ప్రముఖ సంస్థపై కేసులు.. ఉత్పత్తులపై క్యాన్సర్ ఆరోపణలు!

19 Oct, 2023 17:05 IST|Sakshi

యూఎస్‌, కెనడాల్లో 5,400 కేసులు నమోదు

డాబర్ కంపెనీకి సంబంధించిన మూడు అనుబంధ సంస్థలపై యూకే, కెనడాలో వేల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. సంస్థ తయారుచేస్తున్న హెయిర్ రిలాక్సర్ ఉత్పత్తులు అండాశయ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్‌కు కారణమవుతున్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. డాబర్ కంపెనీ ఆయా దేశాల్లో ఈ ఉత్పత్తులను వివిధ బ్రాండ్ పేర్లతో విక్రయిస్తోంది. ఎఫ్‌ఎంసీజీ కంపెనీలపై ఇప్పటికే 5,400 కేసులు నమోదయ్యాయి. 

డాబర్ అనుబంధ సంస్థలైన నమస్తే లేబొరేటరీస్, డెర్మోవివా స్కిన్ ఎసెన్షియల్స్, డాబర్ ఇంటర్నేషనల్ సంస్థల​పై వివిధ కోర్టుల్లో కేసులు దాఖలయ్యాయి. దీనికి తోడు ఇటీవల డాబర్ ఇండియా రూ.320.6 కోట్లకు జీఎస్టీ డిమాండ్ వడ్డీ, జరిమానా నోటీసును అందుకుంది.

క్యాన్సర్ ఆరోపణలపై కంపెనీ స్పందిస్తూ.. ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, సరైన పరిశోధన చేయకుండానే అనుబంధ సంస్థలపై కేసులు పెట్టారని పేర్కొంది. కేసుల పరిష్కారానికి కంపెనీ లీగల్‌ వాభాగాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఈ వార్తల నేపథ్యంలో డాబర్ స్టాక్స్ మార్కెట్లో నష్టపోయాయి. అయితే ఈ అంశం వల్ల ఆర్థిక కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం ఉండదని కంపెనీ పేర్కొంది.

డాబర్..చ్యవన్‌ప్రాష్, హోనిటస్ దగ్గు సిరప్, లాల్ దంత్‌ మంజన్ టూత్‌పేస్ట్, అశోకరిష్ట టానిక్, రియల్ జ్యూస్‌లు, ఓడోమాస్, వాటికా హెయిర్ ప్రొడక్ట్స్, పుదిన్‌ హర, హజ్మోలా వంటి ఉత్పత్తులను తయారు చేస్తుంది.

మరిన్ని వార్తలు