డెల్టా కార్ప్‌- ఎవరెడీ ఇండస్ట్రీస్‌.. జూమ్‌

15 Jul, 2020 13:17 IST|Sakshi

2వ రోజూ ఎవరెడీ ఇండస్ట్రీస్‌ జోరు

డాబర్‌ ప్రమోటర్ల వాటా కొనుగోలు ఎఫెక్ట్‌

డెల్టా కార్ప్‌ క్యూ1 ఫలితాలు వీక్‌

లైసెన్స్‌ ఫీజు రద్దుపై అంచనాలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించినప్పటికీ కేసినో, రియల్టీ సంస్థ డెల్టా కార్ప్‌ కౌంటర్‌కు డిమాండ్ నెలకొంది. మరోపక్క ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం డాబర్‌ ప్రమోటర్లు వాటాను పెంచుకున్న వార్తలతో వరుసగా రెండో రోజు లైటింగ్‌ ప్రొడక్టుల కంపెనీ ఎవరెడీ ఇండస్ట్రీస్‌ వెలుగులో నిలుస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..

డెల్టా కార్ప్‌
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో డెల్టా కార్ప్‌ రూ. 28.2 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది క్యూ1లో రూ. 42.5 కోట్ల నికర లాభం ఆర్జించింది. లాక్‌డవున్ ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 74 శాతం క్షీణించి రూ. 48.3 కోట్లకు పరిమితమైంది. ఈ క్యూ1లో దాదాపు రూ. 22 కోట్లమేర  పన్ను వ్యయాలు నమోదుకాగా.. గత క్యూ1లో రూ. 6 కోట్ల రైట్‌బ్యాక్‌ లభించినట్లు డెల్టా కార్ప్‌ తెలియజేసింది. అంతేకాకుండా లాక్‌డవున్‌ కారణంగా కేసినో లైసెన్స్‌ ఫీజును రద్దు చేయవలసిందిగా గోవా ప్రభుత్వాన్ని అర్ధించినట్లు తెలియజేసింది. లాక్‌డవున్‌ కాలంలో ఆన్‌లైన్‌ గేమింగ్‌ ఆదాయం భారీగా పెరిగినట్లు వెల్లడించింది. దీంతో ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం డెల్టా కార్ప్‌ షేరు 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 94 సమీపంలో ఫ్రీజయ్యింది.

ఎవరెడీ ఇండస్ట్రీస్‌
ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం డాబర్‌ ప్రమోటర్లు బర్మన్‌ కుటుంబం తాజాగా 8.48 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు వెల్లడికావడంతో బ్యాటరీల తయారీ కంపెనీ ఎవరెడీ ఇండస్ట్రీస్‌ షేరు జోరు చూపుతోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఎవరెడీ షేరు 6 శాతం జంప్‌చేసి రూ. 94 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 98 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. మంగళవారం సైతం ఈ షేరు 10 శాతం దూసుకెళ్లిన విషయం విదితమే. అదనపు వాటా కొనుగోలు నేపథ్యంలో తాజాగా ఎవరెడీ ఇండస్ట్రీస్‌లో బర్మన్‌ కుటుంబ వాటా 19.84 శాతానికి ఎగసినట్లు తెలుస్తోంది. గతంలో ఈ వాటా 11.35 శాతంగా నమోదైంది.

మరిన్ని వార్తలు