ఆ ఖాతాలపై భారీగా చార్జీల బాదుడు

28 May, 2018 20:09 IST|Sakshi


సాక్షి, ముంబై: నో ఫ్రిల్స్‌  (జీరో బ్యాలెన్స్‌) బ్యాంకు ఖాతాలనుంచి కూడా కొన్ని బ్యాంకులు  భారీగా చార్జిలను బాదేస్తున్నాయని తాజా నివేదిక తేల్చింది. బేసిక్‌ సేవింగ్స్‌ బ్యాంక్‌ డిపాజిట్‌ అకౌంట్‌ (బీఎస్‌బీడీఏ)  ఖాతాలనుంచి నిబంధనలకు విరుద్ధంగా  చార్జీలను వసూలు చేస్తున్నాయని  ఐఐటీ బోంబే ప్రొఫెసర్‌ ఆశిష్‌దాస్‌  నివేదించారు.  నెలలో నాలుగు  విత్‌ డ్రాలు మించితే ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధంగా  సదరు ఖాతాదారులపై  పెనాల్టీని భారీగా  విధిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.  

ఈ పథకం రూపకల్పనలో ఉన్న లోపాల కారణంగా బ్యాంకులు ఆర్‌బీఐ నిబంధనలను ఉల్లంఘించి మరీ కస్టమర్లపై అధిక చార్జీలను విధిస్తున్నాయంటూ ఓ నివేదికను రూపొందించి ఆశిష్‌దాస్‌ విడుదల చేశారు. కస్టమర్‌ ఐదో డెబిట్‌ లావాదేవీ నిర్వహించిన వెంటనే బ్యాంకులు స‍్వచ్ఛందంగా ఆయా ఖాతాల్ని అధిక బ్యాలన్స్‌ నిర్వహణ, చార్జీలు ఉండే సాధారణ ఖాతాలుగా మార్చేస్తున్నాయని ఆశిష్‌దాస్‌ తన నివేదికలో పేర్కొన్నారు.  ఇలా  స్వచ్చందంగా ఖాతాల్ని మార్చడానికి ఆర్‌బీఐ చెక్‌ పెట్టాలని ఆయన కోరారు.  ప్రస్తుతం  నాలుగు ఉపసంహరణల  తరువాత, వినియోగదారుడు ఆన్‌లైన్ కొనుగోళ్లను  చేయలేక పోతున్నారన్నారు. భీమ్‌ యాప్‌ద్వారా లేదా  రూపే  డెబిట్ కార్డు  ద్వారా డబ్బు బదిలీ లేదా రోజువారీ కొనుగోళ్లకు   ఉపయోగించుకోలేకపోతున్నారని తెలిపారు.  తక్కువ నగదు ఉన్న ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా బీఎస్‌బీడీఏ ఖాతాలో నెలవారీ కనీస లావాదేవీలపై నియంత్రణలు తొలగించాలని కూడా సూచించారు. నాలుగో ఉపసంహరణ తర్వాత బీఎస్‌బీడీఏ కస్టమర్లు ఐదో ఆన్‌లైన్‌ లావాదేవీకి అవకాశం లేని విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అంతేకాదు ఇది డిజిటల్‌ చెల్లింపుల ప్రోత్సాహ కార్యక్రమానికి ప్రతికూలమని కూడా ఆయన  పేర్కొన్నారు.

ఆర్థిక సేవలను అందరికీ దగ్గర చేయాలని తీసుకొచ్చిన పథకం బీఎస్‌బీడీఏ  ఖాతా.  వాస్తవానికి బీఎస్‌బీడీఏ ఖాతాల్లో  కనీస బ్యాలన్స్‌ ఉంచాల్సిన అవసరం లేదు. ఖాతాదారులకు ఉపసంహరణలకు పరిమితి ఉంది కానీ, డిపాజిట్లపై పరిమితి లేదు.  కానీ, ఈ ఖాతా నిర్వహణ విషయంలో కొన్ని పరిమితులను  ఆయుధంగా మార్చుకున్న బ్యాంకులు ఖాతాదారులకు చెప్పకుండానే రెగ్యులర్‌ సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాగా మార్చేస్తున్నాయి. ముఖ్యంగా నెలలో నాలుగు సార్లకు మించి ఉపసంహరణలు జరిగితే  ఐదో ఉపసంహరణ జరిగిన  తక్షణమే  బ్యాంకులు ఆయా ఖాతాలను పొదుపు ఖాతాలుగా  మార్చేసి, చార్జీల బాదుడుకు సిద్ధపడుతున్నాయి. అంటే  సాధారణ సేవింగ్‌ ఖాతాల్లోలాగా హై మినిమం బ్యాలెన్స్‌, సర్వీస్‌  చార్జీలను  వర్తింపచేస్తుందన్నమాట. అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయాలన్న లక్ష్యంతో 2012లో ఆర్‌బీఐ బీఎస్‌బీడీఏ పథకాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం 54 కోట్ల బీఎస్‌బీడీఏ ఖాతాలు ఉండగా, వీటిలో సగానికిపైగా  ప్రధాన మంత్రి జన్‌ధన్‌ యోజన ఖాతాలే కావడం విశేషం.

మరిన్ని వార్తలు