9.5 లక్షల కొత్త ఉద్యోగాలు

2 Jan, 2015 00:12 IST|Sakshi
9.5 లక్షల కొత్త ఉద్యోగాలు

న్యూఢిల్లీ: ఉద్యోగార్ధులకు, ఉద్యోగులకు ఈ ఏడాది అద్బుతంగా ఉండనున్నదని వివిద హెచ్‌ఆర్ సంస్థలు అంటున్నాయి.  భారత్‌లోని కంపెనీలు 9.5  లక్షల కొత్త ఉద్యోగాలను ఇవ్వనున్నాయని, అలాగే మంచి పనితీరు కనబరిచే ఉద్యోగులకు వేతనాల పెంపు 40 శాతం వరకూ ఉండొచ్చని ఈ సంస్థ అంటోంది.

మైహైరింగ్‌క్లబ్‌డాట్‌కామ్, యాస్పైరింగ్ మైండ్స్, హే గ్రూప్, ఏఆన్ హెవిట్, గ్లోబల్ హంట్, ఆబ్‌సొల్యూట్ డేటా ఎనలిటిక్స్, పీపుల్ స్ట్రాంగ్ హెచ్‌ఆర్ సర్వీసెస్, టాల్‌వ్యూడాట్‌కామ్ తదితర సంస్థల అంచనాలు ఇలా...

ఈ ఏడాది వివిధ రంగాల్లో 9.5 లక్షల వరకూ కొత్త ఉద్యోగాలు వస్తాయి. వీటిట్లో ఐటీ, ఐటీఈఎస్, ఎఫ్‌ఎంసీజీ రంగాల్లో ఎక్కువగా ఉద్యోగాలు వస్తాయి.

గత ఏడాది వివిధ రంగాల్లో వేతనాల సగటు పెరుగుదల 10-12 శాతంగా ఉంది. ఈ ఏడాది ఇది 15-20 శాతంగా ఉండనున్నది.

కొత్తగా వచ్చిన ఈ కామర్స్ వంటి రంగాల్లో మరింతగా వేతన పెరుగుదల ఉండొచ్చు.

జీడీపీ 5.5 శాతానికి పెరగవచ్చన్న అంచనాలతో వివిధ వ్యాపారాలు వృద్ధి బాటన పడతాయి. దీంతో భారీగా ఉద్యోగాలు వస్తాయి.

తాజా పట్టభద్రులకు గత మూడు సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా ఉద్యోగవకాశాలు ఈ ఏడాది రానున్నాయి. ముఖ్యంగా ఈ కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక, ఐటీ, ఐటీఈఎస్, రిటైల్ రంగాల్లో వీరికి మంచి ఉద్యోగవకాశాలు అధిక స్థాయిలో లభించనున్నాయి.

కేంద్రం మౌలిక సదుపాయాల కల్పన కోసం కృషి చేస్తామని చెబుతుండటంతో ఇంజినీరింగ్, కన్సల్టింగ్ రంగాల్లోనూ భారీగా ఉద్యోగాలు రానున్నాయి.

ఇక జీతాల పెంపు విషయానికొస్తే ప్రతిభ గల ఉద్యోగుల జీతాలు 20-40% వరకూ పెరగవచ్చు.

భారత కంపెనీలు తమ ఉద్యోగుల వేతనాలను సగటున 10-18 శాతం వరకూ పెంచే అవకాశాలున్నాయి.

మరిన్ని వార్తలు