బ్యాంకు సమ్మె: 10 లక్షల మంది, 80 వేల శాఖలు

30 Jan, 2020 20:42 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

సాక్షి,చెన్నై:  రేపటి నుంచి (జనవరి 31) రెండు రోజులపాటు బ్యాంకింగ్‌ కార్యకలాపాలకు ఆటంకం కలగనుంది. బ్యాంకు ఉద్యోగ సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొననున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో సుమారు 10 లక్షల మంది  ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటారని  అఖిల భారత బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్  ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో జనవరి 31- ఫిబ్రవరి 1 తేదీల్లో వివిధ బ్యాంకు సేవలు ప్రభావితం కానున్నాయి. బ్యాంకింగ్ రంగంలో తొమ్మిది యూనియన్లతో కూడిన యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్‌బియు) ఈ సమ్మెకు నాయకత్వం వహించనుంది. 

మరోవైపు జనవరి 31 న ఆర్థిక సర్వేను సమర్పించనున్నారు.  అలాగే ఫిబ్రవరి 1న  కేంద్ర ఆర్థికమంత్రి  నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో యూనియన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం గమనార‍‍్హం. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబిఎ) తో చర్చలు విఫలమైన అనంతరం  రెండు రోజుల సమ్మెకు నిర్ణయించామని అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి సిహెచ్ వెంకటాచలం  చెప్పారు.   సమ్మెకాలంలో 80వేల బ్యాంక్ శాఖల్లో ఎక్కువ భాగం మూత పడతాయని తెలిపారు. అలాగే మార్చి 11 నుండి మూడు రోజుల పాటు మరోసారి సమ్మెను చేపట్టనున్నామని తెలిపారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఏప్రిల్ 1 నుండి నిరవధిక సమ్మె జరుగుతుందని యుఎఫ్‌బియు ఇంతకుముందే ప్రకటించిన సంగతి విదితమే.

మరిన్ని వార్తలు