15 నుంచి బీఎస్‌ఎన్‌ఎల్ ఉచిత రోమింగ్

3 Jun, 2015 00:55 IST|Sakshi
15 నుంచి బీఎస్‌ఎన్‌ఎల్ ఉచిత రోమింగ్

* జూలైలో పూర్తి మొబైల్ నంబర్ పోర్టబులిటీ
* కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్

సాక్షి, న్యూఢిల్లీ: బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్ పరిధిలో ఉచిత రోమింగ్ సేవలు జూన్ 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయని కేంద్ర కమ్యూనికేషన్లు, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. పూర్తిస్థాయి మొబైల్ నంబర్ పోర్టబులిటీ జూలై నుంచి మొదలవ్వనుందని తెలిపారు.

ఢిల్లీలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టెలికం, పోస్టల్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో సాధించిన ప్రగతిని ఆయన వివరించారు.  2004లో బీఎస్‌ఎన్‌ఎల్ రూ.10 వేల కోట్ల లాభాల్లో ఉండగా యూపీఏ పదేళ్ల పాలనలో రూ.7,500 కోట్ల నష్టాల్లోకి వెళ్లిందన్నారు. 2008 వరకు లాభా ల్లో ఉన్న ఎంటీఎన్‌ఎల్ కూడా నష్టాల బాట పట్టిం దన్నారు. వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చడం, టెలికం, పోస్టల్, ఎలక్ట్రానిక్స్ రంగాల అభివృద్ధి లక్ష్యంగా కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామన్నారు.

స్పెక్ట్రం వేలం ద్వారా ప్రభుత్వానికి లక్ష కోట్లకు పైగా ఆదాయం సమకూరిందన్నారు. దేశంలోని 100 పర్యాటక ప్రాంతాల్లో వైఫై ఏర్పాటు  చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, తెలంగాణలోని హైదరాబాద్ సహా  బెంగుళూరు, వారణాసిలో ఇప్పటికే వైఫై సేవలు ప్రారంభమైనట్లు వెల్లడించారు.

మరిన్ని వార్తలు