బడ్జెట్‌ 2020 : ఆటో ఇండస్ట్రీ ఏం ఆశిస్తోంది?

13 Jan, 2020 09:21 IST|Sakshi

సాక్షి, ముంబై: రాబోయే యూనియన్ బడ్జెట్‌లో తమకు ప్రోత్సాహకాల కల్పించాలని ఆటోమొబైల్ పరిశ్రమ భావిస్తోంది. సుదీర్ఘ మందగమనం, 2019 లో రెండు దశాబ్దాలు కనిష్టానికి పడిపోయిన అమ్మకాలు నేపథ్యంలో ఆటో రంగ పునరుద్ధరణకు  కొన్ని ఆర్థిక చర్యలు తీసుకోవాలని  ప్రభుత్వాన్ని కోరిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా వాహనలపై జీఎస్‌టీ భారం తగ్గింపు,  లిథియం-అయాన్ బ్యాటరీల దిగుమతిపై సుంకం రద్దు చేయడం వంటి చర్యలను  పరిశ్రమ  ఆశిస్తోంది. 

దాదాపు ఏడాది కాలంగా తిరోగమనాన్ని ఎదుర్కొంటున్న ఆటో మొబైల్‌  పరిశ్రమ, పాత వాహనాల వాడకాన్ని నిరుత్సాహపరిచేందుకు ప్రోత్సాహక ఆధారిత స్క్రాపేజ్ విధానంతోపాటు వాహనాల రీ-రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచాలని భావిస్తోంది.  అలాగే బీఎస్‌-6 ఉద్గార నిబంధనల  అమలును పరిశ్రమ స్వాగతిస్తోంది.  ఈ చొరవ వాహన వ్యయంలో 8-10 శాతం పెరుగుదలకు దారితీస్తుందని, తద్వారా ప్రభుత్వానికి జీఎస్‌టీ  వసూళ్లు పెరుగుతాయని భావిస్తోంది. అయితే, ఈ అదనపు ఖర్చు డిమాండ్ తగ్గడానికి దారి తీస్తుందనీ,  ఈ క్రమంలో ఏప్రిల్ నుండి  బీఎస్‌ 6 వాహనాలపై  ప్రస్తుతం వసూలు చేస్తున్న 28 శాతం జీఎస్‌టీని 18 శాతానికి తగ్గించాలని కోరుతోంది.

కాగా  2019 లో వాహనాల అమ్మకాలు 20 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి. గత వారం  సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారులు (సియామ్) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, అన్ని వాహన విభాగాల్లో నూ 13.77 క్షీణతను నమోదు చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు