హైదరాబాద్ నుంచి లండన్‌కు ఇక ప్రతిరోజు విమానం

1 Apr, 2014 00:10 IST|Sakshi
హైదరాబాద్ నుంచి లండన్‌కు ఇక ప్రతిరోజు విమానం

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో/న్యూస్‌లైన్: విమానయాన సేవల సంస్థ బ్రిటిష్ ఎయిర్‌వేస్ హైదరాబాద్ నుంచి లండన్‌కు ప్రతి రోజు విమాన సర్వీసులు ప్రారంభించింది. వారంలో 5 సర్వీసులు కాస్తా 787 డ్రీమ్‌లైనర్ రాకతో ఏడుకు చేరాయి. బ్రిటిష్ ఎయిర్‌వేస్ తొలి 787 డ్రీమ్‌లైనర్ లండన్ నుంచి హైదరాబాద్‌కు సోమవారం(మార్చి 31) ఉదయం 4.45కు శంషాబాద్ విమానాశ్రయంలో అడుగు పెట్టింది. కంపెనీ ప్రచారంలో భాగంగా బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్‌ను ఈ విమానంలో తీసుకొచ్చింది. లండన్ నుంచి హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరుకు వారంలో 48 సర్వీసులను నడుపుతున్నట్టు బ్రిటిష్ ఎయిర్‌వేస్ దక్షిణాసియా ప్రాంత వాణిజ్య మేనేజర్ క్రిస్టఫర్ ఫోర్డిస్ సోమవారమిక్కడ తెలిపారు.

ప్రతిరోజు ఢిల్లీ, ముంబైలకు రెండు, హైదరాబాద్, బెంగళూరుకు ఒకటి, చెన్నైకి వారంలో 6 సర్వీసులు అందిస్తున్నట్టు చెప్పారు. ప్రత్యేక వంటకాలు, బాలీవుడ్ సినిమాలు భారతీయ ప్రయాణికులకు ప్రత్యేకమన్నారు. భారీ విహంగం ఏ380ని ఎప్పుడు పరిచయం చేస్తారన్న ప్రశ్నకు.. తొలుత విదేశాల్లోని ప్రధాన నగరాలకు ప్రారంభిస్తామని వెల్లడించారు. సంస్థకు ఉత్తర అమెరికా తర్వాత రెండో అతిపెద్ద మార్కెట్‌గా భారత్ నిలిచింది. దూర ప్రయాణాలకు అనువైన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌లో 210 నుంచి 330 మంది ప్రయాణికులు కూర్చునే వీలుంది.
 
 డ్రీమ్‌లైనర్ విమానాన్ని ప్రారంభించిన బిగ్-బి..
 హైదరాబాద్‌లో 787 బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమానాన్ని ఉగాది పర్వదినం నాడు తన చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉందని బిగ్-బి అమితాబ్ బచ్చన్ అన్నారు. సోమవారం రాత్రి ఫలక్‌నుమా ప్యాలెస్ ఆవరణలో బ్రిటీష్ ఎయిర్‌వేస్‌కు చెందిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాన్ని ప్రారంభించారు. ‘నమస్కారం... మీ అందరికి ఉగాది శుభాకాంక్షలు...’ అంటూ తెలుగులో ఉపన్యాసాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ... ‘హైదరాబాద్ సంసృ్కతి, సంప్రదాయమంటే నాకెంతో ఇష్టం. ఇక్కడి ఆచార వ్యవహారాలు బాగుంటాయి. అందుకే నాకు హైదరాబాద్ అంటే చాలా ఇష్టం.

హైదరాబాద్‌తో పాటు లండన్ నగరంతో కూడా మా కుటుంబానికి ఎన్నో ఏళ్ల నుంచి విడదీయరాని బంధం ఏర్పడింది. తాత ముత్తాతలతో పాటు మా కుటుంబానికి లండన్ నగరం ఎంతో ఇష్టమైంది. జయబచ్చన్‌తో వివాహం అనంతరం హనీమూన్‌కు లండన్‌కే వచ్చాం. నా సినిమాల షూటింగ్‌లు కూడా అప్పుడప్పుడు లండన్ నగరంలో జరుగుతుంటాయి.  ఏ మాత్రం సెలవులు దొరికినా లండన్ నగరంలోనే గడుపుతాం. ఇలాంటి లండన్ నగరానికి చెందిన బ్రిటీష్ ఎయిర్‌వేస్ విమానాన్ని తాను ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నాను... అని బిగ్-బి అమితాబ్ బచ్చన్ లండన్ నగరంతో ఉన్న అనుబంధాన్ని తన చిన్ననాటి జ్ఞాపకాలతో విలేకర్లకు వివరించారు.

>
మరిన్ని వార్తలు