తక్కువ వడ్డీ రేట్లు ముఖ్యమే, కానీ..

20 May, 2015 01:16 IST|Sakshi
తక్కువ వడ్డీ రేట్లు ముఖ్యమే, కానీ..

డిమాండే అత్యంత కీలకం: రాజన్
న్యూయార్క్: ద్రవ్యపరపతి విధానాలను సడలించాలంటూ ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులపై ఒత్తిళ్లు పెరుగుతుండటంపై రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు.  పెట్టుబడులు ఆకర్షించేందుకు తక్కువ స్థాయి వడ్డీ రేట్లు, పన్నులపరమైన ప్రోత్సాహకాలు ముఖ్యమే అయినప్పటికీ.. ఆర్థిక వృద్ధి సాధించాలంటే వినియోగపరమైన డిమాండ్ అత్యంత కీలకమని ఆయన చెప్పారు.

న్యూయార్క్‌లోని ఎకనామిక్ క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రాజన్ ఈ విషయాలు తెలిపారు. అంతర్జాతీయంగా ద్రవ్య విధానంలో ప్రస్తుతం ఒక పద్ధతంటూ లేకపోవడం వల్ల ఇటు నిలకడైన వృద్ధికి అవకాశం లేకుండా పోయిందని, అటు ఆర్థిక రంగానికి గణనీయమైన ముప్పు ఉందని ఆయన చెప్పారు. సాధారణంగా తక్కువ వడ్డీ రేట్లు, పన్నులపరమైన ప్రయోజనాలిచ్చే పెట్టుబడులు, ఉపాధి కల్పనను ప్రోత్సహించడం జరుగుతుందని ఆయన చెప్పారు.

అయితే, రుణాల భారం వల్ల సుదీర్ఘకాలం పాటు వినియోగదారుల నుంచి డిమాండ్ బలహీనంగా ఉన్నప్పుడు .. కొత్త పెట్టుబడులపై రాబడులు అంతగా ఉండబోవని రాజన్ తెలిపారు. పాలసీ రేట్లను సున్నా స్థాయి కన్నా కూడా తక్కువకి తగ్గించడం సాధ్యం కాదని, చాలా మటుకు యూరోపియన్ దేశాలు ఈ విషయంలో పరిమితికి మించి చర్యలు తీసుకుంటున్నాయని ఆయన చెప్పారు.

>
మరిన్ని వార్తలు