17వేల కోట్లతో విశాఖ రిఫైనరీ విస్తరణ

8 Mar, 2016 01:42 IST|Sakshi
17వేల కోట్లతో విశాఖ రిఫైనరీ విస్తరణ

కరీంనగర్‌లో ఎల్‌పీజీ ప్లాంట్
నాలుగేళ్లలో 45,000 కోట్లు
ఇన్వెస్ట్ చేస్తున్న హెచ్‌పీసీఎల్

 న్యూఢిల్లీ: హిందుస్తాన్ పెట్రోలియమ్ కార్పొరేషన్(హెచ్‌పీసీఎల్) రిఫైనరీల విస్తరణను భారీ స్థాయిలో చేపడుతోంది. విశాఖపట్టణంలోని రిఫైనరీ విస్తరణ కోసం 2020 కల్లా రూ.17,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని హెచ్‌పీసీఎల్ పేర్కొంది. ప్రస్తుతం విశాఖ రిఫైనరీ వార్షిక ఉత్పాదక సామర్థ్యం 8.3 మిలియన్ టన్నులని, దీనిని 15  మిలియన్ టన్నులకు పెంచడానికి ఈ స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నామని ఇన్వెస్టర్లకు ఇచ్చిన ప్రజెంటేషన్లో హెచ్‌పీసీఎల్ వివరించింది. అంతేకాకుండా తెలంగాణలోని కరీంనగర్‌లో కొత్తగాఎల్‌పీజీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొంది. 

 మార్కెటింగ్ కోసం రూ.14,000 కోట్లు...
రిఫైనరీల విస్తరణ, మార్కెటింగ్ మౌలిక సదుపాయాలు, ఇతర అంశాల కోసం 2020 కల్లా మొత్తం రూ.45,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని హెచ్‌పీసీఎల్ తెలిపింది.  రిఫైనరీల సామర్థ్య విస్తరణ కోసం రూ.21,000 కోట్లు, మార్కెటింగ్ మౌలిక సదుపాయాల కోసం రూ.9,000 కోట్లు పెట్టుబడులు, జాయింట్ వెంచర్ రిఫైనరీ ప్రాజెక్టుల కోసం, సహజ వాయువు వ్యాపారం, చమురు అన్వేషణ కోసం మొత్తం రూ. 14,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నామని వివరించింది. ముంబై రిఫైనరీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 6.5 మిలియన్ టన్నులని, దీనిని 9.5 మిలియన్ టన్నులకు విస్తరించడానికి రూ.4,199 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నామని పేర్కొంది. అలాగే భటిండా రిఫైనరీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 9 మిలియన్ టన్నుల నుంచి 11.25 మిలియన్ టన్నులకు పెంచడానికి మరో 35 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నామని వివరించింది. యూరో ఫైవ్/సిక్స్ ప్రమాణాలకనుగుణంగా ఉండే ఉత్పత్తుల తయారీకి ఈ పెట్టుబడులు తోడ్పడతాయని వివరించింది. పంజాబ్‌లోని భటిండా రిఫైనరీలో హెచ్‌పీసీఎల్‌కు, ప్రపంచ స్టీల్ దిగ్గజం ఆర్సెలర్ మిట్టల్ ప్రమోటర్ లక్ష్మీనాథ్ మిట్టల్‌కు చెరిసమానంగా భాగస్వామ్యం ఉంది.

 చరా పోర్ట్‌లో ఎల్‌ఎన్‌జీ దిగుమతి టెర్మినల్
ముంబైకి చెందిన మౌలిక రంగ దిగ్గజం షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌కు చెందిన ఎస్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి గుజరాత్‌లోని చరా పోర్ట్‌లో 5 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఎల్‌ఎన్‌జీ ఇంపోర్ట్ టెర్మినల్‌ను ఏర్పాటు చేయనున్నామని హెచ్‌పీసీఎల్ తెలిపింది. రూ.5,411 కోట్ల ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధుల సమీకరణ పూర్తయిందని పేర్కొంది. నవీకరణ విద్యుదుత్పత్తిని రెట్టింపు(100 మెగావాట్లు) చేయనున్నామని వివరించింది. దేశవ్యాప్తంగా 13,561 పెట్రోల్ పంప్‌లు ఉన్నాయని, కొత్త పైప్‌లైన్ల నిర్మాణానికి, ఇంధన డిపోలు, ఎల్‌పీజీ ప్లాంట్ల కోసం రూ.1,782 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నామని వివరించింది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్, మహారాష్ట్రలోని లొని టెర్మినల్ ఇంధన డిపోలను పునర్వ్యస్థీకరిస్తున్నామని పేర్కొంది.  కరీంనగర్‌తో పాటు షోలాపూర్(మహారాష్ట్ర), భోపాల్(మధ్యప్రదేశ్), పనఘర్(పశ్చిమ బెంగాల్)ల్లో కొత్త ఎల్‌పీజీ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామని హెచ్‌పీసీఎల్ తెలిపింది.

మరిన్ని వార్తలు