బెయిల్‌ షరతులను చిదంబరం ఉల్లంఘించారు

5 Dec, 2019 17:01 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరంపై కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తీవ్రంగా విరుచుకుపడ్డారు. చిదంబరం బెయిల్‌ కండీషన్‌ను ఉల్లంఘించారని ఆరోపించారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా అవినీతి కుంభకోణం, మనీ ల్యాండరింగ్‌ కేసుల్లో చిదంబరానికి సుప్రీంకోర్టు బుధవారం బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. 106 రోజుల జైలు జీవితం తర్వాత ఆయన బుధవారం తీహార్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ కేసుకు సంబంధించి చిదంబరం మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని, బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని కోర్టు ఆంక్షలు విధించింది.  

(చదవండి : చిదంబరానికి బెయిల్‌)

జైలు నుంచి బయటకు వచ్చిన చిదంబరం ..గురువారం పార్లమెంట్‌ సమావేశాలకు హాజరయ్యారు. అనంతరం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర మంత్రిగా తన రికార్డు స్వచ్ఛంగా ఉందని చెప్పారు. ‘అంతిమంగా న్యాయమే గెలుస్తుందన్న నమ్మకం నాకుంది. మంత్రిగా ఉన్న సమయంలో నేను ఏం చేశానో అందరికీ తెలుసు’ అని చిదంబరం అన్నారు. 

ఈ నేపథ్యంలో ప్రకాశ్ జవదేకర్ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ చిదంబరం బెయిల్‌ షరతులను ఉల్లంఘించారని ఆరోపించారు. చిదంబరానికి వ్యతిరేకంగా నమోదైన ఈ కేసు.. కేంద్ర మంత్రిగా ఆయన పని చేసిన కాలంలో అవినీతికి సంబంధించినదేనని గుర్తు చేశారు. అటువంటి నేపథ్యంలో కేంద్ర మంత్రిగా తన రికార్డు స్వచ్ఛంగా ఉందని చెప్పడం బెయిల్‌ షరతులను ఉల్లంఘించడమేనని ఆరోపించారు. తాను బహిరంగంగా ఎటువంటి స్టేట్‌మెంట్లు ఇవ్వబోనని బెయిల్‌ తెచ్చుకున్న చిదంబరం .. ఇప్పుడు కేంద్ర మంత్రిగా తన రికార్డు స్వచ్ఛంగా ఉందన్నారని, ఇది స్వీయ ధ్రువపత్రం ఇచ్చుకోవడమేనని జవదేకర్‌ అన్నారు. ‘కొంతమంది బెయిల్‌ తెచ్చుకొని బయట తిరుగుతున్నారు. అంతమాత్రనా వాళ్లు స్వాతంత్ర్య సమరయోధులు కాబోరు’ అని పరోక్షంగా కాంగ్రెస్‌ నాయకులను విమర్శించారు.

మరిన్ని వార్తలు