హైటెక్‌ వ్యవ‘సాయం’!

9 Jul, 2020 04:08 IST|Sakshi

రూ. లక్ష కోట్లతో అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్‌ ఏర్పాటు

మౌలిక సదుపాయాలు, స్టార్టప్‌లకు ప్రోత్సాహం

3 శాతం వడ్డీ రాయితీ

కేంద్ర కేబినెట్‌ నిర్ణయం

న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో ఆవిష్కరణలకు, టెక్నాలజీని ప్రవేశపెట్టేవారికి, స్టార్టప్‌లకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ముందుకు వచ్చే వారికి ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర సర్కారు రూ.లక్ష కోట్లతో అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. మౌలిక సదుపాయాలు, రవాణా వసతుల కోసం ఏర్పాటయ్యే రైతు గ్రూపులకు కూడా ఈ నిధి కింద రుణ సాయం అందుతుంది.

కరోనా వైరస్‌ తర్వాత కేంద్రం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీకి తాజాగా ప్రకటించిన రూ.లక్ష కోట్ల నిధి అదనం. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివరాలను కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్‌ థోమర్‌ మీడియాకు తెలిపారు. చరిత్రాత్మకమైన ఈ నిర్ణయం వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు. అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్‌ పదేళ్ల పాటు 2029 వరకు అమల్లో ఉంటుంది.

సాగు అనంతరం పంట ఉత్పత్తుల విక్రయం వరకు వసతుల నిర్వహణ (శీతల గోదాములు, గోదాములు, గ్రేడింగ్, ప్యాకేజింగ్‌ యూనిట్లు, ఈ మార్కెటింగ్, ఈ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు తదితర), సామాజిక సాగు తదితరాలకు దీర్ఘకాల రుణ సాయం పొందొచ్చు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా ఈ రుణాలను మంజూరు చేస్తారు. రూ.లక్ష కోట్ల నిధి ఏర్పాటులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2020–21) కేంద్రం రూ.10,000 కోట్లను సమకూరుస్తుంది. తదుపరి మూడు ఆర్థిక సంవత్సరాల్లో రూ.30,000 కోట్ల చొప్పున ఏర్పాటు చేస్తుంది. గరిష్టంగా రూ.2 కోట్ల రుణానికి 3 శాతం వడ్డీ రాయితీని ఇవ్వనున్నట్టు మంత్రి తోమర్‌ చెప్పారు.  

ఈపీఎఫ్‌ చెల్లింపుల పథకం ఆగస్టు వరకు
చిన్న సంస్థల తరఫున ఈపీఎఫ్‌ చెల్లింపుల పథకాన్ని ఆగస్టు వరకు కొనసాగిస్తూ కేంద్ర కేబినెట్‌ మరో నిర్ణయం తీసుకుంది. 100 వరకు ఉద్యోగులు కలిగిన సంస్థల్లో 90 శాతం మంది రూ.15,000లోపు వేతనం కలిగి ఉంటే.. ఉద్యోగుల చందాతోపాటు, వారి తరఫున ఆయా సంస్థల చందా (చెరో 12 శాతం)ను కేంద్రమే చెల్లించనుంది. లాక్‌డౌన్‌ కారణంగా చిన్న, మధ్య స్థాయి సంస్థలు చాలా వరకు మూతపడడంతో.. వాటికి వెసులుబాటునిస్తూ ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ పథకం కింద ఈ భారాన్ని తాను భరించనున్నట్టు కేంద్రం లోగడ ప్రకటించింది. తొలుత మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన చందాలను చెల్లించాలని నిర్ణయించింది. జూన్, జూలై, ఆగస్టు నెలలకూ ఈపీఎఫ్‌ చందాలను తానే చెల్లించాలని కేబినెట్‌ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులు మరింత వేతనాన్ని ఇంటికి తీసుకెళ్లొచ్చని, సంస్థలపైనా భారం తగ్గుతుందని కేంద్ర మంత్రి జవదేకర్‌ పేర్కొన్నారు.

మూడు బీమా సంస్థలకు రూ.12,450 కోట్లు
ప్రభుత్వరంగంలోని మూడు సాధారణ బీమా సంస్థ లు.. నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, యునైటెడ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలకు రూ.12,450 కోట్ల మూలధనసాయాన్ని అందించాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఇందులో 2019–20లో అందించిన రూ.2,500 కోట్లు కలసి ఉంటుందని మంత్రి జవదేకర్‌ తెలిపారు. ఈ మూడు కంపెనీలను విలీనం చేసి, స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ చేయాలన్నది కేంద్రం ప్రణాళికగా ఉంది.

>
మరిన్ని వార్తలు