చందా కొచర్‌ షాకింగ్‌ నిర్ణయం

4 Oct, 2018 14:56 IST|Sakshi
చందా కొచర్‌ ఫైల్‌ ఫోటో

ముంబై : ఐసీఐసీఐ బ్యాంక్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈవో, ఎండీ పదవికి చందా కొచర్‌ హఠాత్తుగా రాజీనామా చేశారు. వీడియోకాన్‌ రుణ వివాద కేసులో స్వతంత్ర విచారణ జరుగుతున్న నేపథ్యంలో అకస్మాత్తుగా ఆమె తన రాజీనామా లేఖను బ్యాంక్‌ మేనేజ్‌మెంట్‌కు పంపించారు. ఆమె అభ్యర్థనను బ్యాంక్‌ సైతం అంగీకరించింది. వీడియోకాన్‌ రుణాల కేసుల్లో చందా కొచర్‌పై తీవ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఐసీఐసీఐ నుంచి రూ.3250 కోట్ల భారీ రుణాన్ని పొందిన వీడియోకాన్ గ్రూప్ ఛైర్మన్ వేణుగోపాల్ ధూత్‌.. చందాకొచర్ భర్త దీపక్‌ కొచర్‌కు చెందిన న్యూపవర్‌ రెన్యువబుల్స్‌ కంపెనీకి అనుచిత లబ్థి చేకూరేలా వ్యవహరించినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తన కంపెనీకి భారీ ఎత్తున రుణాన్ని మంజూరు చేసిన దానికి ప్రతిగా.. చందాకొచర్ భర్త కంపెనీలో రూ.64 కోట్ల మొత్తాన్ని ధూత్‌ పెట్టుబడిగా పెట్టినట్టు తెలుస్తోంది. దీన్ని క్విడ్‌ ప్రోగా సెబీ సైతం అభివర్ణిస్తోంది.

ఈ ఉదంతంపై బోర్డు సైతం స్వతంత్ర విచారణకు ఆదేశించింది. ఈ విచారణ జరిగేంత వరకు ఆమెకు సెలవులు కూడా మంజూరు చేసింది. మరోవైపు ఆమె రాజీనామా చేయాలంటూ డిమాండ్లు కూడా వెల్లువెత్తాయి. దీంతో అకస్మాత్తుగా చందా కొచరే ఈ షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నారు. చందా కొచర్‌ స్థానంలో సందీప్‌ భక్షిని సీఈవో, ఎండీగా ఐసీఐసీఐ బ్యాంక్‌ నియమించింది. ఆయన ఐదేళ్ల పాటు అంటే 2023 అక్టోబర్‌ 3 వరకు ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈవో, ఎండీ కొనసాగనున్నట్టు పేర్కొంది. అయితే కొచర్‌పై జరుగుతున్న ఈ విచారణకు ఈ రాజీనామా ప్రభావం చూపదని బ్యాంక్‌ పేర్కొంది. 1984లో కొచర్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌లో చేరారు. మేనేజ్‌మెంట్‌ ట్రైనీగా చేరిన కొచర్‌, సీఈవో స్థాయికి ఎదిగారు. ఐసీఐసీఐ బ్యాంక్‌ అంటే అందరికి తొలుత గుర్తొచేది చందా కొచర్‌ పేరే. ప్రైవేట్‌ రంగంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ను ఆమె అగ్రస్థానంలో నిలబెట్టారు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో బీఎస్‌ఈలో బ్యాంక్‌ స్టాక్‌ 5.23 శాతం పెరగడం విశేషం. 

మరిన్ని వార్తలు