ఐటీలో 2 లక్షల ఉద్యోగాలు!!

2 Jan, 2018 02:01 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుత ఏడాది ఐటీ రంగం ఉద్యోగాలతో కళకళలాడనుంది. ఈ పరిశ్రమలో దాదాపు 2 లక్షల మందికి ఉపాధి లభించనుందని అంచనాలున్నాయి. ‘ఫైనాన్షియల్‌ సర్వీసెస్, డిజిటల్‌ బిజినెస్‌లలో మెరుగుదల.. ప్రత్యేకించి డిజిటైజేషన్, ఆటోమేషన్‌లలో ఇన్వెస్ట్‌మెంట్ల పెరుగుదల.. పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం వంటి అంశాలు వ్యాపార వృద్ధికి దోహదపడతాయి’ అని టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ ఐటీ స్టాఫింగ్‌ జనరల్‌ మేనేజర్‌ ఆల్కా ధింగ్రా వివరించారు.

కొత్త కంపెనీల వల్ల కూడా నియామకాలు పెరగొచ్చని, దాదాపు 20 శాతానికిపైగా ఎక్కువ కంపెనీలు ఈ ఏడాది నియామకాలు చేపట్టే అవకాశముందని పేర్కొన్నారు. 2018లో దేశీ ఐటీ పరిశ్రమలో దాదాపు 1.8–2 లక్షల కొత్త ఉద్యోగాలు ఉంటాయని అంచనా వేశారు. దేశం డిజిటల్‌ ఇండియా దిశగా పరుగులు పెడుతోన్న తరుణంలో ఈ పరిశ్రమకు డిజిటల్‌ నైపుణ్యాలు కలిగిన 50 శాతం ఎక్కువ మంది ఉద్యోగులు అవసరమౌతారని తెలిపారు.

డిజిటల్‌ ఇండియా వల్ల డిజిటల్‌ టెక్నాలజీస్, ఏఐ, రోబోటిక్స్‌లలో ఉద్యోగాలు పెరగొచ్చన్నారు. ‘ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) వంటి పలు అంశాల కారణంగా ఇండియన్‌ జాబ్‌ మార్కెట్‌ మార్పు దిశగా పయనిస్తోంది. ఈ మార్పును అధిగమించి మనుగడ సాగించాలంటే నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం ఒక్కటే మార్గం’ అని నిపుణులు హెచ్చరించారు.  


టీమ్‌లీజ్‌ అంచనా

మరిన్ని వార్తలు