జియోకు పోటీగా దూసుకొస్తున్న అమెజాన్

24 Apr, 2020 12:00 IST|Sakshi

స్థానిక దుకాణాదారుల కిరాణా, ఇతర సరుకులు ఆన్‌లైన్ డెలివరీ

6 నెలల పైలట్ ప్రాజెక్టు  : లోకల్ షాప్స్ ఆన్ అమెజాన్

 రూ 10 కోట్ల పెట్టుబడులు

సాక్షి, ముంబై: ఫేస్ బుక్, వాట్సాప్ భాగస్వామ్యంతో రిలయన్స్ ఆధ్వర్యంలోని రిలయన్స్  జియో మార్ట్ ఆన్‌లైన్ కిరణా వ్యాపారంలోకి దూసుకొచ్చేందుకు సిద్దంగా వుంది. మరోవైపు ఆన్‌లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ సరికొత్త  వ్యూహంతో రంగంలోకి దిగిపోయింది. 'లోకల్ షా ప్స్ ఆన్ అమెజాన్'  పేరుతో పైలట్ ప్రోగ్రామ్ ను లాంచ్ చేసింది.  6 నెలల పాటు కొనసాగనున్న ఈ కార్యక్రమంలో భారతదేశంలోని 100కుపైగా నగరాల్లో 5 వేల స్థానిక షాపులురిటైలర్ల భాగస్వామ్యంతో కిరాణా, తదితర అవసరమైన సరుకులను వినియోగదారులకు అందించనుంది. కరోనా వైరస్ విస్తరణ, లాక్‌డౌన్  పొడిగించిన నేపథ్యంలో అత్యవసర వస్తువులతో పాటు, ఇతర ఉత్పత్తుల విక్రయానికి కూడా  అనుమతినివ్వాలని రీటైలర్లు  ప్రభుత్వాన్ని కోరుతున్న నేపథ్యంలో అమోజాన్  తాజా  వ్యూహంతో ముందుకు రావడం గమనార్హం.

టాప్ మెట్రోలతో పాటు టైర్ 1, టైర్ 2 నగరాలైన బెంగళూరు, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, పూణే, జైపూర్, అహ్మదాబాద్, కోయంబత్తూర్, సూరత్, ఇండోర్ లక్నో, సహారాన్‌పూర్, ఫరీదాబాద్, కోటా, వారణాసి తదితర నగరాల్లోని రీటైలర్స్ సిద్దంగా ఉన్నారని అమెజాన్ వెల్లడించింది. కిచెన్, ఫర్నిచర్, దుస్తులు, ఆటోమోటివ్, బ్యూటీ, ఎలక్ట్రానిక్స్, స్పోర్ట్స్, కిరాణా, తోట, పుస్తకాలు, బొమ్మలు ఇతర ఉత్పత్తులను  అందుబాటులోకి ఉంచినట్టు చెప్పింది. అమెజాన్‌ అందిస్తున్న ఈ కొత్త సదుపాయం ద్వారా స్థానిక దుకాణాల నుండి తమకు కావాల్సింది ఎంపిక చేసుకునే వెసులుబాటుతో పాటు వేగంగా డెలివరీ చేయడానికి అవకాశం లభిస్తుందని తెలిపింది. అంతేకాకుండా, దుకాణదారులు తమ ప్రాంతానికి మించి వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి కూడా ఇది సహాయపడుతుందని పేర్కొంది. ప్రపంచంలో ఎక్కడైనా, భారతదేశంలోని స్థానిక దుకాణాల సరుకులను ఆన్‌లైన్‌లో విక్రయించడానికి శక్తినిచ్చేందుకు, తమ టెక్నాలజీ సామర్థ్యాలను ఉపయోగిస్తామని అమెజాన్ ఇండియా వివరించింది.  వినియోగదారులకు ఖచ్చితమైన డెలివరీ కోసం అమెజాన్ డెలివరీ యాప్‌ను ఉపయోగించాలని, అన్ని సరుకుల రవాణాను రోజూ ట్రాక్ చేస్తామని స్పష్టం  చేసింది. (అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌‌కు షాకివ్వనున్న జియో మార్ట్)

స్థానిక దుకాణాలు  డిజిటల్ స్టోర్లుగా మారనున్నాయి. షాపులు తమ ప్రస్తుత ప్రోగ్రామ్‌లో చేరవచ్చనీ, అదనపు ఆదాయాన్ని సంపాదించడానికి వారికి సహాయపడుతుందని అమెజాన్ వెల్లడించింది.  అంతేకాదు తమ యాప్ లోని ఐ హ్యావ్  స్పేస్  సదుపాయం ద్వారా డెలివరీ, పికప్ పాయింట్లుగా పనిచేసి అదనపు ఆదాయాన్ని పొందవచ్చని అమెజాన్ ఇండియా సెల్లర్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ గోపాల్ పిళ్ళై చెప్పారు. దీంతో పాటు వాక్-ఇన్ కస్టమర్లకు 'అమెజాన్ ఈజీ' అనే సౌకర్యం కూడా అందుబాటులో వుంటుందన్నారు. అమెజాన్ ఈజీ మార్కెట్లలోని వినియోగదారులకు ఆన్‌లైన్ షాపింగ్ సౌలభ్యాన్ని పొందటానికి వీలు కల్పిస్తుందనీ, మొదటిసారి ఆన్‌లైన్ దుకాణదారులకు, ఇంటర్నెట్, భాషతో పాటు డిజిటల్ చెల్లింపులు వంటి వివిధ లావాదేవీల అడ్డంకులను తొలగించడానికిసహాయపడుతుందన్నారు. భారతదేశంలోని ఏ ప్రాంతం నుండైనా స్థానిక షాపులు, ఆఫ్‌లైన్ రిటైలర్లు ఈ కార్యక్రమంలో చేరవచ్చన్నారు. ఈ పైలట్ కార్యక్రమం కోసం రూ .10 కోట్లు పెట్టుబడులతో ఇప్పటికే 100 కి పైగా నగరాల నుండి 5,000 మంది స్థానిక దుకాణాలను, రిటైలర్లను తన ప్లాట్‌ఫామ్‌లోకి చేర్చుకున్నామని  గోపాల్ పిళ్లై వెల్లడించారు.  (కొత్త ఉపాధి అవకాశాలు, కొత్త వ్యాపారాలు: అంబానీ)  

మరిన్ని వార్తలు