కార్ల కంపెనీలపై కొరడా..

26 Aug, 2014 00:37 IST|Sakshi
కార్ల కంపెనీలపై కొరడా..

న్యూఢిల్లీ: దేశీ ఆటో రంగానికి తొలిసారి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) షాకిచ్చింది. దేశీయంగా కార్లను తయారు చేసే 14 కంపెనీలపై రూ. 2,545 కోట్ల జరిమానా విధించింది. వీటిలో టాటా మోటార్స్,  మారుతీ సుజుకీ వంటి దిగ్గజ సంస్థలు సైతం ఉండటం గమనార్హం. విడిభాగాలు, విక్రయానంతర సేవలకు సంబంధించి వ్యాపార నిబంధనలను ఉల్లంఘించినందున జరిమానా విధిస్తున్నట్లు సీసీఐ పేర్కొంది.

 ఇదీ జాబితా...
 జరిమానాకు గురైన జాబితాలో దేశ, విదేశీ కార్ల కంపెనీలు చోటుచేసుకున్నాయి. అత్యధికంగా టాటా మోటార్స్‌పై రూ. 1,346.46 కోట్ల జరిమానా విధించగా, మారుతీపై రూ. 471.14 కోట్ల భారం పడనుంది. ఈ జాబితాలో ఎంఅండ్‌ఎం(రూ.292.25 కోట్లు), టయోటా కిర్లోస్కర్(రూ.93.38 కోట్లు),  జనరల్ మోటార్స్(రూ. 84.58 కోట్లు), హోండా సియల్(రూ. 78.47 కోట్లు), స్కోడా ఆటో(రూ.46.39 కోట్లు), ఫోర్డ్ ఇండియా (రూ.39.78 కోట్లు), ఫియట్ ఇండియా(రూ. 29.98 కోట్లు), బీఎండబ్ల్యూ(రూ.20.41 కోట్లు), మెర్సిడెస్ బెంజ్(రూ. 23.08 కోట్లు), హిందుస్తాన్ మోటార్స్(రూ. 13.85 కోట్లు), ఫోక్స్‌వ్యాగన్(రూ. 3.25 కోట్లు), నిస్సాన్ మోటార్స్(రూ. 1.63 కోట్లు) ఉన్నాయి. దేశీయంగా కార్లు తయారు చేసే 14 కంపెనీలపై మొత్తం రూ. 2,544.64 కోట్ల జరిమానా విధిస్తూ 215 పేజీలతో కూడిన ఆదేశాలను సీసీఐ జారీ చేసింది.

 రెండు నెలల్లోగా డిపాజిట్ చేయాలి: విడిగా ఒక్కో సంస్థపైనా విధించిన జరిమానాకు సంబంధించి సీసీఐ వివరణ ఇచ్చింది. దీనిలో భాగంగా కంపెనీల సగటు టర్నోవర్‌పై 2% మొత్తాన్ని జరిమానాగా ప్రకటించింది. ఈ మొత్తాలను 60 రోజుల్లోగా డిపాజిట్ చేయాలని ఆదేశించింది. కాగా, ఈ ఆదేశాలపై వ్యాఖ్యానించేందుకు నిస్సాన్ మోటార్ ఇండియా ప్రతినిధి నిరాకరించగా, మిగిలిన 13 కంపెనీల ప్రతినిధులు సైతం అందుబాటులోకి రాకపోవడం గమనార్హం.

 సీసీఐ ఏం చెప్పిందంటే...
 పూర్తిస్థాయిలో చేపట్టిన దర్యాప్తులో భాగంగా పోటీతత్వ నిబంధనలను ఈ 14 కంపెనీలు ఉల్లంఘించాయని సీసీఐ తేల్చిచెప్పింది. ప్రాంతీయ ఒరిజినల్ విడిభాగాల సరఫరాదారుల(ఓఈఎస్‌ఎస్)తోపాటు, అధీకృత డీలర్లుతో ఒప్పందాలను కుదుర్చుకోవడం ద్వారా నిబంధనలు ఉల్లంఘించాయని తెలిపింది. ఈ ఒప్పందాల ద్వారా విడిభాగాల సరఫరాదారులను పూర్తిగా నియంత్రించడం, విక్రయానంతరం విడిభాగాలు సరఫరా చేసే అవకాశాలను మూసివేయడం వంటివి చేసినట్లు సీసీఐ వివరించింది.

పలు కార్ల కంపెనీలు బహిరంగ మార్కెట్లోకి (నాన్-ఆథరైజ్డ్ అవుట్‌లెట్స్) విడిభాగాలు సరఫరా చేయకపోవడంతో వాహన యజమానులు సంబంధిత కార్ల కంపెనీ వర్క్‌షాప్ లేదా షోరూమ్‌కు వెళ్లి కొనాల్సివస్తోంది. సహజంగానే అక్కడ ధరలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా సులభంగా దొరకవు కూడా.  నాన్ ఆథరైజ్డ్ అవుట్‌లెట్స్‌లో విడిభాగాలను విక్రయిస్తే తమ ఆదాయం దెబ్బతింటుందంటూ కార్ల కంపెనీల డీలర్లు వ్యక్తంచేసే ఆందోళన కారణంగా కూడా ఇవి బహిరంగ మార్కెట్లోకి సరఫరా కావడం లేదు.

సీసీఐ కార్ల కంపెనీలపై కొరడా ఝుళిపించవచ్చన్న అంచనాల నేపథ్యంలో ఇటీవలే ఫోర్డ్ ఇండియా తన కార్ల విడిభాగాలను బహిరంగ మార్కెట్లో విక్రయించాలని నిర్ణయించింది. పైగా ఇందువల్ల తమ కస్టమర్లకు కారు నిర్వహణా వ్యయం తగ్గుతుందని ఆ కంపెనీ ఇంతక్రితం ప్రకటించింది.

మరిన్ని వార్తలు