బైజూస్‌లో భారీగా పెట్టుబడులు

13 Dec, 2018 01:13 IST|Sakshi

తాజా రౌండ్‌లో 40 కోట్ల డాలర్లు 

నాలుగో అత్యంత విలువైన స్టార్టప్‌ ఇదే  

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ స్టార్టప్‌ బైజూస్‌... మరో విడత భారీగా పెట్టుబడులను సమీకరించింది. బైజూస్‌లో దక్షిణాఫ్రికా మీడియా దిగ్గజం, నాస్పర్స్‌ భారీగా పెట్టుబడులు పెట్టినట్లు తెలియవచ్చింది. నాస్పర్స్‌ సంస్థ రూ.2,879 కోట్లు (40 కోట్ల డాలర్లు) పెట్టుబడులు పెట్టిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దీన్లో 30 కోట్ల డాలర్ల పెట్టుబడులు బైజూస్‌కు ఇప్పటికే అందాయని, మిగిలిన 10 కోట్ల డాలర్లు కూడా త్వరలోనే అందుతాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. తాజా పెట్టుబడుల రౌండ్‌లో భాగం గా ప్రైవేట్‌ ఈక్విటీ దిగ్గజం, జనరల్‌ అట్లాంటిక్,  కెనడాకు చెందిన సీపీపీ ఇన్వెస్ట్‌మెంట్‌ బోర్డ్‌లు కూడా బైజూస్‌కు నిధులందించాయని సమాచారం. అయితే ఈ పెట్టుబడులకు సంబంధించిన వార్తలపై వ్యాఖ్యానించడానికి బైజూస్‌ ప్రతినిధి నిరాకరించారు.  తాజా నిధులతో బైజూస్‌ సంస్థ విదేశాల్లో విస్తరించే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

నాలుగో అత్యంత విలువైన స్టార్టప్‌..: ఈ తాజా పెట్టుబడుల పరంగా చూస్తే, బైజూస్‌ స్టార్టప్‌ విలువ రూ.25,800 కోట్లుగా (360 కోట్ల డాలర్లు) ఉంటుందని అంచనా. అంటే దాదాపు 3.6 బిలియన్‌ డాలర్లు. ఈ విలువతో భారత్‌లో అత్యధిక విలువైన నాలుగో స్టార్టప్‌గా ఇది నిలిచింది. తొలి మూడు స్థానాల్లో డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేటీఎమ్, ట్యాక్సీ అగ్రిగేటర్‌ ఓలా, బడ్జెట్‌ హోటల్‌ చెయిన్‌ ఓయో ఉన్నాయి. కేరళకు చెందిన రవీంద్రన్‌ ఆరంభించిన బైజూస్‌ స్టార్టప్‌కు చాన్‌ జుకర్‌బర్గ్‌ ఇనీషియేటివ్‌ (సీజడ్‌ఐ), ప్రపంచ బ్యాంక్‌ సభ్య సంస్థ ఐఎఫ్‌సీ, టెన్సెంట్‌ హోల్డింగ్స్‌ వంటి అంతర్జాతీయ దిగ్గజ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలు దన్నుగా ఉన్నాయి.
 
రూ. 100 కోట్లు దాటిన నెలవారీ ఆదాయం 
ఈ ఏడాది జూన్‌లో తమ నెలవారీ ఆదాయం రూ.100 కోట్లు దాటిందని బైజూస్‌ ప్రకటించింది. దీంతో తమ వార్షిక ఆదాయ లక్ష్యాన్ని రూ.1,400 కోట్లకు పెంచామని తెలియజేసింది. 2015లో ఈ లెర్నింగ్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చామని, అప్పటి నుంచి మూడేళ్లుగా వంద శాతం వృద్ధిని కొనసాగిస్తున్నామని తెలిపింది. కార్యకలాపాలు మొదలు పెట్టిన మొదటి ఏడాదిలోనే లాభాలు ఆర్జించడం ఆరంభించామని, తమకిపుడు 2 కోట్ల మంది నమోదిత విద్యార్ధులు, 12.6 లక్షల మంది వార్షిక చందాదారులు ఉన్నారని సంస్థ వివరించింది. 

మరిన్ని వార్తలు