ఈ 3 చిన్న షేర్లూ యమస్పీడ్‌

8 Jul, 2020 14:05 IST|Sakshi

జోరుగా హుషారుగా

బిర్లాసాఫ్ట్‌ లిమిటెడ్‌

స్టీల్‌ స్ట్రిప్స్‌ వీల్స్‌

రామ్‌కో సిస్టమ్స్‌

మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదులుతున్పప్పటికీ ఈ చిన్న తరహా కౌంటర్లకు మాత్రం డిమాండ్‌ కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఐటీ సేవల కంపెనీ బిర్లాసాఫ్ట్‌ లిమిటెడ్‌, ఆటో విడిభాగాల సంస్థ స్టీల్‌ స్ట్రిప్స్‌ వీల్స్‌, సాఫ్ట్‌వేర్‌ సేవల కంపెనీ రామ్‌కో సిస్టమ్స్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..

బిర్లాసాఫ్ట్‌ 
డిజిటల్‌ సోల్యూషన్స్‌ అందించేందుకు గ్లోబల్‌ టెక్నాలజీ కంపెనీ ఇన్నోవియోతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు బిర్లాసాఫ్ట్‌ పేర్కొంది. యూఎస్‌, యూరోపియన్‌ మార్కెట్లలో పలు బీమా రంగ దిగ్గజాలకు ఇన్నోవియో టెక్నాలజీ సొల్యూషన్స్‌ అందిస్తున్నట్లు తెలియజేసింది. నోకోడ్‌ ప్లాట్‌ఫామ్‌ విభాగంలో కంపెనీకున్న నైపుణ్యం బిర్లాసాఫ్ట్‌కు ఎంతో ప్రయోజనకరమని కంపెనీ ఎస్‌వీపీ శిల్పా భండారీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బిర్లాసాఫ్ట్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 7 శాతం జంప్‌చేసి రూ. 98 వద్ద ట్రేడవుతోంది.

రామ్‌కో సిస్టమ్స్‌
ఏవియేషన్‌ రంగ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌కు పేరొందిన రామ్‌కో సిస్టమ్స్‌.. యూఎస్‌ కంపెనీ టాక్టికల్‌ ఎయిర్‌ సపోర్ట్‌ నుంచి ఆర్డర్‌ పొందినట్లు తెలియజేసింది.  దీనిలో భాగంగా ఏవియేషన్‌ ఎంఆర్‌వో సూట్‌ V5.8ను టాక్టికల్‌ కోసం వినియోగించనున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో రామ్‌కో సిస్టమ్స్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 114 సమీపంలో ఫ్రీజయ్యింది.

స్టీల్‌ స్ట్రిప్స్‌ వీల్స్‌
యూరోపియన్‌ మార్కెట్ నుంచి తొలిసారి అలాయ్‌ వీల్స్‌ సరఫరాకు కాంట్రాక్టును సంపాదించినట్లు స్టీల్‌ స్ట్రిప్స్‌ వీల్స్‌ తాజాగా పేర్కొంది. మెహసనా ప్లాంటు నుంచి వీటిని సరఫరా చేయనున్నట్లు తెలియజేసింది. తద్వారా యూఎస్‌, ఈయూ మార్కెట్లకు 3100 సీవీ వీల్స్‌ను ఎగుమతి చేయనున్నట్లు తెలియజేసింది. దీంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో స్టీల్‌ స్ట్రిప్స్‌ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 457 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 468 వరకూ ఎగసింది.

మరిన్ని వార్తలు