ఫ్లిప్‌కార్ట్‌ బిన్నీ రాజీనామా!!

14 Nov, 2018 02:20 IST|Sakshi

గ్రూప్‌ సీఈవోగా నిష్క్రమణ

వ్యక్తిగత దుష్ప్రవర్తన ఆరోపణలే కారణం

వాల్‌మార్ట్‌– ఫ్లిప్‌కార్ట్‌ స్వతంత్ర విచారణ

న్యూఢిల్లీ: ‘తీవ్రమైన వ్యక్తిగత దుష్ప్రవర్తన’ ఆరోపణల కారణంగా దేశీ ఈకామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్‌ మంగళవారం గ్రూప్‌ సీఈవో పదవి నుంచి తప్పుకున్నారు. ఫ్లిప్‌కార్ట్‌ను ఇటీవలే కొనుగోలు చేసిన వాల్‌మార్ట్‌ మంగళవారం ఒక ప్రకటనలో ఈ విషయం వెల్లడించింది. ఆరోపణలపై ఫ్లిప్‌కార్ట్‌తో కలిసి స్వతంత్రంగా విచారణ జరిపామని, కానీ ఫిర్యాదుదారు ఆరోపణలను ధ్రువీకరించడానికి తగిన ఆధారాలు లభించలేదని పేర్కొంది. అయినప్పటికీ విచారణ అనంతరం బన్సల్‌ వైదొలగాలని నిర్ణయం తీసుకున్నారని, సదరు ఆరోపణల మీద బిన్నీ స్పందించిన తీరులో పారదర్శకత లోపించడం కారణంగా ఆయన రాజీనామాను ఆమోదించామని వాల్‌మార్ట్‌ వివరించింది.

‘‘ఫిర్యాదు చేసిన వ్యక్తి ఆరోపణలపై క్షుణ్నంగా విచారణ చేశాం. బిన్నీకి వ్యతిరేకంగా చేసిన ఆరోపణలను బలపరిచే ఆధారాలేవీ కనిపించలేదు. కానీ ఆ వ్యవహారాన్ని సరిగ్గా అంచనా వేయడంలో బిన్నీ విఫలం కావడం, ఆయన స్పందించిన తీరులో పారదర్శకత లోపించడం వంటి అంశాలు బయటపడ్డాయి. దీంతో ఆయన రాజీనామాను ఆమోదించాం‘ అని వాల్‌మార్ట్‌ పేర్కొంది. తక్షణమే ఇది అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది.

‘వ్యక్తిగత దుష్ప్రవర్తన ఆరోపణలు‘ అంటూ ప్రకటనలో పేర్కొన్నప్పటికీ, ఏమిటా ఆరోపణలన్నది మాత్రం వాల్‌మార్ట్‌ నిర్దిష్టంగా వివరించలేదు. అయితే ఈ ఆరోపణలు జూలైలో వచ్చాయని... వెంటనే వాల్‌మార్ట్‌ ఒక న్యాయవాద సంస్థతో వీటిపై విచారణ ఆరంభించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫిర్యాదిదారు కొన్నాళ్ల క్రితం ఫ్లిప్‌కార్ట్‌లో బిన్నీతో కలిసి పనిచేశారని, ప్రస్తుతం ఆమె తన సొంత వెంచర్‌ నిర్వహించుకుంటున్నారని వివరించాయి. కానీ, వీటిని ధ్రువీకరించుకునేందుకు తగిన ఆధారాలు లభించలేదు. మరోవైపు, తనపై వచ్చిన ఆరోపణలను బిన్నీ బన్సల్‌ ఖండించారు.

ఇకపైనా సంస్థలో వాటాదారుగా, బోర్డులో సభ్యుడిగా కొనసాగుతానని పేర్కొన్నారు. మరో ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ మాజీ ఉద్యోగులైన సచిన్‌ బన్సల్, బిన్నీ బన్సల్‌ కలిసి 2007లో ఫ్లిప్‌కార్ట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది మేలో ఫ్లిప్‌కార్ట్‌ను వాల్‌మార్ట్‌ 16 బిలియన్‌ డాలర్లతో కొనుగోలు చేసింది. ఈ డీల్‌లో భాగంగా సచిన్‌ బన్సల్‌ తన మొత్తం 5.5% వాటాను విక్రయించేసి తప్పుకోగా, బిన్నీ బన్సల్‌ మాత్రం కంపెనీలోనే కొనసాగుతున్నారు.  

కొత్త సారథి ఎంపిక వేగవంతం..
కొన్నాళ్లుగా బిన్నీ బాధ్యతలను బదలాయించే యోచనలో ఉన్నారని, వారసుల ఎంపికపై ఆయనతో కలిసి కొద్ది రోజులుగా తాము కూడా కసరత్తు చేస్తూనే ఉన్నామని వాల్‌మార్ట్‌ తెలిపింది. బిన్నీ నిష్క్రమణతో కొత్త సారథి నియామక ప్రక్రియ వేగవంతమైందని పేర్కొంది.

మింత్రా, జబాంగ్‌తో కూడిన ఫ్లిప్‌కార్ట్‌ సీఈవోగా కళ్యాణ్‌ కృష్ణమూర్తి కొనసాగుతారని వివరించింది. అయితే, మింత్రా, జబాంగ్‌లు ప్రత్యేక సంస్థలుగానే కొనసాగుతాయని, వీటి సీఈవోగా అనంత్‌ నారాయణన్‌ కొనసాగుతారని వాల్‌మార్ట్‌ వివరించింది. కృష్ణమూర్తికి అనంత్‌ నారాయణన్‌ రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌ పేమెంట్స్‌ విభాగం ’ఫోన్‌పే’ సీఈవోగా సమీర్‌ నిగమ్‌ కొనసాగుతారు. కృష్ణమూర్తి, నిగమ్‌ నేరుగా బోర్డుకు రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుందని వాల్‌మార్ట్‌ వివరించింది.


పెట్టుబడుల ప్రక్రియ యథాప్రకారం..
దీర్ఘకాలంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు తాము కట్టుబడి ఉన్నామని వాల్‌మార్ట్‌ తెలిపింది. భవిష్యత్‌లో ఐపీవోకి రావాలన్న ప్రస్తుత లీడర్‌షిప్‌ టీమ్‌కి పూర్తి మద్దతునిస్తామని పేర్కొంది. మరోవైపు, తాజా పరిణామాల నేపథ్యంలో సంస్థ భవిష్యత్‌పై ఉద్యోగులు ఆందోళన చెందరాదని సంస్థ సిబ్బందికి అంతర్గతంగా పంపిన ఈ–మెయిల్‌లో కృష్ణమూర్తి భరోసానిచ్చారు.

‘ఈ వార్తల కారణంగా కంపెనీ నిర్వహణ, లక్ష్యాల సాధనలో ఎలాంటి మార్పులు ఉండబోవు. ఫ్లిప్‌కార్ట్‌ ఇకపై కూడా కొంగొత్త టెక్నాలజీలు, నవకల్పనలు, సరఫరా వ్యవస్థలపై భారీగా పెట్టుబడులు కొనసాగిస్తుంది’ అని కృష్ణమూర్తి తెలిపారు.

మరిన్ని వార్తలు