అదానీ గ్రూప్‌ చేతికి సంఘీ ఇండస్ట్రీస్‌ 

6 Dec, 2023 01:34 IST|Sakshi

సవరించిన ధరతో కొనుగోలు ప్రక్రియ పూర్తి 

న్యూఢిల్లీ: సంఘీ ఇండస్ట్రీస్‌ (ఎస్‌ఐఎల్‌) కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్లు అదానీ గ్రూప్‌లో భాగమైన అంబుజా సిమెంట్స్‌ (ఏసీఎల్‌) వెల్లడించింది. షేరు ఒక్కింటికి రూ. 121.90 చొప్పున సవరించిన ధర మేరకు కొనుగోలు చేసినట్లు వివరించింది. గతంలో ఎస్‌ఐఎల్‌లో పబ్లిక్‌ షేర్‌హోల్డర్లకు ఉన్న 26 శాతం వాటాల కోసం కంపెనీ రూ. 114.22 రేటును ఆఫర్‌ చేసింది. ఎస్‌ఐఎల్‌ విలువను రూ. 5,185 కోట్లుగా లెక్కగట్టి దక్కించుకున్నట్లు ఏసీఎల్‌ తెలిపింది. 

సంఘీ ఇండస్ట్రీస్‌లో తమకు నియంత్రణాధికారాలతో 54.51 శాతం వాటాలు లభించినట్లు వివరించింది. దేశీ సిమెంటు పరిశ్రమలో తమ స్థానాన్ని పటిష్టపర్చుకునేందుకు ఈ డీల్‌ ఉపయోగపడుతుందని అదానీ గ్రూప్‌ సిమెంట్‌ వ్యాపార విభాగం సీఈవో అజయ్‌ కపూర్‌ తెలిపారు.  

74.6 ఎంటీపీఏకి ఉత్పత్తి సామర్థ్యాలు 
ఎస్‌ఐఎల్‌కు గుజరాత్‌లోని సంఘీపురంలో 2,700 హెక్టార్లలో క్లింకర్, సిమెంటు సమగ్ర తయారీ యూనిట్‌ ఉంది. ఇందులో 6.6 ఎంటీపీఏ క్లింకర్‌ ఉత్పత్తికి రెండు బట్టీలు, 6.1 ఎంటీపీఏ సిమెంటు గ్రైండింగ్‌ యూనిట్, 13 మెగావాట్ల క్యాప్టివ్‌ విద్యుదుత్పత్తి ప్లాంటు మొదలైనవి ఇందులో ఉన్నాయి. ఈ కొనుగోలుతో ఏసీఎల్‌ ఉత్పత్తి సామర్థ్యం వార్షికంగా 68.5 మిలియన్‌ టన్నులు (ఎంటీపీఏ) నుంచి 74.6 ఎంటీపీఏకి చేరుతుందని పేర్కొంది. కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్‌ తదితర పశ్చిమ తీర ప్రాంత మార్కెట్లలో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించనున్నట్లు కంపెనీ తెలిపింది. వచ్చే 30 నెలల్లో ఉత్పత్తి సామర్థ్యాలను అదనంగా పెంచుకోనున్నట్లు వివరించింది. 

>
మరిన్ని వార్తలు