శుభవార్త : ఐఓఎస్‌ 12 వచ్చేసింది...

5 Jun, 2018 12:10 IST|Sakshi
ఆపిల్‌ డబ్ల్యూడబ్ల్యూడీసీ 2018

కాలిఫోర్నియా : టెక్‌ దిగ్గజం ఆపిల్‌ తన అభిమానులకు శుభవార్త చెప్పేసింది. ఎంతో కాలంగా వేచిచూస్తున్న ఐఓఎస్‌ 12ను ఆపిల్‌ ఎట్టకేలకు విడుదల చేసింది. కాలిఫోర్నియాలోని శాన్‌జోస్‌లో జరుగుతున్న వరల్డ్ వైడ్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌లో‌(డబ్ల్యూడబ్ల్యూడీసీ) ఈ అప్‌డేట్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది. లక్షల కొద్దీ ఐఫోన్లు, ఐప్యాడ్లు మరింత సమర్థవంతంగా పనిచేయడం కోసం ఈ ఐఓఎస్‌ 12ను విడుదల చేయడంతో పాటు సరికొత్త ఫీచర్స్‌ను కూడా తీసుకొచ్చింది. ఈ ఐఓఎస్‌ 12 బగ్స్‌ను ఫిక్స్‌ చేయడంతోపాటు ఐఫోన్‌, ఐప్యాడ్ల పనితీరును మెరుగుపరుస్తుందని కంపెనీ చెప్పింది. ఐఓఎస్‌ 12తో ముందు అనుభవించలేని సరికొత్త అనుభూతిని అందించనున్నామని ఆపిల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ క్రైగ్ ఫెడెర్గి చెప్పారు. 

ఐఓఎస్‌ 12.. టాప్‌ 12 ఫీచర్లు..

మరింత వేగం, మరింత రెస్పాన్సివ్‌ : ఐఫోన్‌ 5ఎస్‌తో పాటు సిస్టమ్స్‌ అన్నింటిలోనూ మెరుగైన పనితీరుపై ఇది ఎక్కువగా ఫోకస్‌ చేసింది. ఐఓఎస్‌ 12తో కెమెరాను 70 శాతం వరకు, కీబోర్డ్‌ 50 శాతం వరకు వేగవంతం చేసింది. 

షేర్డ్‌ ఏఆర్‌ ఎక్స్‌పీరియన్స్‌ : ఐఓఎస్‌ 12తోపాటు ఏఆర్‌కిట్‌2ను ఆపిల్‌ ప్రవేశపెట్టింది. దీంతో మరింత మెరుగైన ఏఆర్‌ యాప్స్‌ను డెవలప్‌ చేసుకోవచ్చు. కొత్త ఓపెన్‌ ఫైల్‌ ఫార్మాట్‌, యూఎస్‌డీజెడ్‌ను ఆపిల్‌ డిజైన్‌ చేసింది. దీంతో ఐఓఎస్‌లో ఎక్కడైనా ఏఆర్‌ అనుభవాన్ని తేలికగా పొందవచ్చు.

గ్రూప్ ఫేస్‌ టైమ్ : ఆపిల్‌లోఉండే ఫేస్‌టైమ్‌ వీడియో కాలింగ్‌ ఫీచర్‌ను మరింత మెరుగుపర్చారు. ఇది ప్రస్తుతం గ్రూప్‌ కాల్స్‌కు సపోర్టు చేయనుంది. ఈ కొత్త గ్రూప్‌ ఫేస్‌టైమ్‌ ఫీచర్‌తో ఒకేసారి అనేక మందితో చాట్‌ చేయొచ్చు. ఈ గ్రూప్‌  ఫేస్‌టైమ్‌ కాల్‌లో గ్రూప్‌ మెసేజ్‌ నుంచి కనెక్ట్‌ అవొచ్చు. ఏ సమయంలోనైనా అభ్యర్థులు జాయిన్‌ కావొచ్చు. సంభాషణ మధ్యలో ఉండగానే కూడా చేరవచ్చు. ఆపిల్‌ వాచ్‌ నుంచి కూడా ఫేస్‌టైమ్‌ ఆడియోలో పాలుపంచుకోవచ్చు.

సిరి షాట్‌కట్స్‌ : సిరితో ఈ రంగంలో కొత్త సంచలనానికి తెరలేపిన ఆపిల్‌కు గూగుల్‌ అసిస్టెంట్‌, అమెజాన్‌ అలెక్సాల నుంచి పోటీ ఎదురైంది. ఇపుడు సిరి మరింత స్మార్ట్‌గా చేశారు. ఇప్పుడు అన్ని యాప్‌లు సిరితో కలిసి పనిచేస్తాయి. మరింత వేగవంతంగా.. సరియైన సమయానికి పని పూర్తి చేస్తాయి. ఇప్పటికే సిరి ఒక్క నెలలో 10 బిలియన్‌ అభ్యర్థలను పూర్తి చేస్తుంది. 

ఫోటో సెర్చ్‌ మెరుగుపరచడం : ఫోటోయాప్‌ అంతాకొత్తగా ‘ఫర్‌ యూ’ అనే ట్యాబ్‌ను కలిగి ఉంటుంది. ఇది మెమరీస్‌, ఐక్లౌడ్‌ షేర్డ్‌ అల్బామ్స్‌ నుంచి ఇష్టమైన క్షణాలన్నింటిన్నీ ఒకచోటికి చేరుస్తోంది. ఈ ఫీచర్‌తో స్నేహితులతో తేలికగా ఫోటోలను షేర్‌ చేసుకోవచ్చు. అదేవిధంగా స్నేహితులు అదే ఈవెంట్‌కు సంబంధించి తిరిగి వీడియోలను, ఫోటోలను షేర్‌ చేయవచ్చు.   

డు నాట్‌ డిస్టర్బ్ : నోటిఫికేషన్‌ బెడద లేకుండా హాయిగా నిద్రపోయేందుకు ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. పైగా బెడ్‌ టైమ్‌ మోడ్‌ని ఆన్‌ చేస్తే డిస్‌ప్లే కూడా డిమ్‌ అయిపోతుంది. అంతేకాకుండా అన్ని నోటిఫికేషన్లను లాక్‌ స్క్రీన్‌ నుంచి హైడ్‌చేసుకోవచ్చు. అంతేకాక ఫోన్‌ యూజర్‌ చెప్పిన సమయానికి ఈ డీఎన్‌డీ బెడ్‌టైమ్‌ మోడ్ పూర్తయి నార్మల్‌లోకి వచ్చేస్తుంది. నోటిఫికేషన్లను డిస్‌ప్లే అవుతాయి.

గ్రూప్డ్‌ నోటిఫికేషన్లు : పదేపదే వచ్చే నోటిఫికేషన్లతో ఎ‍ప్పుడూ తలనొప్పిగా ఉంటుంది. ఆ తలనొప్పి నుంచి బయటపడేందుకు గ్రూప్డ్‌ నోటిఫికేషన్‌ ఫీచర్‌ను తీసుకొచ్చారు. దీంతో ఎలాంటి సెట్టింగ్స్‌లోకి వెళ్లకుండానే నోటిఫికేషన్లను కంట్రోల్‌ చేసుకోవచ్చు. అనుకున్న నిర్ణీత సమయంలో వాటిని చూసుకునేలా ఇది ఉపయోగపడుతోంది.

స్ర్కీన్‌ టైమ్ : అందరూ ఊహించినట్లే డిజిటల్‌ హెల్త్‌ ఫీచర్‌ను ఐఓఎస్‌12లో పొందుపర్చారు. దీనివల్ల యాప్స్‌, వెబ్‌సైట్స్‌పై మీరు వెచ్చించే సమయాన్ని ఈ ఫీచర్‌ కంట్రోల్‌ చేస్తుంది. ఒక్కో యాప్‌పై మీరు ఎంత సమయం వెచ్చించారో గంటవారీ, రోజువారీ, వారంవారీగా డేటా తెలుపుతుంది.

ప్రైవసీ అండ్‌ సెక్యూరిటీ : ఆపిల్‌ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌, మెరుగైన ప్రైవసీ అండ్‌ సెక్యూరిటీకి ఐఓఎస్‌ 12 అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది. సఫారీలో ఇంటెలిజెన్స్‌ ట్రాకింగ్‌ ప్రివెన్షన్‌ ఆప్షన్‌తో మీరు సోషల్‌ మీడియా లైక్‌ లేదా షేర్‌ బటన్స్‌ను బ్లాక్‌ చేయొచ్చు. 

మెమోజీ, ఫన్‌ కెమెరా ఎఫెక్ట్స్‌ : గత ఏడాది అనిమోజీని ప్రవేశపెట్టిన ఆపిల్‌ ఈసారి మెమోజీలను ప్రవేశపెట్టింది. ఇది అచ్చం శాంసంగ్‌ ఏఆర్‌ ఎమోజీలాగానే ఉంది. 

మెజర్‌ యాప్‌ : కొత్త యాప్‌ ఇది. వస్తువులు, గోడల కొలతలను ఈ ఫీచర్‌తో కొలవవచ్చు.  

ఐ బుక్స్‌ను ఆపిల్‌ బుక్స్‌గా రీడిజైన్‌ చేసింది.
 

మరిన్ని వార్తలు