అక్కడక్కడే పసిడి..

13 Nov, 2017 01:40 IST|Sakshi

స్వల్ప శ్రేణిలోనే తిరుగాడనున్న రేటు

వారాంతంలో లాభాల్లోనే క్లోజింగ్‌

ముంబై/న్యూఢిల్లీ: మూడువారాల నష్టాలకు బ్రేక్‌ వేస్తూ.. పుత్తడి రేట్లు వారాంతంలో లాభాల్లోనే ముగిశాయి. అమెరికాలో పన్నుల ప్రతిపాదనలపై భిన్నాభిప్రాయాలతో డాలరు బలహీనపడిన నేపథ్యంలో బంగారం ధరలు  అంతక్రిత వారంతో పోలిస్తే గతవారం 0.4 శాతం పెరిగాయి. అయితే స్వల్ప శ్రేణిలోనే రేట్లు తిరుగాడవచ్చని, ఈ ధోరణిని దాటి పెరగడమో తగ్గడమో జరగాలంటే ఏదైనా భారీ పరిణామం ఊతమివ్వాల్సి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

అంతర్జాతీయంగా గత వారం ప్రారంభంలో పసిడి ధరలు మూడు వారాల గరిష్ట స్థాయికి ఎగిసినప్పటికీ.. ఆ ఊపు వారమంతా కొనసాగలేదు. శుక్రవారం సుమారు 15 నిమిషాల వ్యవధిలో ఓ ట్రేడరు భారీ స్థాయిలో అమ్మకాలకు ఆర్డరు పెట్టడం మార్కెట్‌ను కాస్త కంగారుపెట్టింది. మొత్తం మీద వారాంతంలో న్యూయార్క్‌ కమోడిటీ ఎక్సే్చంజీలో 1,275.70 డాలర్ల వద్ద ట్రేడయ్యింది.  

ట్రేడర్స్‌కి అనువైన మార్కెట్‌..  
ప్రస్తుత మార్కెట్‌ ధోరణులు స్వల్పకాలిక ట్రేడర్లకు అనువుగా ఉన్నాయని, అటూ ఇటూ పది–పదిహేను డాలర్ల శ్రేణిలో ట్రేడింగ్‌ జరగొచ్చని ఫారెక్స్‌లైవ్‌డాట్‌కామ్‌ కరెన్సీ అనలిస్టు ఆడమ్‌ బటన్‌ అభిప్రాయపడ్డారు. సమీపకాలంలో పసిడి మరింత పెరిగే అవకాశం ఉన్నప్పటికీ.. కీలకమైన 1,310 డాలర్ల నిరోధ స్థాయిని అధిగమించేంత ఊతం మార్కెట్లలో కనిపించడం లేదని పేర్కొన్నారు. అమెరికాలో కీలకమైన పన్నుల సంస్కరణ ప్రతిపాదనలు పసిడిపై ప్రభావం చూపవచ్చని తెలిపారు.  

అమెరికా డాలరు గణనీయంగా బలహీనపడి, భౌగోళిక.. రాజకీయ అనిశ్చితి మరింతగా పెరిగిన పక్షంలోనే పసిడి ధరలు ఔన్సుకి 1,300 డాలర్ల స్థాయిని దాటే అవకాశాలు ఉన్నాయని సాక్సో బ్యాంక్‌ కమోడిటీ స్ట్రాటజీ విభాగం హెడ్‌ వోల్‌ హాన్సెన్‌ పేర్కొన్నారు. పసిడి 1,263 (మద్దతు స్థాయి) – 1,295 (నిరోధం) డాలర్ల మధ్య తిరుగాడే అవకాశం ఉందని డైలీఎఫ్‌ఎక్స్‌డాట్‌కామ్‌ కరెన్సీ స్ట్రాటజిస్ట్‌ క్రిస్టోఫర్‌ వెచియో పేర్కొన్నారు. అక్టోబర్‌లో నమోదైన 1,308 డాలర్ల స్థాయిని దాటితేనే కొత్త ఇన్వెస్టర్లు వచ్చే అవకాశం ఉందన్నారు. 1,265... 1,255 వద్ద పసిడి రేట్లకు మద్దతు లభించగలదని చెప్పారు.  

దేశీయంగా ఒక్క శాతం అప్‌..
ఇన్వెస్టర్లు, స్టాకిస్టుల నుంచి కొనుగోళ్లతో పాటు ఆభరణాలకు డిమాండు, అంతర్జాతీయంగా సానుకూల సెంటిమెంటు మొదలైన అంశాలతో దేశీయంగా కూడా పసిడి ధరలు గతవారంలో లాభాల్లోనే ముగిశాయి. న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్లో ఆభరణాల పసిడి పది గ్రాముల ధర వారం తొలినాళ్లలో రూ. 29,985 వద్ద ప్రారంభమై చివర్లో రూ. 30,300 వద్ద ముగిసింది. అలాగే రూ. 30,135 వద్ద ప్రారంభమైన మేలిమి బంగారం చివరికి రూ. 30,450 వద్ద క్లోజయ్యింది. మరోవైపు, వారంవారీగా చూస్తే వెండి కేజీ ధర రూ. 100 తగ్గి రూ. 40,400 వద్ద ముగిసింది.  

మరిన్ని వార్తలు