నేటి నుంచి ఈ వారంలో 3 ఇష్యూలు

13 Jul, 2020 11:09 IST|Sakshi

నేటి(13) నుంచి రోజారీ బయోటెక్‌ ఐపీవో

14 నుంచీ భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌-2 

15న యస్‌ బ్యాంక్‌ ఫాలో ఆన్‌ ఆఫర్‌

ఈ వారం మూడు ఇష్యూలతో ప్రైమరీ, సెండరీ మార్కెట్లు సందడి చేయనున్నాయి. నేటి నుంచి స్పెషాలిటీ కెమికల్స్‌ కంపెనీ రోజారీ బయోటెక్‌ పబ్లిక్‌ ఇష్యూ ప్రారంభంకానుంది. ఐపీవోకు ధరల శ్రేణి రూ. 423-425కాగా.. ఇష్యూ బుధవారం(15న) ముగియనుంది. తద్వారా రూ. 496 కోట్లు సమకూర్చుకోవాలని కంపెనీ భావిస్తోంది. ఇక మంగళవారం(14) నుంచి భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ రెండో దశ మొదలుకానుంది. పీఎస్‌యూ కంపెనీల బాండ్లలో ప్రధానంగా పెట్టుబడులుంటాయి. ప్రభుత్వం తరఫున ఎడిల్‌వీజ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ వీటిని చేపడుతోంది. 17న ముగియనున్న ఇష్యూ ద్వారా కనిష్టంగా(బేస్‌ పరిమాణం) రూ. 3,000 కోట్లు సమీకరించనుంది. రూ. 11,000 కోట్లవరకూ గ్రీన్‌షూ ఆప్షన్‌ ఉంది. అంటే ఇష్యూకి అధిక స్పందన వస్తే.. ఇందుకు వీలుగా యూనిట్లను విక్రయించనుంది. ఇంతక్రితం 2019 డిసెంబర్‌లో తొలిసారి ప్రభుత్వం వీటిని ప్రవేశపెట్టింది. ఇక మరోవైపు ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంక్‌ ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ 15న ప్రారంభమై 17న ముగియనుంది. 

యస్‌ బ్యాంక్‌ షేరు పతనం
మార్కెట్‌ ధరతో పోలిస్తే ఎఫ్‌పీవోకు యస్‌ బ్యాంక్‌ షేరుకి రూ. 12 ధరను నిర్ణయించింది. ఇది 55 శాతం తక్కువకావడంతో వరుసగా రెండో రోజు యస్‌ బ్యాంక్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో యస్‌ బ్యాంక్‌ షేరు 11 శాతం కుప్పకూలి రూ. 22.7 వద్ద ట్రేడవుతోంది. కాగా.. ఈ వారం మార్కెట్లలో ఇన్వెస్టర్లకు లభిస్తున్న పెట్టుబడి మార్గాలు మూడూ విభిన్నమైనవని విశ్లేషకులు చెబుతున్నారు. రోజారీ బయోటెక్‌ పబ్లిక్‌ ఇష్యూకాగా.. భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌లు స్థిరపెట్టుబడి మార్గమని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇక యస్‌ బ్యాంక్‌ ఎఫ్‌పీవో ధర ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ భవిష్యత్‌ కార్యకలాపాలపట్ల కొంతమేర ఆందోళనలున్నట్లు తెలియజేశారు.

