ఐసీఐసీఐ బ్యాంక్‌ లాభం జూమ్‌

23 Oct, 2023 05:00 IST|Sakshi

క్యూ2లో రూ. 10,896 కోట్లు

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరం (2023–24) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. జూలై–సెపె్టంబర్‌ (క్యూ2)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 36% జంప్‌చేసి రూ. 10,896 కోట్లను తాకింది. ప్రొవిజన్లు తగ్గడం, వడ్డీ ఆదాయం పుంజుకోవడం ఇందుకు దోహదపడింది.

స్టాండెలోన్‌ లాభం సైతం రూ.7,558 కోట్ల నుంచి రూ. 10,261 కోట్లకు ఎగసింది. మొత్తం ఆదాయం రూ. 31,088 కోట్ల నుంచి రూ. 40,697 కోట్లకు దూసుకెళ్లింది. నికర వడ్డీ ఆదాయం 24 శాతం వృద్ధితో రూ. 18,308 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 4.31 శాతం నుంచి 4.53 శాతానికి బలపడ్డాయి. ట్రెజరీ మినహా వడ్డీయేతర ఆదాయం 14 శాతం అధికమై రూ. 5,861 కోట్లయ్యింది.

ఎన్‌పీఏలు డౌన్‌...
తాజా సమీక్షా కాలంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 3.19 శాతం నుంచి రూ. 2.48 శాతానికి తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్‌) 16.07 శాతంగా నమోదైంది.

మరిన్ని వార్తలు