‘సెకండ్ ఇన్నింగ్స్’కు రెడీ...!

14 May, 2016 00:33 IST|Sakshi
‘సెకండ్ ఇన్నింగ్స్’కు రెడీ...!

రెండో విడత బాధ్యతలకు సిద్దమేనని ఆర్‌బీఐ గవర్నర్ రాజన్ సంకేతాలు
చేయాల్సింది చాలా ఉందని వ్యాఖ్య

 లండన్: రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా రెండవ విడత బాధ్యతలు చేపట్టడానికి సిద్ధమన్న సంకేతాలను రఘురామ్ రాజన్ ఇచ్చారు. వచ్చే సెప్టెంబర్‌తో మూడేళ్ల పదవీకాలాన్ని పూర్తిచేసుకుంటుండడం... ఆయన పదవీకాలాన్ని పొడిగించరాదని సుబ్రమణ్యస్వామిసహా పలువురు బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తుండడం వంటి అంశాల నేపథ్యంలో.. రాజన్ లండన్‌లో ఒక వార్తచానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ మూడేళ్లూ ఉద్యోగ బాధ్యతలను పూర్తి సంతృప్తికరంగా నిర్వహించానని అన్నారు. తన పదవీకాలాన్ని పొడిగించరాదని పలువురు బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నప్పటికీ,  ఇంకా చేయాల్సింది చాలా ఉందని రాజన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆర్థికవృద్ధి పథంలో తగిన చొరవల ద్వారా కొంత ముందడుగు వేయగలిగామని ఆయన అన్నారు.

‘ఒక వేళ మీ బాధ్యతలను పొడిగించకపోతే... సెంట్రల్ బ్యాంకర్‌గా మీ అజెండా మధ్యలో ఆగిపోతుంది కదా? అన్న ప్రశ్నకు రాజన్ సమాధానం చెబుతూ, ‘ఇది మంచి ప్రశ్న. చాలా చేశామని నేను భావిస్తున్నాను.  చేయాల్సింది సైతం ఎంతో ఉంటుందిక్కడ’ అని అన్నారు. పలు అధికారిక కార్యక్రమాల్లో ప్రసంగించేందుకు ప్రస్తుతం రాజన్ లండన్‌లో పర్యటిస్తున్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ చీఫ్ ఎకనమిస్ట్‌గా పనిచేసిన రాజన్‌కు... అంతర్జాతీయ ఆర్థిక అంశాలపై విశేష పట్టు ఉంది. 2008 ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే ఊహించిన ఘనత ఆయనకు సొంతం. ప్రతిష్టాత్మక చికాగో యూనివర్సిటీ బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఫైనాన్స్)లో ‘ఆన్‌లీవ్’ ప్రొఫెసర్‌గా ఉన్నారు.

సెప్టెంబర్ 2013లో ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత క్రమంగా కీలక రెపో రేటును 7.25 శాతం నుంచి 8 శాతానికి పెంచారు. 2014 మొత్తం భారత్ అధిక వడ్డీరేటు వ్యవస్థలో కొనసాగింది. ఇందుకు ద్రవ్యోల్బణాన్ని ఆయన కారణంగా చూపారు. అటుతర్వాత ఆర్థికశాఖ, పరిశ్రమల నుంచి వచ్చిన ఒత్తిడులు, ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో క్రమంగా రెపో రేటును 1.50 శాతం తగ్గించారు. దీనితో ఈ రేటు ప్రస్తుతం 6.5 శాతానికి దిగివచ్చింది.

 ఎన్‌పీఏల సమస్య పరిష్కారమవుతుంది...
కాగా భారత్‌లో అమెరికా తరహా ‘లెహ్‌మాన్ మూమెంట్’ రుణ సంక్షోభ సమస్య తలెత్తే ప్రశ్నేలేదని రాజన్ అన్నారు. ఇందుకు తగిన పటిష్ట ఏర్పాట్లు ఉన్నాయని పేర్కొన్నారు. మొండిబకాయిల (ఎన్‌పీఏ)ల సమస్య పరిష్కారమవుతుందని ఆయన అన్నారు. ఇక అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితుల నుంచి భారత్ ఆర్థిక వ్యవస్థకు మూడు రక్షణ వలయాలు ఉన్నట్లు వివరించారు. చక్కటి ఆర్థిక విధానాలు, తగిన స్థాయి నిర్వహణలో ఉన్న రుణ భారం, సరిపడా విదేశీ మారకద్రవ్య నిల్వలుగా వీటిని అభివర్ణించారు.  ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు తక్షణ ఆలోచన ఏదీ లేదని ఆయన స్పష్టంచేశారు.

 ద్రవ్యోల్బణం ఇంకా తీవ్రమే...!
ద్రవ్యోల్బణం ఇంకా తగిన స్థాయికి దిగిరాలేదని రాజన్ వ్యాఖ్యానించారు. దీనితో తదుపరి రేటు కోతకు ఇప్పట్లో అవకాశం లేదని ఆయన సంకేతాలు ఇచ్చినట్లయ్యింది.

>
మరిన్ని వార్తలు