మోదీ మౌనం దురదృష్టకరం: చిదంబరం

5 Dec, 2019 16:40 IST|Sakshi

న్యూఢిల్లీ: బీజేపీ ఆర్థిక విధానాలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం తీవ్ర స్థాయిలో విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పలు కీలక విషయాలను ప్రస్తావించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్థిక వ్యవస్థ మందగమనం గురించి మౌనం వహించడం దురదృష్టకరమన్నారు. ఆర్థిక వ్యవస్థ నిర్వహణపై కేంద్ర ప్రభుత్వానికి అవగాహన, ముందుచూపు లేదంటూ మండిపడ్డారు. కాగా యూపీఏ హయాంలో(2004-2014) 14 కోట్ల దేశ ప్రజలను పేదరికం నుంచి సాంత్వన కలిగిస్తే బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ పాలనలో లక్షల మంది పేదరికంలో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధి రేటును ఆర్బీఐ ఏడు శాతంగా అంచనా వేస్తే అది నాలుగు శాతానికే పరిమితమైందని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోనే దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంటుందని ఆభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థ పతనానికి నోట్ల రద్దు, జీఎస్‌టీని సరియైన పద్దతిలో అమలు చేయకపోవడం, విపరీతమైన పన్నులు, పీఎంవో ఆఫీసు కేంద్రీకృత నిర్ణయాలు ప్రధాన కారణాలని ఆయన ధ్వజమెత్తారు.

కాగా, జైలు నుంచి విడుదలైన తర్వాత తనకు మొదట గుర్తొచ్చింది కశ్మీర్‌ ప్రజలేనని చిదంబరం తెలిపారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా  కేసులో 106 రోజులు జైలులో ఉండి బుధవారం బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. కశ్మీర్‌ ప్రజలు ఆగస్టు 4, 2019 నుంచి స్వేచ్ఛ కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అనుమతిస్తే తాను కశ్మీర్‌ ప్రజలను కలుస్తానన్నారు. ఈ మధ్య ఓ పారిశ్రామికవేత్త (రాహుల్‌ బజాజ్‌) కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికి ప్రజలు భయపడుతున్నారని విలేకర్ల ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఒక్క చోటే కాదు ప్రతిచోటా భయం ఉంది...మీడియా కూడా భయపడుతోందంటూ చిదంబరం వ్యాఖ్యానించారు. గాంధీ కుటుంభానికి ఎస్‌పీజీ భద్రత అవసరంలేదని ప్రభుత్వం భావిస్తే సరిపోదని అనుకోని సమస్య తలెత్తితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని చిదంబరం అన్నారు. గ్రామీణ వినియోగం, వేతనాలు దారుణంగా పడిపోవడం ఆర్థిక వ్యవస్థకు నష్టదాయకమని పలువురు ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా