మార్కెట్లో ‘వాటా’ ముసలం!

16 Jul, 2019 05:17 IST|Sakshi

డీలిస్టింగ్‌ బాటలో ఎమ్‌ఎన్‌సీలు!

కనీస పబ్లిక్‌ షేర్‌ హోల్డింగ్‌ తాజా ప్రతిపాదనే కారణం 

కంపెనీలో ప్రజల కనీస వాటా 25% నుంచి 35 శాతానికి పెంపు

పలు ఎమ్‌ఎన్‌సీల్లో 75 శాతం మేర ప్రమోటర్ల వాటా ...

కనీసం 10 శాతం వాటా విక్రయించాల్సి రావచ్చు

దీని కంటే డీలిస్టింగ్‌ బాటపై ఎమ్‌ఎన్‌సీల కసరత్తు

మార్కెట్లో ఆఫర్‌ ఫర్‌ సేల్స్‌ వెల్లువ

తలెత్తనున్న లిక్విడిటీ సమస్య

స్టాక్‌ మార్కెట్లో లిస్టైన కంపెనీల్లో ప్రజలకు కేటాయించే కనీస వాటాను 25 శాతం నుంచి 35 శాతానికి పెంచాలని తాజా బడ్జెట్లో ఆర్థిక మంత్రి  నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించారు. ఈ తాజా ప్రతిపాదన స్టాక్‌ మార్కెట్లో తీవ్రమైన ప్రకంపనలు సృష్టించింది. బడ్జెట్‌ రోజు, ఆ తర్వాతి రోజు కొనసాగిన నష్టాలకు ప్రధాన కారణాల్లో ఈ పబ్లిక్‌ షేర్‌ హోల్డింగ్‌ ప్రతిపాదన కూడా ఒకటి. ఈ ప్రతిపాదన కారణంగా టీసీఎస్, విప్రో వంటి ఐటీ కంపెనీలు, డిమార్ట్‌ రిటైల్‌ స్టోర్స్‌ చెయిన్‌ను నిర్వహించే అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ వంటి దిగ్గజ కంపెనీలు కనీసం 10–20 శాతం మేర వాటాను విక్రయించాల్సి వస్తుంది. బీఎస్‌ఈలో దాదాపు 4,000కు పైగా కంపెనీలు లిస్ట్‌కాగా, వీటిల్లో 1,100 మేర కంపెనీలు వాటా విక్రయం జరపాల్సి వస్తుంది. ఇదంతా ఒకెత్తు. బహుళజాతి కంపెనీలు(ఎమ్‌ఎన్‌సీ) బాధ ఇంకొక ఎత్తు. చాలా ఎమ్‌ఎన్‌సీల్లో ప్రమోటర్ల వాటా 75 శాతం రేంజ్‌లో ఉంది. ఇవి 10 శాతం మేర వాటా విక్రయించాల్సి రావచ్చు. అయితే వాటా విక్రయానికి బదులుగా అసలు స్టాక్‌ మార్కెట్‌ నుంచే డీలిస్ట్‌ అయ్యే దిశగా ఈ ఎమ్‌ఎన్‌సీలు యోచిస్తున్నాయని సమాచారం. ఈ
విషయమై సాక్షి బిజినెస్‌ స్పెషల్‌ స్టోరీ....

లిస్టెడ్‌ కంపెనీల్లో పబ్లిక్‌ హోల్డింగ్‌ను ప్రస్తుతమున్న 25 శాతం నుంచి 35 శాతానికి పెంచాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తాజా బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఈ విషయమై మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీకి ఒక లేఖ రాశామని ఆమె పేర్కొన్నారు. పబ్లిక్‌ హోల్డింగ్‌ పెంపు ప్రతిపాదనకు సెబీ త్వరలోనే విధి విధానాలను రూపొందిస్తుందని, రెండేళ్ల గడువుని ఇవ్వవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ ప్రతిపాదన స్టాక్‌ మార్కెట్‌ నుంచి లిక్విడిటీని లాగేయడమే కాకుండా, ప్రమోటర్‌ వాటా అధికంగా ఉన్న బహుళ జాతి కంపెనీలు మన స్టాక్‌ మార్కెట్‌ నుంచి డీలిస్ట్‌ కావడానికి దోహదపడుతుందని నిపుణులంటున్నారు. కొన్ని  ఎమ్‌ఎన్‌సీల్లో ప్రమోటర్ల వాటా 65 శాతానికి అటూ, ఇటూగా ఉంది. ఇలాంటి కంపెనీలకు పెద్దగా ఇబ్బంది లేదు. కొన్ని ఎమ్‌ఎన్‌సీల్లో ప్రమోటర్ల వాటా 75 శాతానికి అటూ, ఇటూగా ఉంది. ఈ కంపెనీలు డీలిస్టింగ్‌కే ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇక బిజినెస్‌ టు బిజినెస్‌(బీ2బీ)రంగంలో ఉన్న కంపెనీలు పూర్తిగా డీలిస్టింగ్‌కే మొగ్గుచూపుతున్నాయి. ఇలాంటి కంపెనీల వ్యాపారాలకు బ్రాండ్లతో పని లేకపోవడం దీనికి ప్రధాన కారణం. అయితే తాజా ప్రతిపాదనలపై ఎమ్‌ఎన్‌సీలు ఇప్పటివరకైతే, ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.  

