Global maritime india summit 2023: సముద్ర వాణిజ్య ఆర్బిట్రేషన్‌ కేంద్రంగా భారత్‌!

20 Oct, 2023 04:37 IST|Sakshi

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఆకాంక్ష

ఇందుకు తగిన సామర్థ్యాల సాధన అవసరం

న్యాయ వ్యవస్థలూ బలపడాలి

గ్లోబల్‌ మారిటైమ్‌ ఇండియా సదస్సులో ప్రసంగం  

ముంబై: సముద్ర వాణిజ్య అంశాలు, వివాదాల పరిష్కారానికి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రం భారత్‌లో ఏర్పడాలన్న ఆకాంక్షను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యక్తం చేశారు. ఇందుకు తగిన సామర్థ్యాలు, న్యాయ వ్యవస్థలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆమె ఉద్ఘాటించారు. దేశ నౌకానిర్మాణ సామర్థ్యాన్ని పెంచడానికి ఫైనాన్సింగ్, బీమా, మధ్యవర్తిత్వం, మరిన్ని విభిన్న సౌలభ్యాల సృష్టి అవసరమని కూడా  అన్నారు.

ముంబైలో జరిగిన గ్లోబల్‌ మారిటైమ్‌ ఇండియా సమ్మిట్, 2023  ముగింపు సమావేశాన్ని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. సరఫరాలు,  సరఫరాల భద్రతలో అంతరాయాలు, సరఫరాల చైన్‌ విచి్ఛన్నం వంటి పలు సవాళ్లు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సమయంలో జరిగిన ఈ సదస్సుకు కీలక ప్రాధాన్యత సంతరించుకుంది. సదస్సు సందర్భంగా ‘మారిటైమ్‌ ఫైనాన్సింగ్, ఇన్సూరెన్స్‌ అండ్‌ ఆర్బిట్రేషన్‌’ అన్న అంశంపై నిర్మలా సీతారామన్‌ చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు... సెషన్‌లో ప్రసంగించారు.

► లండన్‌ లేదా సింగపూర్‌ లేదా దుబాయ్‌లోని అంతర్జాతీయ మధ్యవర్తిత్వ (ఆర్బ్రిట్రేషన్‌) కేంద్రాలలో చాలా మంది భారతీయులు పనిచేస్తున్నప్పటికీ, వారంతా అక్కడి సీనియర్‌ న్యాయవాదులకు సహాయం చేస్తున్నారు తప్ప, ఒక కేసును స్వయంగా చేపట్టి, పరిష్కరించడంలేదు. ఈ ధోరణి మారాలి.  
► మన మధ్యవర్తిత్వ ప్రక్రియలు, చట్టాలను మెరుగుపరచడం, బలోపేతం చేయడం అవసరం. తద్వారా అవి ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి. మనం ఈ దిశలో ఒక వ్యవస్థను అభివృద్ధి చేసినప్పుడు, మధ్యవర్తిత్వ కేంద్రాన్ని కూడా కలిగి ఉండవచ్చు.  
► భారత్‌ మధ్యవర్తిత్వంలో తన బలాన్ని మెరుగుపరచుకుంటోంది. అయితే అంతర్జాతీయ ఆంక్షలు– ఒత్తిళ్లను  తగ్గించుకునే దిశలో దేశం పూర్తి స్థాయి భారత్‌–ఆధారిత రక్షణ, నష్టపరిహార (పీఅండ్‌ఐ) సంస్థను కలిగి ఉండవలసిన అవసరం ఏర్పడింది. ఇది షిప్పింగ్‌ కార్యకలాపాల లో మరింత వ్యూహాత్మక సౌలభ్యాన్ని అందిస్తుంది. తీరప్రాంత, లోతట్టు జలాల్లో పనిచేసే నౌక లకు తగిన రక్షణాత్మక చర్యలను  అందిస్తుంది.  
► ప్రధాన వస్తువుల ఎగుమతులు కొన్నిసార్లు అవాంతరాలకు గురవుతాయి. ఫలితంగా ఆహార అభద్రత శక్తి అభద్రత వంటి అంశాలు తీవ్రతరమవుతాయని. దీనితో ద్రవ్యోల్బణం సమస్యా తలెత్తవచ్చు. కోవిడ్‌ సవాళ్ల నుండి బయటకు వస్తున్న దేశాల ఆర్థిక వ్యవస్థలు ప్రస్తుతం ఈ సవాలును ఎదుర్కొంటున్నాయి. ఈ సవాళ్లను ప్రపంచవ్యాప్త పరస్పర సహకారంతో పరిష్కరించాల్సిన అవసరం ఉంది.  
► సముద్ర రంగానికి ఫైనాన్సింగ్‌ను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. బలమైన బ్యాలెన్స్‌ షీట్‌ ఉన్నప్పటికీ, బ్యాంకులు ఈ రంగానికి నిధులు సమకూర్చడంలో పెద్దగా ఉత్సాహం చూపడం లేదు.  ఈ రంగానికి సంబంధించిన అధిక నష్టాల అవకాశం దీనికి ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో సముద్రరంగం పట్ల మరింత సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండటానికి ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులతో కేంద్రం చర్చలు జరుపుతోంది.  
► భారత్‌– మిడిల్‌ ఈస్ట్‌–యూరోప్‌ ఎకనామిక్‌ కారిడార్‌ ఇప్పుడు కీలకం. మేము యూరప్, మధ్య ఆసియాలను సముద్రం అలాగే భూ మా ర్గం ద్వారా చేరుకోవాలని చూస్తున్నాము.  తద్వా రా లాజిస్టిక్స్‌ ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రణాళికలను రూపొందించడం జరుగుతోంది.  
► కోవిడ్‌–19 తర్వాత సముద్ర వాణిజ్యానికి మద్దతుగా ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఐఆర్‌డీఏఐ), దేశీయ బీమా కంపెనీల మద్దతుతో ‘‘మెరైన్‌ కార్గో పూల్‌’’ ఆవిష్కరణ జరిగింది.  
► 12 ప్రభుత్వ ఓడరేవుల్లో తొమ్మిదింటిలో 35 ప్రాజెక్టులను మానిటైజేషన్‌ కోసం గుర్తించడం జరిగింది. అన్నీ సవ్యంగా జరిగితే నేషనల్‌ అసెట్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌లో భాగంగా రూ. 14,483 కోట్ల విలువైన ప్రాజెక్టులను మోనటైజ్‌ చేయవచ్చు. ప్రభుత్వ ఆస్తులను దీర్ఘకాలంపాటు లీజుకు ఇవ్వడం తద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందడం నేషనల్‌ అసెట్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ ప్రధాన ఉద్దేశం.  

గ్లోబల్‌ మారిటైమ్‌ ఇండియా సమ్మిట్, 2023 సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు
జ్ఞాపికను బహూకరిస్తున్న ఓడరేవులు, షిప్పింగ్,జలమార్గాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి టి.కె. రామచంద్రన్‌

మరిన్ని వార్తలు