ఐదు బ్యాంకులపై ఆర్బీఐ కొరడా! భారీగా జరిమానాలు | Sakshi
Sakshi News home page

ఐదు బ్యాంకులపై ఆర్బీఐ కొరడా! భారీగా జరిమానాలు

Published Mon, Oct 30 2023 7:56 PM

RBI imposed monetary penalties on 5 co operative banks - Sakshi

భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI).. దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో ఉన్న ఐదు సహకార బ్యాంకులపై కొరడా ఝులిపించింది. పలు అంశాలలో నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ జరిమాలను విధించింది. ఉమా కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, పిజ్ పీపుల్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, మిజోరం కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్, బీర్భూమ్ డిస్ట్రిక్ట్ సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, షిహోరి నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్ ఈ జాబితాలో ఉన్నాయి.

(Bank of Baroda: లైఫ్‌టైమ్‌ జీరో బ్యాలెన్స్‌ అకౌంట్‌! డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు కూడా...)

ప్రాథమిక (అర్బన్) కో-ఆపరేటివ్ బ్యాంక్‌లు, ఇతర బ్యాంకుల్లో డిపాజిట్‌లను ఉంచడంపై ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించినందుకు గుజరాత్‌లోని వడోదరలోని ఉమా కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌పై రిజర్వ్ బ్యాంక్ రూ.7 లక్షల జరిమానా విధించింది. కేవైసీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు గానూ గుజరాత్‌లోని పిజ్ పీపుల్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌కు రూ.2 లక్షల పెనాల్టీని విధించిన ఆర్బీఐ ఖాతాల ప్రమాద వర్గీకరణను ఎప్పటికప్పుడు సమీక్షించడంలో పిజ్ పీపుల్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్ విఫలమైందని పేర్కొంది.

(Bank holidays: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌! నవంబర్‌లో సెలవులు ఇవే..)

 

రాష్ట్ర సహకార బ్యాంకులకు వర్తించే 'హౌసింగ్ ఫైనాన్స్'పై తమ ఆదేశాలను పాటించనందుకు ఐజ్వాల్‌లోని మిజోరాం కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్‌కు రిజర్వ్ బ్యాంక్ రూ. 2 లక్షల జరిమానా విధించింది. అలాగే కేవైసీకి సంబంధించి జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించిన  పశ్చిమ బెంగాల్‌లోని బీర్భమ్ జిల్లా సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌కు ఆర్బీఐ రూ.1.10 లక్షల పెనాల్టీ వేసింది. డైరెక్టర్లు, బంధువులు, సంస్థలకు రుణాలిచ్చే విషయంలో ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాలను పాటించనందుకు గానూ గుజరాత్‌లోని షిహోరి నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్‌కు రూ. 1 లక్ష జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Advertisement
Advertisement