ఇన్ఫోసిస్‌కు మరో ఉన్నతాధికారి గుడ్‌బై

21 Mar, 2014 00:34 IST|Sakshi
ఇన్ఫోసిస్‌కు మరో ఉన్నతాధికారి గుడ్‌బై

బెంగళూరు: ఇన్ఫోసిస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు చంద్రశేఖర్ కాకాల్ తన పదవికి రాజీనామా సమర్పించారు. ఏప్రిల్ 18 నుంచి రాజీనామా అమల్లోకి రానుంది. ఇన్ఫోసిస్ సారథ్య బాధ్యతలను నారాయణమూర్తి తిరిగి చేపట్టిన నాటినుంచి వైదొలగిన ఉన్నతాధికారుల్లో కాకాల్ తొమ్మిదో వారు. కాకాల్ బుధవారం రాజీనామా సమర్పించగా, ఈ విషయాన్ని కంపెనీ గురువారం వెల్లడించింది.


 ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్లుగా బి.జి.శ్రీనివాస్, ప్రవీణ్ రావులకు పదోన్నతి ఇచ్చిన సందర్భంలో కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవికి కాకాల్ పోటీపడే అవకాశముందనే వాదనలు విన్పించాయి. 1999లో ఇన్ఫోసిస్‌లో చేరిన కాకాల్... అప్లికేషన్, టెస్టింగ్, ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్ సర్వీసెస్, కన్సల్టింగ్, మార్కెటింగ్ వంటి వివిధ విభాగాల్లో సేవలందించారు. కంపెనీ డెలివరీ కేపబిలిటీస్‌లో దాదాపు 95 శాతాన్ని ప్రవీణ్ రావుకు అప్పగించడంతో తనను చిన్నచూపు చూశారని కాకాల్ భావించి, రాజీనామా చేసి ఉండవచ్చని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. ఆయన సొంత కంపెనీ స్థాపించే ఆలోచనలో ఉన్నారనీ, అందుకోసమే ఫండ్ కంపెనీలతో చర్చిస్తున్నారనే వదంతులు రెండు మూడు వారాల క్రితం విన్పించాయి.

>
మరిన్ని వార్తలు