ఆర్‌పీ ఇన్ఫో సిస్టమ్స్‌ డైరెక్టర్‌ను ప్రశ్నించిన సీబీఐ

6 Mar, 2018 00:14 IST|Sakshi

న్యూఢిల్లీ: బ్యాంకుల కన్సార్షియంను దాదాపు రూ. 515 కోట్ల మేర మోసగించారన్న కేసుకు సంబంధించి కంప్యూటర్స్‌ తయారీ సంస్థ ఆర్‌పీ ఇన్ఫో సిస్టమ్స్‌ డైరెక్టర్‌ శివాజీ పంజాను సీబీఐ ప్రశ్నించింది. ఈ స్కామ్‌ విషయంలో కంపెనీకి చెందిన ఇతర అధికారులపై కూడా కేసులు నమోదు చేసిన సీబీఐ, ఆర్‌పీ ఇన్ఫోసిస్టమ్స్‌ కార్యాలయంతో పాటు నిందితుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించింది. గతంలో కూడా కంపెనీపై ఈ తరహా ఆరోపణలు వచ్చాయి. 2015లో ఐడీబీఐ బ్యాంకును రూ. 180 కోట్లు మోసగించిన ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసింది.

చిరాగ్‌ బ్రాండ్‌ కింద కంప్యూటర్స్‌ తయారు చేసే ఆర్‌పీ ఇన్ఫోసిస్టమ్స్‌.. నకిలీ పత్రాలు సృష్టించి 2012 నుంచి ఎస్‌బీఐ, అలహాబాద్‌ బ్యాంక్‌ తదితర బ్యాంకుల కన్సార్షియం నుంచి రుణాలు పొందిందన్న ఆరోపణలతో తాజా కేసు నమోదైంది. ఈ రుణాలన్నీ మొండిబాకీలుగా మారినట్లు అధికారవర్గాలు తెలిపాయి. మరోవైపు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ)లో రూ. 12,700 కోట్ల స్కాముపై విచారణ చేస్తున్న సీబీఐ తాజాగా బ్యాంకు ఉద్యోగి ఎస్‌కే చాంద్‌ను ప్రశ్నిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆయన ట్రెజరీ విభాగం జనరల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.   

మరిన్ని వార్తలు