భారత్‌ బాండ్‌ భేష్‌
ప్రస్తుతం అందుబాటులో ఉన్న మూడు ఆప్షన్లలోనూ ఒక పెట్టుబడి మార్గాన్నే ఎంచుకోవలసి వస్తే భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ మేలని కొంతమంది నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితులను పరిగణిస్తే..దీర్ఘకాలిక దృష్టితో భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్‌ చేయడం లాభించగలదని రెలిగేర్‌ బ్రోకింగ్‌ వైస్‌ప్రెసిడెంట్‌ అజిత్‌ మిశ్రా పేర్కొంటున్నారు. వీటిలో పెట్టుబడులపై రిటర్నులను అంచనా వేసేందుకు వీలుంటుందని చెబుతున్నారు. తొలి దశలో వచ్చిన బాండ్లు వార్షికంగా 14-18 శాతం రిటర్నులను అందించినట్లు తెలియజేశారు. దీనికితోడు భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌నకు ఉత్తమ క్రెడిట్‌ రేటింగ్‌ ఉన్నట్లు తెలియజేశారు. రుణ మార్కెట్లో పెట్టుబడులకు ఇవి వీలుకల్పిస్తున్నట్లు వివరించారు. 

ప్రీమియంలో..
పలు ప్రొడక్టులతో పటిష్ట పోర్ట్‌ఫోలియోను కలిగిన రోజారీ బయోటెక్‌ డైవర్సిఫైడ్‌ కంపెనీగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు మిశ్రా పేర్కొన్నారు. అయితే ప్రీమియం ధరలో కంపెనీ ఐపీవో చేపడుతున్నట్లు అభిప్రాయపడ్డారు. దీంతో తొలి రెండు రోజులూ ఇష్యూకి స్పందన ఎలా ఉందన్న అంశాన్ని గమనించడం మేలు చేయగలదని ఇన్వెస్టర్లకు సూచిస్తున్నారు. తద్వారా ఇష్యూకి కనిపిస్తున్న డిమాండ్‌ ఆధారంగా నిర్ణయం తీసుకునేందుకు వీలుంటుందని తెలియజేశారు. ఇక యస్‌ బ్యాంక్‌ ఎఫ్‌పీవో ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ.. గత సమస్యలు బ్యాంక్‌కు భవిష్యత్‌లో సవాళ్లు విసరవచ్చన్న ఆందోళనలున్నట్లు తెలియజేశారు. ఇదే అభిప్రాయాన్ని పిక్‌రైట్‌ టెక్నాలజీస్‌ కీలక వ్యూహాల అధికారి(సీఎస్‌వో) సిద్ధార్ధ్‌ పంజ్వానీ కూడా వ్యక్తం చేశారు. ఇక ప్రత్యర్ధి సంస్థలు వినతీ, అతుల్‌, ఫైన్‌ ఆర్గానిక్స్‌తో పోలిస్తే ఐపీవో ద్వారా రోజారీ బయోటెక్‌ కొంతమేర ప్రీమియంను ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఆదాయం, నికర లాభాల్లో వృద్ధిరీత్యా ఇది కొంతమేర సమంజసమేనని అభిప్రాయపడ్డారు. భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌లో పెట్టుబడులు అంటే బాండ్లలో ఇన్వెస్ట్‌ చేయడమేనని.. ఒకస్థాయి దాటి రిటర్నులు అందుకునే వీలుండదని వివరించారు. రిస్క్‌ తక్కువ పెట్టుబడులుగా వీటిని భావించవచ్చని తెలియజేశారు. దాదాపు ఇలాంటి అభిప్రాయాలనే శామ్‌కో సెక్యూరిటీస్‌ సీనియర్‌ రీసెర్చ్‌ నిపుణులు నీరాలీ షా సైతం వెల్లడించడం గమనార్హం! అధిక రిస్క్‌ను తీసుకోవడం ద్వారా దీర్ఘకాలంలో అధిక రిటర్నులు ఆశించే ఇన్వెస్టర్లు రోజారీ బయోటెక్‌ లేదా.. యస్‌ బ్యాంక్‌ ఇష్యూవైపు దృష్టిసారించవచ్చని మరికొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యస్‌ బ్యాంక్‌ కౌంటర్‌ భవిష్యత్‌లో పలు ఆటుపోట్లను చవిచూసే వీలున్నదని భావిస్తున్నారు. 

మరిన్ని వార్తలు