36,000 పాయింట్ల పైకి సెన్సెక్స్‌

10 Jan, 2019 01:12 IST|Sakshi

లాభాల్లో ప్రపంచ మార్కెట్లు 

క్యూ3 పలితాలపై  ఆశావహ అంచనాలు

36,000 పాయింట్ల పైకి సెన్సెక్స్‌

232 పాయింట్లు పెరిగి 36,213వద్ద ముగింపు

53 పాయింట్లు ఎగసి  10,855 వద్దకు నిఫ్టీ 

సానుకూల అంతర్జాతీయ సంకేతాల కారణంగా బుధవారం స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ముగిసింది.  వరుసగా నాలుగో రోజూ స్టాక్‌ సూచీలు లాభపడ్డాయి. వాణిజ్య ఉద్రిక్తతలను నివారించే ఒప్పందం అమెరికా–చైనాల మధ్య కుదరనున్నదన్న వార్తల కారణంగా ప్రపంచ మార్కెట్లు పెరగడం సానుకూల ప్రభావం చూపించింది. కంపెనీల మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు బాగా ఉంటాయనే అంచనాలతో కొనుగోళ్లు జోరుగా సాగడం కలసివచ్చింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ మళ్లీ 36,000 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా కీలకమైన 10,850 పాయింట్ల ఎగువున ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 232 పాయింట్లు పెరిగి 36,213 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 53 పాయింట్లు పెరిగి 10.855 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. గత నాలుగు ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ మొత్తం 699 పాయింట్లు ఎగసింది. 

ఇంట్రాడే నష్టం నుంచి 350 పాయింట్లు పైకి....
సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైంది. కొనుగోళ్ల జోరుతో లాభాలు మరింతగా పెరిగాయి. భారత జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతంగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.5 శాతంగా ఉండగలదన్న ప్రపంచ బ్యాంక్‌ అంచనాలు కూడా సానుకూల ప్రభావం చూపించాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్‌  వంటి  పెద్ద కంపెనీల క్యూ3 ఫలితాలు వెల్లడి కానుండటంతో మార్కెట్లో అప్రమత్తత చోటు చేసుకోవడం, రూపాయి పతనం కావడంతో మధ్యాహ్నం తర్వాత ఈ లాభాలన్నీ హరించుకుపోయాయి. కొంత సమయం పాటు సెన్సెక్స్‌ నష్టాల్లో ట్రేడయింది. ఆ తర్వాత పుంజుకొని మళ్లీ లాభాల బాట పట్టింది. ఒక దశలో 270 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌ మరో దశలో 118 పాయింట్లు నష్టపోయింది. మొత్తం మీద రోజంతా 388 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇంట్రాడే కనిష్ట స్థాయి నుంచి చూస్తే, సెన్సెక్స్‌ 350 పాయింట్ల వరకూ పెరిగింది. ప్రైవేట్‌ బ్యాంక్, ఐటీ, ఎఫ్‌ఎమ్‌సీజీ, వాహన  రంగ షేర్లలో కొనుగోళ్లు జోరు కనిపించింది.  

మరిన్ని వార్తలు