ఎంఎస్‌ఎంఈకి బడ్జెట్ జోష్

12 Jul, 2014 02:05 IST|Sakshi
ఎంఎస్‌ఎంఈకి బడ్జెట్ జోష్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:  భారతీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా(ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమల రంగానికి మంచి రోజులని చెప్పడానికి బడ్జెట్ ప్రతిపాదనలే నిదర్శనమని పారిశ్రామిక వర్గాలు అంటున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు రూ.10 వేల కోట్ల ఫండ్ కేటాయించడంతో ఎంఎస్‌ఎంఈ రంగం కొత్త పుంతలు తొక్కేందుకు పునాది పడిందని చెబుతున్నాయి. అదే స్థాయిలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నది నిపుణుల మాట. జీడీపీలో తయారీ రంగం వాటా ప్రస్తుతం 15-16 శాతంగా ఉంది. రానున్న రోజుల్లో ఇది 25 శాతానికి చేరవచ్చని నిపుణులు అంటున్నారు.

 మరింత మంది ముందుకు..
 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వేలాది మంది పారిశ్రామికవేత్తలు వ్యాపార, వాణిజ్య రంగంలో విజయవంతంగా రాణిస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో మరింత మంది వ్యాపారం చేసేందుకు ముందుకు వస్తారని అసోచాం దక్షిణ భారత చైర్మన్, శ్రీసిటీ ఎండీ రవి సన్నారెడ్డి అన్నారు. ప్రభుత్వ తోడ్పాటు ఒక్కటే సరిపోదని, చిన్న కంపెనీల వ్యాపారాభివృద్ధికి భారీ పరిశ్రమలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. భారీ పరిశ్రమల కంటే ఎంఎస్‌ఎంఈలే ఉద్యోగావకాశాలకు అధికంగా కల్పిస్తాయన్నారు. తయారీకి ఊతమిచ్చేలా బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయని ఎలికో ఎండీ రమేష్ దాట్ల తెలిపారు.

 మూడు రెట్ల వృద్ధి..
 దేశీయ పారిశ్రామిక ఉత్పత్తిలో ఎంఎస్‌ఎంఈ వాటా ప్రస్తుతం 45 శాతంపైగా ఉంది. ఎగుమతుల్లో ఈ రంగం వాటా 40 శాతంపై మాటే. ఈ రంగంలో 3 కోట్లకుపైగా కంపెనీలున్నాయి. 6-7 కోట్ల మంది పనిచేస్తున్నారు. ఏటా కొత్తగా 13 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందీ రంగం. బడ్జెట్ ప్రతిపాదనలు కార్యరూపంలోకి వస్తే మూడేళ్లలో ఎంఎస్‌ఎంఈల వ్యాపారం రెండు మూడు రెట్లు పెరగడం ఖాయమని విశ్లేషకులు, స్కార్లెట్ ఇండస్ట్రీస్ ఎండీ మండవ శ్రీరామ్ మూర్తి తెలిపారు. దేశవ్యాప్తంగా కొత్త కంపెనీలు వెల్లువలా ఏర్పాటవుతాయని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చే ప్రోత్సాహకాలు ఏమిటో కేంద్రం నుంచి స్పష్టత వస్తే.. ఈ రెండు రాష్ట్రాల్లో కొత్త ప్లాంట్లు ఏర్పాటై పారిశ్రామిక అభివృద్ధి దూసుకెళ్తుందని చెప్పారు.

 వెల్లువలా ప్రైవేటు ఈక్విటీలు..
 చక్కని వ్యాపార ప్రణాళికలున్నా నిధులు లేక కార్యరూపంలోకి రాని ప్రతిపాదనలు ఎన్నో ఉన్నాయి. స్టార్టప్‌ల ఏర్పాటుకు రూ.10 వేల కోట్లు కేటాయించడం పెద్ద సంచలనమేనని, రానున్నది స్టార్టప్ ఇండియా అని ఎస్‌ఈసీ ఇండస్ట్రీస్ ఎండీ డి.విద్యాసాగర్ అన్నారు. ప్రభుత్వం తీసుకున్న చొరవ కారణంగా స్టార్టప్‌లకు అదనపు నిధులు సమకూర్చేందుకు ప్రైవేటు ఈక్విటీ సంస్థలు ముందుకు వస్తాయని పేర్కొన్నారు. రక్షణ రంగంలో ఎఫ్‌డీఐల పరిమితిని 26 నుంచి 49కి చేర్చారు. దీంతో రక్షణ రంగ పరికరాల తయారీ దేశీయంగా అధికమవుతుందని అన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇక్కడి కంపెనీలకు బదిలీ అవుతుందని, చిన్న కంపెనీలకు సబ్ కాంట్రాక్టులు ఎక్కువ అవుతాయని వివరించారు.

మరిన్ని వార్తలు