చుట్టపు చూపుగా వచ్చే మనిషికి బదులు కమల్‌రాజ్‌ను గెలిపిస్తే మధిర నియోజకవర్గమంతా దళితబంధు అమలుచేస్తాం. వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌కు సముచిత స్థానం కల్పి స్తాం.’ అని మధిర, వైరాల్లో మంగళవారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. ఓ వైపు భట్టి విక్రమార్కపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ.. మరోవైపు పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ సాగిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే...

చెప్పినట్లుగానే బోనకల్‌కు దళితబంధు..

రాళ్ల వాన పడి మక్క చేను పోతే చూడడానికి బోనకల్‌ మండలానికి వచ్చా. గతంలో తుఫాన్‌ వచ్చి పంటలు దెబ్బతింటే చేతులు దులుపుకున్నరు. కేంద్రప్రభుత్వానికి రిపోర్టు ఇస్తే ఎకరానికి రూ.1,500లో, రూ.3వేలో వచ్చేవి. కానీ నేను మక్క చేలోనే నిలబడి ఎకరానికి రూ.10వేలు ప్రకటన చేశాం. తిరిగి వస్తుంటే 25 మంది దళిత ఆడబిడ్డలు నా కారు ఆపారు. మా మండలానికి దళితబంధు పెట్టండి.. ఇదివరకటిలా మేము లేం.. మారిపోయాం అన్నారు. దీంతో బోనకల్‌కు దళితబంధు ప్రకటించాం. కమల్‌రాజ్‌ను గెలిపిస్తే మధిర నియోజకవర్గమంతా దళితబంధు ఇచ్చే బాధ్యత నేనే తీసుకుంటా.

కాంగ్రెస్‌ రైతుబంధు వేస్ట్‌ అంటోంది..

రైతులకు రైతుబంధు ఇవ్వడం వేస్ట్‌ అని కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడుతున్నరు. రైతుబంధు వేస్టా.. మీరే చెప్పండి. కమల్‌రాజ్‌ గెలిస్తే రైతుబంధు ఉంటది. ఈ పదాన్ని పుట్టించిందే కేసీఆర్‌. రైతులకు సపోర్ట్‌ చేయాలని కలలో కూడా కాంగ్రెసోళ్లు ఆలోచించలేదు. 24 గంటలు కరెంట్‌ ఇస్తుంటే మూడు గంటలే చాలంటున్నరు. మూడు గంటలకు పొలం పారుతుందా? కమల్‌రాజ్‌ గెలిస్తే కరెంట్‌ 24 గంటలు ఉంటది. కాంగ్రెస్‌ గెలిస్తే కాటకలుస్తది. నాడు చిల్లకల్లు నుంచి మధిరకు కరెంట్‌ వస్తే రోజూ బ్రేక్‌డౌనే.. దాన్ని మార్పించి ఖమ్మం నుంచి డైరెక్ట్‌ కరెంట్‌ లైన్‌ పెట్టించా. దీంతో మధిరకు నాణ్యమైన కరెంట్‌ వస్తోంది.

కత్తి ఇవ్వకుండా యుద్ధం ఎలా?

కొట్లాడే వారికే కత్తి ఇవ్వాలి. కానీ కత్తి ఒకరికి ఇచ్చి.. యుద్ధం మరొకరిని చేయమంటారా? ప్రజల పక్షాన ఉన్న వారికే కత్తి ఇవ్వాలి. వైరాలో కత్తి బానోత్‌ మదన్‌లాల్‌ చేతికి ఇవ్వండి 24 గంటల కరెంట్‌ వస్తది. గ్రామపంచాయతీగా ఉన్న వైరాను మున్సిపాలిటీగా చేసి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాం. ఈ నియోజకవర్గంలో 45 తండాలను గ్రామపంచాయతీలుగా చేసుకున్నాం. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే వైరాకు కూడా గోదావరి నీళ్లు వస్తాయి. జూలూరుపాడు, ఏన్కూరు, కారేపల్లిలో బాధలు పోతాయి. కొన్ని కారణాలతో రాములునాయక్‌కు టికెట్‌ ఇవ్వకున్నా సహకరించారు. ఆయనకు సముచిత స్థానం కల్పిస్తాం. వైరా రిజర్వాయర్‌లో నీళ్లు లేకపోతే ఎంపీ నామ నాగేశ్వరరావు అడిగిన వెంటనే ఇచ్చాం. ఇది కాంగ్రెస్‌కు సాధ్యం అవుతుందా?

ముగిసిన ప్రజా ఆశీర్వాద సభలు

మధిర, వైరాల్లో నిర్వహించిన సభలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీఎం కేసీఆర్‌ ప్రచార పర్వం ముగిసింది. అక్టోబర్‌ 27న పాలేరు నియోజకవర్గంలో ప్రజాఆశీర్వాద సభలు మొదలుకాగా... ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొమ్మిది సభలు నిర్వహించడంతో పది నియోజకవర్గాలు కవర్‌ అయ్యాయి. అన్ని నియోజకవర్గాల్లో సీఎం సభలు నిర్వహించగా బీఆర్‌ఎస్‌ కేడర్‌లో జోష్‌ నెలకొంది. సీఎం కేసీఆర్‌ ప్రసంగాలు ప్రజలను ఆకట్టుకున్నాయని అభ్యర్థులు, పార్టీ నాయకులు ఆనందంగా ఉన్నారు. ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేటీఆర్‌ రోడ్‌షోలో పాల్గొనగా.. ఖమ్మం జిల్లాలో కూడా రోడ్‌షోకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఈ సభల్లో ఎంపీలు నామ నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారధిరెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, తాతా మధు, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌, వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌, ఎమ్మెల్యే అభ్యర్థులు లింగాల కమల్‌రాజ్‌, బానోతు మదన్‌లాల్‌, డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, నాయకులు గుండాల కృష్ణ, చింతనిప్పు కృష్ణచైతన్య, మధిర మున్సిపల్‌ చైర్మన్‌ మొండితోక లత, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ దొండపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

దళితబంధు కోసం భట్టి అడగలే.. ఎవరూ ధర్నాలు చేయలే

చింతకాని మండలం

దళితబంధుతో బాగుపడింది

కమల్‌రాజ్‌ను గెలిపిస్తే

నియోజకవర్గమంతా అమలు

భట్టిని గెలిపిస్తే మధిరకు వచ్చేది

ఏమీ లేదు

రాములునాయక్‌కు

సముచిత స్థానం కల్పిస్తాం

మధిర, వైరా ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్‌

మధిరతో పంచాయితీ పెట్టుకుంటా..

మధిర ఆయకట్టుకు కృష్ణ నీళ్లు తక్కువ పడుతుంటాయి. ఖమ్మం జిల్లాలో పెద్ద పెద్ద నాయకులున్నారు. ఒక్కరన్నా దీని గురించి ఆలోచించారా? ఖమ్మం జిల్లాకు ఆనుకుని గోదావరి పారుతోంది. లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలో కలుస్తది. దుమ్ముగూడెం దగ్గర ఎత్తుకోవాలి.. పోసుకోవాలని ఎవరైనా ఆలోచించారా? సీతారామ ప్రాజెక్టు ఏడెనిమిది మాసాల్లో పూర్తవుతుంది. అప్పుడు పాలేరు రిజర్వాయర్‌కు లింక్‌ అవుతుంది. 37 టీఎంసీల సీతమ్మసాగర్‌ వస్తుంది. సీతమ్మసాగర్‌ అయిపోతే మధిర నియోజకవర్గం వైపు కరువు అనేది తొంగిచూడదు. 365 రోజులు నిండా నీళ్లే ఉంటాయి. ఇంత మంచి ప్రణాళికలతో ముందుకుపోయే బీఆర్‌ఎస్‌ను ఓడకొట్టుకుంటే, పట్టి లేని భట్టి విక్రమార్కను గెలిపిస్తే వచ్చేది లేదు. ఈసారి మధిర వాళ్లతో పంచాయితీ పెట్టుకుంటా. రెండు సార్లు ఓడించినా మీ మీద అలగలేదు. మీ మీద మేము మంచి గౌరవంగానే పోతున్నాం. ఎట్లాగూ బీఆర్‌ఎస్‌ గవర్నమెంట్‌ వస్తుంది కాబట్టి.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలిస్తేనే మీకు లాభం.

అభినవ అంబేడ్కర్‌ కేసీఆర్‌

– బీఆర్‌ఎస్‌ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్‌

మధిర: చింతకాని మండలంలో ప్రతీ దళిత కుటుంబానికి దళితబంధుద్వారా రూ.10 లక్షలు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అభినవ అంబేడ్కర్‌గా ప్రజలు కీర్తిస్తున్నారని మధిర బీఆర్‌ఎస్‌ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్‌ అన్నారు. మధిరలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని చింతకాని మండలానికి పూర్తిస్థాయిలో దళితబంధు అమలుచేయడం, ఆతర్వాత బోనకల్‌ మండలాన్ని ఎంపిక చేయడంపై సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మధిర అభివృద్ధిని పట్టించుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ హయాంలో మధిరను మున్సిపాలిటీగా చేసి అభివృద్ధి చేయకుండా వదిలేశారన్నారు. స్థానిక ఎమ్మెల్యే అడగకపోయినా సత్తుపల్లితో పాటు మధిరకు వంద పడకల ఆస్పత్రిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంజూరు చేశారన్నారు. అలాగే, ముఖ్యమంత్రి ఆశీస్సులతో మధిర పట్టణంలో రూ.150 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి తనకు జెడ్పీ చైర్మన్‌గా అవకాశమిస్తే ప్రజల మధ్యే ఉంటూ, కార్యకర్తల కష్టసుఖాల్లో పాలుపంచుకున్నానని చెప్పారు. ఈనెల 30న జరిగే ఎన్నికల్లో మధిర ప్రజలు తనను ఆశీర్వదించాలని, తద్వారా నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని కమల్‌రాజ్‌ తెలిపారు.

మధిర సభకు హాజరైన బీఆర్‌ఎస్‌ శ్రేణులు, ప్రజలు
1/3

మధిర సభకు హాజరైన బీఆర్‌ఎస్‌ శ్రేణులు, ప్రజలు

2/3

3/3

Advertisement

తప్పక చదవండి

Advertisement