ఏడాది తర్వాతే పసిడికి డిమాండ్‌..!

25 Jan, 2017 06:52 IST|Sakshi
ఏడాది తర్వాతే పసిడికి డిమాండ్‌..!

డీమోనిటైజేషన్‌తో ఈ ఏడాది వినియోగం తగ్గొచ్చు
ప్రతిపాదిత జీఎస్‌టీ, నాణ్యతా ప్రమాణాలతో అనిశ్చితి
వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ అంచనాలు


న్యూఢిల్లీ: డీమోనిటైజేషన్‌ ప్రభావం పసిడిపై గణనీయంగానే కనిపించనున్నది. ఇప్పటికే ఏడేళ్ల కనిష్ట స్థాయికి తగ్గిన పుత్తడి వినియోగం .. ప్రస్తుతం నగదు కొరత సమస్యల కారణంగా  వినియోగదారులు కొనుగోళ్లను తగ్గించుకుంటూ ఉండటంతో వినియోగం ఈ ఏడాది ఓ మోస్తరు స్థాయికే పరిమితం కావొచ్చని అంచనాలు నెలకొన్నాయి. ఈ పరిణామాలతో వచ్చే ఏడాదికి గానీ పసిడి డిమాండ్‌ మళ్లీ సాధారణ స్థాయికి రాకపోవచ్చని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ (డబ్ల్యూజీసీ) ఒక నివేదికలో పేర్కొంది.  పెద్ద నోట్ల రద్దు కారణంగా బంగారానికి డిమాండ్‌ ఎక్కువగా లేకుండా పోయిందని డబ్ల్యూజీసీ భారత విభాగం ఎండీ పీఆర్‌ సోమసుందరం పేర్కొన్నారు. ప్రతిపాదిత వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) విధానం, ఆభరణాల నాణ్యతా ప్రమాణాలను ఖరారు చేయడం మొదలైనవి పసిడి విషయంలో మరింత అనిశ్చితికి దారితీయొచ్చని ఆయన తెలిపారు.

ఎక్కువగా నగదు లావాదేవీలపై ఆధారపడే బంగారం రీసైక్లింగ్‌ వ్యాపారంపై కూడా  డీమోనిటైజేషన్‌ ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందని సోమసుందరం తెలిపారు. దీనివల్ల సరఫరా తగ్గి..ఇప్పటికే సమస్యలు ఎదుర్కొంటున్న స్థానిక రిఫైనర్లపై మరింత  ఒత్తిడి పడే అవకాశం ఉందన్నారు. ముడి పసిడి దిగుమతులు తగ్గి.. రిఫైనింగ్‌ పరిశ్రమలో కన్సాలిడేషన్‌కి దారితీయొచ్చని పేర్కొన్నారు. అయితే, తాజాగా నగదు రహిత లావాదేవీల పెరుగుదలతో గ్రే మార్కెట్‌ పూర్తిగా మాయమైపోగలదని సోమసుందరం చెప్పారు. దీనితో దీర్ఘకాలంలో ఇటు కొనుగోలుదారులకు, అటు పరిశ్రమకు ప్రయోజనం చేకూరగలదన్నారు.  

850–950 టన్నుల స్థాయిలోనే డిమాండ్‌..
నగదు కొరతతో డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడనున్న నేపథ్యంలో 2020 నాటికి భారత్‌లో వినియోగం సగటున 850–950 మెట్రిక్‌ టన్నుల స్థాయిలోనే ఉండొచ్చని డబ్ల్యూజీసీ అంచనా వేసింది. డబ్ల్యూజీసీ 2016లో రెండు సార్లు వినియోగం అంచనాలను 650 టన్నులు – 750 టన్నుల మధ్య తగ్గించింది. 2009 తర్వాత ఇదే అతి తక్కువ స్థాయి. అప్పట్లో డిమాండ్‌ 578.5 టన్నులుగా నమోదైంది. పసిడి పరిశ్రమను నియంత్రించడం మొదలైన చర్యలతో పుత్తడి సంబంధిత విధానాలను ఏమాత్రం కఠినతరం చేసినా స్వల్ప, మధ్యకాలికంగా డిమాండ్‌ను తగ్గించేసే అవకాశం ఉందని డబ్ల్యూజీసీ తెలిపింది. అయితే ఆదాయాలు పెరుగుతుండటం, పొదుపు రేట్లు స్థిరంగా ఉండటం మొదలైన అంశాల కారణంగా బంగారం సహా వివిధ పెట్టుబడి సాధనాలకు మద్దతు లభించగలదని వివరించింది.

40 శాతానికి పెద్ద సంస్థల మార్కెట్‌ వాటా..
దేశీయంగా పెద్ద ఆభరణాల సంస్థలకు మాత్రం డీమోనిటైజేషన్‌ ప్రయోజనం చేకూర్చనుంది. బంగారానికి సంబంధించి 2015లో 30 శాతంగా ఉన్న పెద్ద జ్యుయలరీ స్టోర్స్‌ సంస్థల మార్కెట్‌ వాటా 2020 నాటికి 40 శాతానికి పెరగవచ్చని సోమసుందరం తెలిపారు.

మరిన్ని వార్తలు