బ్యాంకు ఖాతాదారులపై మరో బాదుడు

1 Dec, 2018 11:25 IST|Sakshi

సాక్షి,ముంబై: బ్యాంకింగ్‌ వినియోగదారులకు మరో షాకింగ్‌ న్యూస్‌. ఇప్పటికే సర్‌ఛార్జీల పేరుతో కస్టమర్లపై భారం వేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు , ఇకపై బ్యాంకింగ్ జీఎసీటీ ట్యాక్స్‌ను కూడా కస్టమర్లపైనే వేయనున్నాయి. మినిమమ్ బ్యాలెన్స్ మేయిన్‌టెన్ చేస్తున్నవారికి అందించే ఉచిత సర్వీసులమీద కూడా జీఎస్‌టీ బాదుడుకు రంగం సిద్ధమవుతోందని సమాచారం. అంటే కస్టమర్లకు అందించే సర్వీసులు ఇక భారం కానున్నాయి. ముఖ్యంగా చెక్ బుక్ జారీ, క్రెడిట్ కార్డ్ మంజూరు, ఏటీఎంల వాడకం, ఫ్యూయల్ సర్‌ఛార్జ్ రిఫండ్స్ వంటి సేవలపై ప్రభుత్వం జీఎస్‌టీ విధించనుంది. తద్వారా దాదాపు రూ. 40,000 కోట్ల ట్యాక్స్ , పెనాల్టీలను బ్యాంకుల నుండి ప్రభుత్వం రాబట్టనుంది.

రెండు నెలల క్రితం ట్యాక్స్ డిపార్ట్ మెంట్, బ్యాంకులు ఇస్తున్న ఉచిత సర్వీసులపై జీఎస్‌టీ విధింపుపై బ్యాంకులకు నోటీసులు జారీ చేసింది. దీంతో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ లాంటి బ్యాంకులు జీఎస్‌టీ బాదుడుకు సిద్ధం కానున్నాయని ఎకనామిక్‌ టైమ్స్‌ నివేదించింది. దీంతో దేశంలో ఉన్న అన్ని మేజర్ బ్యాంకులు18శాతం జీఎస్‌టీ విధింపునకు తమ సమ్మతిని తెలియచేశాయట. అయితే ఎంత జీఎస్‌టీ విధించాలన్నదానిపై తుది ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయని  బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. అలాగే చాలా బ్యాంకులు ఈ డిసెంబరునుంచే జీఎస్‌టీ వడ్డనకు సిద్ధమవుతున్నాయని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సీఈవో కేజీ కన్నన్‌ పేర్కొన్నారు. ఈ విధానం అమలైతే కస్టమర్ల పన్ను చెల్లింపులు నేరుగా ప్రభుత్వానికే వెళ్ళిపోతాయని అభిప్రాయపడ్డారు.

సీజీఎస్‌టీ చట్టం లోని షెడ్యూల్ 2 ప్రకారం ఇతర నాన్ బ్యాంకింగ్ రంగాల్లో కూడా జీఎస్‌టీ అమలుపై ఆదాయన పన్ను శాఖ కసరత్తులు చేస్తుంది. ఈ నోటీసులు అందుకున్న బ్యాంకుల్లో మల్టీనేషనల్ బ్యాంకులైన డీబీఎస్‌, సిటీబ్యాంక్‌ కూడా ఉన్నాయి.

మరిన్ని వార్తలు