అప్పడూ ఇదే పరిస్థితి...
మార్కెట్‌  నియంత్రణ సంస్థ, సెబీ 2010–13లో 25 శాతం పబ్లిక్‌ షేర్‌ హోల్డింగ్‌ నిబంధనను తెచ్చింది. అప్పుడు కూడా ఇలాంటి దృశ్యమే కనిపించింది. పలు ఎమ్‌ఎన్‌సీలు స్టాక్‌ మార్కెట్‌ నుంచి డీలిస్ట్‌ కావడానికి ప్రయత్నాలు చేశాయి. ఈ తాజా  ప్రతిపాదన ప్రకారం ప్రజలకు 35 శాతం వాటాను కేటాయించాల్సి వస్తే, ఎమ్‌ఎన్‌సీలు రూ.50,000 కోట్ల విలువైన షేర్లను విక్రయించాల్సి రావచ్చు. ఎమ్‌ఎన్‌సీలు, ఇతర భారత కంపెనీలు కలసి మొత్తం మీద రూ. 4 లక్షల కోట్ల మేర షేర్లను విక్రయించే అవకాశాలున్నాయి.  

ఎమ్‌ఎన్‌సీలు...మంచి పనితీరు...
మార్కెట్, ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు ఎలా ఉన్నా, చాలా ఎమ్‌ఎన్‌సీలు మంచి పనితీరునే కనబరుస్తూ వచ్చాయి. మొత్తం గత 16 ఏళ్లకు గాను  11 ఏళ్లలో ఎమ్‌ఎన్‌సీ షేర్లు నిఫ్టీని మించిన రాబడులనిచ్చాయి. 2006 నుంచి చూస్తే, వరుసగా 13 ఏళ్ల పాటు నిఫ్టీని మించిన పనితీరును ఎమ్‌ఎన్‌సీలు చూపించాయి. తాజా ప్రతిపాదన తక్షణం అమలయ్యే అవకాశాల్లేవు. దశలవారీగానే ఈ ప్రతిపాదన అమల్లోకి రావచ్చు. కనీసం 3–4 ఏళ్లు పడుతుందని అంచనా. అయినప్పటికీ, ఇది ఆయా షేర్ల పనితీరుపై తీవ్రంగానే ప్రభావం చూపించవచ్చు. ప్రమోటర్‌ వాటా 75 శాతానికి పైగా ఉన్న సీమెన్స్, ఏబీబీ, హనీవెల్‌ వంటి కంపెనీలు ఆఫర్‌ ఫర్‌ సేల్‌’(ఓఎఫ్‌ఎస్‌) విధానంలో తమ వాటాను విక్రయించే అవకాశాలున్నాయని నిపుణులంటున్నారు. ఇది ఆయా షేర్ల పనితీరుపై సమీప భవిష్యత్తులో తీవ్రంగానే ప్రభావం చూపుతుంది. అయితే సీమెన్స్, ఏబీబీ, హనీవెల్‌ కంపెనీల ఫండమెంటల్స్‌ పటిష్టంగా ఉన్నాయని, ఈ షేర్లు తగ్గితే అది కొనుగోళ్లకు మంచి అవకాశంగా భావించాలని ఆంటిక్‌ స్టాక్‌ బ్రోకింగ్‌ పేర్కొంది.

ఓఎఫ్‌ఎస్‌ల వెల్లువ...
ఈ ప్రతిపాదన కారణంగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌’(ఓఎఫ్‌ఎస్‌)లు వెల్లువెత్తుతాయని నిపుణులంటున్నారు. వాటా విక్రయానికి చౌకైన, వేగవంతమైన ప్రక్రియ ఇదేనని, దీంతో స్టాక్‌ మార్కెట్లో ఓఎఫ్‌ఎస్‌లు వెల్లువెత్తుతాయని, దీంతో సెకండరీ మార్కెట్లో లిక్విడిటీ సమస్య తలెత్తుతుందని వారంటున్నారు.

ఈ ప్రతిపాదన కారణంగా కొన్ని ఉత్తమ ఫలితాలూ ఉంటాయని విశ్లేషకులంటున్నారు. సంస్థాగత ఇన్వెస్టర్ల యాజమాన్యం మరింతగా విస్తరిస్తుందని, స్టాక్‌ మార్కెట్‌  మరింతగా విస్తరిస్తుందని, షేర్లకు సరైన విలువ లభిస్తుందని, కార్పొరేట్‌ గవర్నెన్స్‌ మరింతగా మెరుగుపడగలదని వారంటున్నారు. అంతే కాకుండా నాణ్యత గల షేర్లు సమంజసమైన ధరకు లభించే అవకాశాలూ ఉన్నాయి.
 

మరిన్ని వార్తలు