జీఎస్‌టీతో బిజినెస్‌కు జోష్‌!!

27 Jun, 2018 00:46 IST|Sakshi

డెలాయిట్‌ వార్షిక సీఎఫ్‌వో సర్వేలో వెల్లడి  

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అమలులోకి వచ్చి దాదాపు ఏడాది కావొస్తోంది. మొత్తంగా చూస్తే దేశంలోని వ్యాపార పరిస్థితులపై జీఎస్‌టీ సానుకూల ప్రభావం చూపించిందని చాలా మంది చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్లు (సీఎఫ్‌వో) అభిప్రాయపడ్డారు. ఈ అంశం డెలాయిట్‌ సర్వేలో వెల్లడయ్యింది. డెలాయిట్‌ ఇండియా వార్షిక సీఎఫ్‌వో సర్వే ప్రకారం..  
దేశీ వ్యాపార పరిస్థితులపై జీఎస్‌టీ సానుకూల ప్రభావం చూపించిందని 77 శాతం మంది సీఎఫ్‌వోలు విశ్వసిస్తున్నారు.
ఇటీవలి సంస్కరణలు వచ్చే రెండేళ్ల కాలంలో ఫలితాలనందిస్తాయనే అంచనాలతో 57 శాతం మంది సీఎఫ్‌వోలు వారి వ్యాపారంలో సవాళ్లను స్వీకరించడానికి కూడా సిద్ధమయ్యారు.    జీఎస్‌టీ ప్రభావం ఆదాయం, సప్లై చైన్‌లపై బాగా ప్రతిబింబిస్తుంది.
 58 శాతం మంది సీఎఫ్‌వోలు వ్యాపార నిర్వహణలో (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌) మెరుగుదల కనిపించిందన్నారు.  
  నాణేనికి మరోవైపు.. జీఎస్‌టీ అమలు తర్వాత వర్కింగ్‌ క్యాపిటల్‌పై ప్రతికూల ప్రభావం పడిందని 66% మంది సీఎఫ్‌వోలు, ఫైనాన్స్‌ వ్యయంపై ప్రతికూల ప్రభావం పడిందని 55% మంది సీఎఫ్‌వోలు అభిప్రాయపడ్డారు.  
వచ్చే 12 నెలల కాలంలో ఉద్యోగుల సంఖ్య పెరగొచ్చని 53 శాతం మంది సీఎఫ్‌వోలు అంచనా వేశారు.  
 రెవెన్యూ వృద్ధి ఉంటుందని 83 శాతం మంది, ఆపరేటింగ్‌ మార్జిన్లు పెరగొచ్చని 45 శాతం మంది సీఎఫ్‌వోలు విశ్వాసం వ్యక్తంచేశారు.   

జూలై 1న జీఎస్‌టీ తొలి వార్షికోత్సవం!
కేంద్రం జీఎస్‌టీ తొలి వార్షికోత్సవాన్ని ఘనంగా జరపడానికి కసరత్తు చేస్తోంది. ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ సహా పరిశ్రమ చాంబర్లు, వ్యాపారులు, పన్ను అధికారులు పాల్గొనేలా జూలై 1న ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ కూడా ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడనున్నారు.

జూలై 1ని ‘జీఎస్‌టీ–డే’గా జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందుకోసం దేశ రాజధానిలో కొత్తగా నిర్మించిన అంబేడ్కర్‌ భవన్‌లో ఒక మెగా ఈవెంట్‌ను నిర్వహించనుందని విశ్వసనీయ సమాచారం. స్వాతంత్య్రం తర్వాత అతిపెద్ద పన్ను సంస్కరణగా అభివర్ణిస్తున్న జీఎస్‌టీ  2017 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది.

మరిన్ని వార్తలు