భారతీ ఇన్‌ఫ్రాటెల్ లాభం హైజంప్

25 Apr, 2014 01:12 IST|Sakshi
భారతీ ఇన్‌ఫ్రాటెల్ లాభం హైజంప్

న్యూఢిల్లీ: టెలికం టవర్ల సంస్థ భారతీ ఇన్‌ఫ్రాటెల్ జనవరి-మార్చి(క్యూ4) కాలానికి ఆకర్షణీయ ఫలితాలను ప్రకటించింది. నికర లాభం 64% జంప్‌చేసి రూ. 472 కోట్లను తాకింది. గతేడాది ఇదే కాలానికి రూ. 287 కోట్లను మాత్రమే ఆర్జించింది. కంపెనీలో మొబైల్ టెలికం సేవల దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌కు 80% వాటా ఉంది. ఇదే కాలానికి ఆదాయం 4% పెరిగి రూ. 2,790 కోట్లకు చేరింది. గతంలో రూ. 2,674 కోట్ల ఆదాయం నమోదైంది. ఈ కాలంలో 5% అధికంగా రూ. 144.5 కోట్ల ఇతర ఆదాయం లభించింది.

 పూర్తి ఏడాదికి...: పూర్తి ఏడాదికి(2013-14) భారతీ ఇన్‌ఫ్రాటెల్ నికర లాభం రూ. 1,003 కోట్ల నుంచి రూ. 1,518 కోట్లకు ఎగసింది. ఆదాయం 5% పుంజుకుని రూ. 10,827 కోట్లయ్యింది. గతంలో రూ. 10,272 కోట్ల ఆదాయం నమోదైంది. టెలికం ఆపరేటర్ కంపెనీలు భారీ పెట్టుబడులను పెడుతున్నాయని, ప్రధానంగా డేటా నెట్‌వర్క్‌లపై దృష్టి పెడుతున్నాయని భారతీ ఇన్‌ఫ్రాటెల్ చైర్మన్ అఖిల్ గుప్తా చెప్పారు. దీంతో టవర్ కంపెనీల ఆదాయాలు భారీగా మెరుగుపడే అవకాశమున్నదని తెలిపారు.

 ఇండియాలో డేటా విభాగం వేగంగా వృద్ధి చెందుతున్నదని, టెలికం కంపెనీలు స్పెక్ట్రమ్‌పై ఇప్పటికే రూ. 1,80,000 కోట్లను ఇన్వెస్ట్‌చేశాయని చెప్పారు. రిలయన్స్ జియోతో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై కుదుర్చుకున్న ఒప్పం దంలో భాగంగా తొలి దశ ఆర్డర్లు లభిస్తున్నాయని తెలిపారు. 2013-14లో రూ. 1,527 కోట్ల పెట్టుబడులను వెచ్చించామని, ఈ ఏడాది(2014-15) ఆర్డర్ల స్థాయిని బట్టి రూ. 2,000 కోట్ల వరకూ వ్యయాలుండవచ్చునని వెల్లడించారు.

మరిన్ని వార్తలు