విదేశీ ఎక్సే్చంజీల్లో ప్రభుత్వ బాండ్ల లిస్టింగ్‌!

22 Feb, 2020 06:10 IST|Sakshi

ఆర్‌బీఐ గవర్నర్‌ సంకేతాలు  

న్యూఢిల్లీ: విదేశీ సంస్థల నుంచి దేశానికి మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించే కీలక చర్యలకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) శ్రీకారం చుడుతోంది. విదేశీ ఎక్సే్చంజ్‌ల్లో ప్రభుత్వ బాండ్ల లిస్టింగ్‌కు తగిన ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇందుకు సంబంధించి కొన్ని సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ‘‘గ్లోబల్‌ ఇండెక్స్‌లను నిర్వహించే పలు సంస్థలతో చర్చలు జరుపుతున్నాం. ఈ చర్చలు పురోగతిలో ఉన్నాయి. అయితే ఎప్పటిలోగా ప్రభుత్వ బాండ్లు విదేశీ ఎక్సే్చంజ్‌ల్లో లిస్టవుతాయన్న విషయాన్ని మాత్రం నేను చెప్పలేను’’ అని ఆర్‌బీఐ గవర్నర్‌ తెలిపారు.

విదేశీ ఎక్సే్చంజ్‌ల్లో ప్రభుత్వ బాండ్ల లిస్టింగ్‌కు విదేశీ ఇన్వెస్టర్ల నుంచి సుదీర్ఘకాలంగా సూచనలు అందుతున్నాయి. అయితే దీనికి 2020–21 బడ్జెట్‌లోనే సూత్రప్రాయ ఆమోదముద్ర పడింది. ‘‘కొన్ని నిర్దిష్ట కేటగిరీల ప్రభుత్వ బాండ్లను నాన్‌–రెసిడెంట్‌ ఇన్వెస్టర్లకు ఉద్దేశించడం జరుగుతోంది. దేశీయ ఇన్వెస్టర్లతోపాటు విదేశీ ఇన్వెస్టర్లకూ ఈ బాండ్లు అందుబాటులో ఉంటాయి’’ అని తన ఫిబ్రవరి 1 బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. కాగా ద్రవ్య స్థిరత్వానికి ఆర్‌బీఐ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, 50 ఎన్‌బీఎఫ్‌సీల పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తోందని గవర్నర్‌ తన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. బ్యాంకులుసహా ఫైనాన్షియల్‌ విభాగం మొత్తం ఆర్థిక పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందనీ ఆయన పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు