బడ్జెట్‌ కార్యక్రమాలు షురూ!

21 Jan, 2019 15:38 IST|Sakshi


సాక్షి, న్యూఢిల్లీ: 2019 ఆర్థిక బడ్జెట్‌కు సంబంధించిన కార్యక్రమాలు లాంఛనంగా మొదలయ్యాయి. ఆర్థికశాఖ కార్యాలయంలో  సోమవారం హల్వా వేడుకను నిర్వహించారు.  కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లిన కారణంగా ఈ  ప్రీ బడ్జెట్‌ వేడుకను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ ప్రతాప్‌ శుక్లా ప్రారంభించారు. దీంతో నేటి నుంచి మధ్యంతర బడ్జెట్‌ కాగితాల ముద్రణ లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో రవాణ శాఖ మంత్రి పొన్‌ రాధకృష్ణన్‌, ఆర్థిక శాఖ కార్యదర్శి డీఈఏ సుభాష్‌ గార్గ్‌ పాల్గొన్నారు.  


హల్వా వేడుక 
ప్రతి బడ్జెట్‌కు ముందు సంప్రదాయం ప్రకారం కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయంలో హల్వా వేడుక నిర్వహిస్తారు. బడ్జెట్‌‌కు సంబంధించిన అంశాలను అత్యంత రహస్యంగా ఉంచుతారన్న విషయం తెలిసిందే. బడ్జెట్‌ కసరత్తు మొదలవ్వగానే నార్త్‌బ్లాక్‌లోని ఆర్థిక మంత్రిత్వ శాఖ వద్దకు విలేకర్లను కూడా అనుమతించరు. ఆర్థికశాఖకు చెందిన కొందరు కీలక సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొంటారు. బడ్జెట్‌ సమర్పించడానికి పదిరోజుల ముందు ప్రతుల ముద్రణను ప్రారంభిస్తారు. ఇందులో పాల్గొనే సిబ్బంది దాదాపు 10 రోజుల పాటు అక్కడే ఉంటారు. ఈ ముద్రణ మొదలు కావడానికి ముందు భారతీయ వంటకమైన హల్వాను చేస్తారు. ఆర్థిక మంత్రి సమక్షంలో దీనిని సిబ్బందికి పంచుతారు. 

ఆర్థిక మంత్రి కూడా బడ్జెట్‌కు సంబంధించిన ఎటువంటి పత్రాలు ఉంచుకోరు. ఇవి మొత్తం జాయింట్‌ సెక్రటరీ ఆధీనంలో ఉంటాయి. 1950 వరకు బడ్జెట్‌ ప్రతులను రాష్ట్రపతి భవన్‌లో ముద్రించే వారు. కానీ అక్కడ అవి లీక్‌ కావడంతో దానిని మింట్‌ రోడ్‌లోని గవర్నమెంట్ ప్రెస్‌కు మార్చారు. ఆ తర్వాత 1980లో దీనిని నార్త్‌బ్లాక్‌లోని బేస్‌మెంట్‌కు మార్చారు. అప్పటి నుంచి ఇక్కడే కొనసాగుతోంది. బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే వరకు సిబ్బందికి ఇక్కడే వసతి సౌకర్యాలు కల్పిస్తారు. బంధువులకు కూడా ఫోన్‌ చేసుకొనే అవకాశం ఈ సిబ్బందికి ఉండదు. అత్యవసరమైతే భద్రతా సిబ్బంది సమక్షంలో ఫోన్‌ చేసుకోవచ్చు. బడ్జెట్‌ ప్రవేశపెట్టే రోజు ఆర్థిక మంత్రిత్వశాఖలోని కంప్యూటర్లలో ఈమెయిల్‌ సౌకర్యాన్ని బ్లాక్‌ చేస్తారు. బడ్జెట్‌కు కొన్ని రోజుల మందు పీఐబీ అధికారులను అక్కడికి అనుమతిస్తారు. వారు బడ్జెట్‌ తర్వాత చేయాల్సిన పత్రికా ప్రకటనలను పరిశీలిస్తారు. మరోవైపు  ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు అరుణ్‌జైట్లీ అమెరికా నుంచి వస్తారని ప్రభుత్వ వర్గాల సమాచారం.  జైట్లీ వైద్య పరీక్షల నిమిత్తం ఇటీవల అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు