భారత్‌లోకి ‘చైనా యాపిల్’!

9 Jul, 2014 07:28 IST|Sakshi
భారత్‌లోకి ‘చైనా యాపిల్’!

 న్యూఢిల్లీ: చైనాకు చెందిన షియోమి కంపెనీ భారత్‌లో తన తొలి స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం ఆవిష్కరించింది. చైనా యాపిల్‌గా ప్రసిద్ధి చెందిన ఈ కంపెనీ ఎంఐ3 స్మార్ట్‌ఫోన్‌ను రూ.14,999కు భారత్‌లో అందిస్తోంది. వచ్చేవారం నుంచి ముందస్తు బుకింగ్‌లు ప్రారంభమవుతాయని షియోమి వెబ్‌సైట్ పేర్కొంది. ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్‌ల విక్రయాలు జరిగే అవకాశాలున్నాయి.

 86 సెకన్లలో లక్ష ఫోన్‌ల విక్రయాలు
 ఈ కంపెనీ ఎంఐయూఐ వీ5 పేరుతో ఆండ్రాయిడ్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను కస్టమైజ్ చేసింది. ఎంఐయూఐ వీ5 ఓఎస్‌పై పనిచేసే ఈ ఎంఐ 3 స్మార్ట్‌ఫోన్‌లో 5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ 1080పి ఎల్‌సీడీ టచ్ డిస్‌ప్లే, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 800 2.3 గిగా హెర్ట్జ్ ప్రాసెసర్, అడ్రెనో 330 450 మెగా హెర్ట్జ్ జీపీయూ, 2 జీబీ ర్యామ్, ఈఎంఎంసీ 4.5 ఫ్లాష్ మెమరీ, 16 జీబీ, 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 3050 ఎంఏహెచ్ లిథియమ్-ఐయాన్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి. ఈ కంపెనీ ఉత్పత్తులకు చైనాలో ఎంత క్రేజ్ ఉందంటే, ఆన్‌లైన్‌లో ఎంఐ 3 ఫోన్‌లు 86 సెకన్లలోనే  లక్ష  అమ్ముడు కావడం విశేషం.

 ఆన్‌లైన్‌లోనే అమ్మకాలు
 షియోమి కంపెనీ ప్రపంచంలోనే ఆరవ, చైనాలో మూడో  అతి పెద్ద మొబైల్ ఫోన్ల కంపెనీ. 2010లో ఈ కంపెనీని  లీ జున్ ప్రారంభించారు. బీజింగ్ కేం ద్రంగా పనిచేసే ఈ కంపెనీ అనతికాలంలోనే అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం ఈ సంస్థ ఇప్పటికే 1.7 కోట్ల హ్యాండ్‌సెట్లను విక్రయించింది. ఎంఐ 3, రెడ్‌మి, ఎంఐ వై-ఫై, ఎంఐ బాక్స్ తదితర హ్యాండ్‌సెట్లను అందిస్తోంది. ఈ కంపెనీ ఆన్‌లైన్‌లోనే తన ఉత్పత్తులను విక్రయిస్తోంది. రిటైల్ స్టోర్స్‌లో ఎక్కడా తన ఫోన్‌లను విక్రయించదు.  

ఇక కంపెనీ మొత్తం ఆదాయంలో 1 శాతమే మార్కెటింగ్‌కు కేటాయిస్తోంది(శామ్‌సంగ్ కేటాయింపు 5.1%). ఇలా ఆదా చేసిన సొమ్ములతో నాణ్యమైన విడిభాగాలను కొనుగోలు చేసి అత్యంత ఆధునిక ఫీచర్లున్న ఫోన్‌లను తక్కువ ధరకే అందిస్తోంది. షియోమి కంపెనీ భారత కార్యకలాపాలను  జబాంగ్ సహ వ్యవస్థాపకుడు మను కుమార్ జైన్ చూస్తారు. ఈ మేరకు షియోమి కం పెనీ ఆయనతో ఒప్పందం కుదుర్చుకుంది. హువాయి, జెడ్‌టీఈ, లెనొవొ, జియోని, అప్పో వంటి ఇతర చైనా కంపెనీలు ఇప్పటికే భారత్‌లో స్మార్ట్‌ఫోన్లను విక్రయిస్తున్నాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు