వ్యవసాయ ఆదాయంపై పన్ను లేదు..

7 Aug, 2017 00:10 IST|Sakshi
వ్యవసాయ ఆదాయంపై పన్ను లేదు..

వ్యవసాయం చేయాలనుకుంటున్నారా? తద్వారా ఆదా యం పొందాలని భావిస్తున్నారా? అయితే ఇప్పుడు మీకో మంచి విషయం చెబుతున్నా. వ్యవసాయ ఆదాయంపై పన్ను భారం లేదు. అయితే వ్యవసాయంతోపాటు ఇతరత్రా సంపాదన ఉంటే మాత్రం పన్ను కింద కొంత చెల్లించాలి.

పన్ను భారం లేదు..
మీరు కేవలం వ్యవసాయం చేస్తూ, ఇతర ఆదాయం కలిగి ఉండకపోతే మీ ఆదాయంపై పన్ను మినహాయింపు ఉంది. ఎటువంటి పన్ను భారం లేదు. అయితే ఆదాయపు పన్ను శాఖ పరిశీలించే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. అవి... వ్యవసాయం చేయాలంటే భూమి కావాలి. భూమి కొనుగోలు ధరకి సంబంధించి మీ వద్ద సోర్స్‌ ఉండాలి. మీరు కొనే భూమికి ధర రూ.60,00,000 అనుకోండి. ఈ మొత్తానికి మీరు వివరణ ఇవ్వాలి. ఇక అన్ని రికార్డులు చూసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్‌ చేసుకోండి. అన్ని రశీదులనూ దాచుకోండి.

అమ్మినా క్యాపిటల్‌ గెయిన్స్‌ పడదు..
ఏదేని కారణంతో వ్యవసాయ భూమి అమ్మినా కూడా క్యాపిటల్‌ గెయిన్స్‌ పడదు. అయితే ఫాంహౌస్‌ అద్దెకిచ్చిన పక్షంలో ఆ ఆదాయం మీద మాత్రం పన్ను పడుతుంది. చాలా మంది విదేశాల నుంచి స్వదేశం వచ్చి కలం మానేసి హలం పట్టారు. అలా కుదరని పక్షంలో ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తూ తీరిక వేళల్లో వ్యవసాయం చేస్తున్నారు కొందరు. ఒక వ్యక్తికి వ్యవసాయ ఆదాయం, పన్నుకి గురయ్యే ఇతర ఆదాయం కూడా ఉంటే... అప్పుడు కొంత మొత్తం పన్ను వ్యవసాయం ఆదాయం మీద పడుతుంది.  

ఒక ఉదాహరణ చూద్దాం..
60 ఏళ్లు దాటిన వ్యక్తికి రూ.3,00,000 దాకా పన్ను లేదు. ఈయనకు వ్యవసాయం కాకుండా వచ్చే ఆదాయం రూ.4,00,000 అనుకోండి. ఇక్కడ అదనంగా ఉన్న రూ.1,00,000 మీద 10 శాతం చొప్పున రూ.10,000 పన్ను భారం పడుతుంది. ఇదే వ్యక్తికి వ్యవసాయం మీద రూ.3,00,000 వచ్చిందనుకోండి. అప్పుడు పన్ను భారం పెరుగుతుంది. అదెలా అంటే.. రెండు ఆదాయాలు కలిపితే రూ.7,00,000 అవుతుంది. దీని మీద పన్ను భారం రూ.60,000. రిబేటు (బేసిక్‌ లిమిట్‌+వ్యవసాయ ఆదాయం) రూ.40,000. చెల్లించాల్సింది రూ.20,000. అంటే రూ.10,000 అధికం. ఈ విధంగా రెండు ఆదాయాలు ఉన్నవారు కొంత అధికంగా చెల్లించాలి.

మరిన్ని వార్తలు